
శాంతిపురం (చిత్తూరు జిల్లా): జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతూ విద్యుదాఘాతానికి గురై చిత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు మృతిచెందారు. శాంతిపురం మండలంలోని కడపల్లి పంచాయతీ కదిరివోబనపల్లి క్రాస్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కడపల్లి పంచాయతీలోని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు బుధవారం పవన్ జన్మదిన కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జాతీయ రహదారి పక్కన బ్యానర్లు కట్టారు. ఈ సందర్భంగా ఓ 30 అడుగుల ఫ్లెక్సీ విద్యుత్ తీగల మీద పడి కడపల్లికి చెందిన రాజేంద్ర, సోమశేఖర్, అరుణాచలం అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అరుణ్, హరి, పవన్.. కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతుల్లో రాజేంద్ర, సోమశేఖర్ అన్నదమ్ములు.