అత్తిలి (పశ్చిమగోదావరి): సినీ హీరోలను ఫోన్‌లో వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకునే విషయమై ఇద్దరు పెయింటర్ల మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసింది. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏలూరుకు చెందిన హరికుమార్, కిశోర్ పెయింటర్లు. మూడు రోజుల క్రితం వీరు అత్తిలి మసీదు వీధిలో నజీర్‌కు చెందిన కొత్త ఇంటికి రంగులు వేసే పనుల నిమిత్తం వచ్చారు.
పనులు చేసుకుంటూ ఇక్కడే నిద్రిస్తున్నారు. హరికుమార్ హీరో ప్రభాస్ అభిమాని. ఏలూరు ప్రభాస్ అభిమాన సంఘానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. శుక్రవారం రాత్రి తన ఫోన్ వాట్సాప్‌లో ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. కిశోర్ పవన్‌కల్యాణ్ అభిమాని కావడంతో పవన్ కల్యాణ్‌ను స్టేటస్‌గా పెట్టుకోవాలని హరికుమార్‌ను కోరాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం రేగింది. దీంతో క్షణికావేశంలో హరికుమార్ సెంట్రింగ్ కర్రతో కిశోర్ తలపై బలంగా కొట్టి అక్కడే ఉన్న సిమెంటు రాయితో ముఖంపై బాదడంతో కిశోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, నర్సాపురం డీఎస్పీ రవిమనోహరాచారి, తణుకు సీఐ ఆంజనేయులు ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు హరికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎస్సై కేసీహెచ్ స్వామి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కిశోర్ భార్యతో విడాకులు తీసుకున్నాడని, ఒక కుమారుడు ఉన్నాడని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment