
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని చూస్తున్నారని, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని పేరుతో తాను, తన రియల్ ఎస్టేట్ బినామీల అవకతవకలు బయట పడుతున్నాయని, వాటిని కప్పి పుచ్చడానికే చంద్రబాబు పోరాటం పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు.
రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు పెరుగుతాయని రైతులను మభ్యపెట్టి.. ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా మోసగించింది చంద్రబాబేనన్నారు. ఐదేళ్ల పాలనలో రైతులకు ఏమీ చేయనందుకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన రైతులంతా కరకట్ట వద్ద ఆయన నివాసానికి వెళ్లాలని, ఆయన్ను నిలదీయాలని గడికోట సూచించారు. తాము పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాం తప్ప.. దేనినీ తరలించడం లేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు చెప్పిన విధంగా అభివృద్ధి వికేంద్రీకరణకు తాము ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు.
చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు ఎక్కడ అప్పగిస్తారోనని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆ భయంతోనే రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. రైతుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగు వారి ఐక్యత కోసం గతంలో రాజధానిని త్యాగం చేసిన రాయలసీమలో ఇప్పుడు హైకోర్టును పెడుతుంటే చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం ఆ ప్రాంత రైతాంగం 80 వేల ఎకరాలను త్యాగం చేసిన విషయం చంద్రబాబుకు గుర్తుకు రాలేదా? అని గడికోట ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment