తెలంగాణ బిల్లును అసెంబ్లీలో నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. అందుకోసమే ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
శుక్రవారం ముద్దుకృష్ణమ నాయుడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గాలికి కొట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ను ఎలా విభజిస్తారంటూ దిగ్విజయ్పై నిప్పులు కక్కారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టేందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చిందని గాలి మండిపడ్డారు.