ఇద్దరిలో ఒక్కరే
Published Sun, Mar 9 2014 1:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు అమరరాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ గల్లా జయదేవ్ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ‘దేశం’ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, తెనాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆయన మామ ఘట్టమనేని ఆదిశేషగిరిరావుఎన్నికల బరిలో ఉంటారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆదిశేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, గల్లా జయదేవ్‌కు గుంటూ రు పార్లమెంట్ నియోజకవర్గం కేటాయించే విధంగా చంద్రబాబుతో మొదట్లోనే ఒప్పం దం జరిగినట్టు పార్టీ వర్గాల కథనం. అందుకు అనుగుణంగానే ఇరువురు రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
గల్లా జయదేవ్ ఒక అడుగు ముందుకేసి అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదిశేషగిరిరావు కూడా తెనాలి నియోజకవర్గానికి చెందిన ముఖ్యులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ఇదిలావుంటే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన నియోజకవర్గమైన తెనాలి సీటును తనకే కేటాయించాలని, అలా కాని పక్షంలో పరిస్థితులు మరో విధంగా ఉంటాయని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో అధినేత ఇంత వరకు ఈ సీటుపై నిర్ణయం తీసుకోలేదు. మామ, అల్లుడు ఒకేసారి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ తెనాలిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో గల్లా జయదేవ్ మాత్రమే పార్టీలో చేరారు. ఆయన మామ ఘట్టమనేని చేరిక నిలిచిపోయింది. ఇక తెనా లి సీటు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు దక్కే అవకాశా లు ఉన్నాయని ఆ వర్గం చెబుతోంది. గల్లా జయదేవ్, దేవినేని మల్లికార్జునరావులు పార్టీలో చేరిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement