సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపులో ప్రభుత్వం కనికట్టు ప్రదర్శిస్తోంది. 2010–11లో ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ (జలాశయం) పనుల అంచనా వ్యయం రూ.6,600.56 కోట్లు. ఇది 2015– 16 నాటికి అప్పటి స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్ (ఎస్‌ఎస్‌ఆర్) ధరల ప్రకారం రూ.6,730.10 కోట్లకు చేరింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అనుమతి తీసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అ ప్రకారం నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. 2013–14 ధరల ప్రకారం అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తామని తేల్చి చెప్పింది.
దాంతో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత నెల 26న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు అందజేశారు. విచిత్రం ఏమిటంటే హెడ్‌వర్క్స్ పనుల అంచనా వ్యయం 2015–16లో కన్నా 2013–14లో అధికంగా ఉండటం. 2013–14లో హెడ్‌వర్క్స్ పనుల అంచనా విలువను రూ.11,637.98 కోట్లుగా ముఖ్యమంత్రి తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అయితే ఇది 2015–16 అంచనా వ్యయం కన్నా తక్కువగా ఉండాల్సి ఉండగా ఏకంగా రూ.4,907.88 కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. పోనీ హెడ్‌వర్క్స్ పనుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, అదనంగా చేరడం తదితరాలు ఏమైనా ఉన్నాయా అంటే లేనే లేవు. అంచనా వ్యయం పెంపుతో పాటు మొత్తం రూ.6,223.56 కోట్లను కాంట్రాక్టర్లతో కలిసి నొక్కేయడానికి ముఖ్యనేత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
పీపీఏ అనుమతి లేకుండానే..
నిబంధనల ప్రకారం పనుల ఒప్పందం గడువు ముగిసే వరకు అంచనా వ్యయాన్ని సవరించకూడదు. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందం గడువు మార్చి, 2018తో ముగుస్తుంది. పోలవరం నిర్మాణ బాధ్యతలు కేంద్రం నుంచి దక్కించుకున్న మరుసటి రోజే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.6,730.10 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం: 96) జారీ చేసింది. ఇదే క్రమంలో పోలవరం కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు, ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు పెంచేస్తూ డిసెంబర్ 6, 2016న ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెం: 117, 118)ను జారీ చేసింది. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని పెంచాలంటే పీపీఏ, నీతి అయోగ్, కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖల అనుమతి తప్పనిసరి. కానీ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యనేత ఒత్తిడితో..
పెంచిన అంచనా వ్యయం మేరకు నిధులు ఇవ్వాలని ఆర్నెల్ల క్రితం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం ఆ ప్రతిపాదనలు తోసిపుచ్చడంతో 2013–14 ధరల ప్రకారం ప్రతిపాదనలు రూపొందించాలని జలవనరుల శాఖను ఆదేశించింది. ఇదే సమయంలో ముఖ్యనేత అంచనా వ్యయాన్ని భారీగా పెంచాలంటూ ఒత్తిడి తెచ్చారని అధికారవర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇలా పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.6,730.10 కోట్ల నుంచి రూ.11,637.98 కోట్లకు పెంచేశారు. ఎడమ కాలువ వ్యయం 3,.645.15 నుంచి రూ.4,960.83 కోట్లకు పెంచేశారు. భూసేకరణ, సహాయ పునరావాస కల్పనతో కలిపి అంచనా వ్యయం రూ.58,319.06 కోట్లకు పెంచిన ప్రతిపాదనలను సీఎం కేంద్రానికి అందజేశారు.
నీతి అయోగ్ ఆమోదిస్తేనే..
ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన మేరకు పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం ఏప్రిల్ 1, 2014 నుంచి నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఏప్రిల్ 1, 2014 వరకు ప్రాజెక్టుకు రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రం, తాగునీటి ప్రాజెక్టు అంచనా వ్యయంపోనూ నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.12,294.40 కోట్లు. ఇందులో ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను మినహాయిస్తే రూ.7,158.53 కోట్లను మాత్రమే ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది.
ఏప్రిల్ 1, 2014 నుంచి ఇప్పటివరకు రూ.4,329.06 కోట్లను కేంద్రం విడుదల చేసింది. మరో రూ.2,829.47 కోట్లను విడుదల చేస్తే ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసినట్లు అవుతుంది. కానీ.. 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.58,319.06 కోట్లుగా చూపిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,205.66 కోట్లు పోనూ మిగతా అంటే రూ.49,907.74 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపింది. వీటిని నీతి అయోగ్ ఆమోదిస్తే ఆ మేరకు ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. లేదంటే రూ.2,829.47 కోట్లను మాత్రమే కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంటుంది.
Published Tue, Oct 3 2017 4:24 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement