సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో గేమింగ్, యానిమేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ (గేమ్) సిటీ స్థలంపై వివాదమేమీ లేదని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఎండీ జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ప్రతిపాదిత స్థలంలో హెరిటేజ్ రాక్స్ ఉన్నందున నిర్మాణాలు చేపట్టవద్దనే వాదన సరికాదన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో కలసి ఆయన శుక్రవారం ఏపీఐఐసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 439 ఎకరాలున్న రాయదుర్గం భూమిలో హెరిటేజ్ రాక్స్ ఉన్నట్లు హుడా 2008లో పేర్కొందన్నారు. రెండు కంపెనీల (పూర్వాంకర, డీఎల్‌ఎఫ్)కు కేటాయించిన స్థలంలో కట్టడాలు నిర్మించరాదని హెరిటేజ్ టెక్నికల్ కమిటీ పేర్కొందన్నారు.
మిగిలిన ప్రాంతాల్లో కొన్ని మార్పులతో నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపిందన్నారు. సమస్య ఉన్న రెండు కంపెనీలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ నెల 6న చూపించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో యూనిట్ ఏర్పాటు వద్దని నిర్ణయించుకున్నట్టు పూర్వాంకర తెలిపిందన్నారు. సదరు సంస్థ చెల్లించిన రూ. 400 కోట్లను వాపస్ ఇస్తామన్నారు. డీఎల్‌ఎఫ్ సంస్థ విషయంలో మాత్రం ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతామన్నారు. ఐటీ మంత్రి, సీఎంలపై విమర్శలు సరికాదన్నారు.
గేమింగ్ సిటీ స్థలం వివాదరహితం
Published Sat, Jan 11 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement