
వారణాసిలో అతిరుద్ర మహాయాగంలో గణపతి సచ్చిదానంద స్వామి
సాక్షి, అమరావతి: ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకల్యాణం, ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదో రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తండ్రి వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని, దీనిపై పలువురు వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లిషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లల్నంతా ఇంగ్లిషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే విమర్శలు చేయడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment