
గండ్ర వెంకట రమణారెడ్డి
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టండి మద్దతు ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం విభజనపై అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన శనివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. విభజన అంశంపై ఇప్పటికి చంద్రబాబుకు స్పష్టత రాలేదన్నారు.
విభజన ప్రక్రియపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజల మధ్య సఖ్యత కోసమే సీమాంధ్రకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఆ ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు గండ్ర తెలిపారు.