
పాపం.. గంట కొట్టేశారు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒకే రోజు రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా విశాఖపట్నంలో ఇందిరానగర్ బస్తీ వాసులు మంగళవారం ఉదయం తమను అక్కడినుంచి ఖాళీ చేయించడానికి వీల్లేదంటూ ఆయనను ఘెరావ్ చేసి, ఇంటిముందు నినాదాలు చేశారు. ఇందిరానగర్ బస్తీని ఖాళీ చేయించి, అక్కడున్నవారికి వేరే ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించాలని జీవీఎంసీ భావిస్తోంది. నగర సుందరీకరణలో భాగంగా ఇలా చేయాలని కార్పొరేషన్ తలపెడుతోంది. దీన్ని బస్తీవాసులు వ్యతిరేకిస్తున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఎడ్ విద్యార్థులు కూడా గంటా శ్రీనివాసరావును అడ్డుకున్నారు. కాకినాడ జేఎన్టీయూకు వచ్చిన ఆయనను పట్టుకుని నిలదీశారు. డీఎడ్ చేసిన వారికి డీఎస్సీలో ఎందుకు అవకాశం కల్పించరంటూ ఆయనను ప్రశ్నించారు. దాంతో వారికి వచ్చే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్నారు. ఒకేరోజు గంటా శ్రీనివాసరావుకు ఇలా రెండు రకాలా చేదు అనుభవాలు ఎదురైనట్లయింది.