విశాఖ వన్డేపై గంటా, పసుపులేటి మాటల యుధ్దం
విశాఖపట్టణం: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈనెల 24న వైజాగ్‌లో జరగనున్న వన్డే మ్యాచ్‌పై రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి. బాలరాజు మాటల యుద్ధం మొదలు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను అడ్డుకుంటామని గంటా చెబుతుండగా, పటిష్ట భద్రతతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహిస్తామని బాలరాజు అంటున్నారు.
సీమాంధ్ర ప్రజలందరూ రోడ్డుమీదకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని, క్రికెట్‌ను ఆస్వాదించడానికిది సమయం కాదని గంటా పేర్కొన్నారు. ఈ మేరకు బీసీసీఐకి లేఖ కూడా రాసినట్టు చెబుతున్నారు. ఉద్యమాలతో అట్టుడుకుతుంటే క్రికెట్ మ్యాచ్ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అయితే గంటా వ్యాఖ్యలను బాలరాజు తప్పుబట్టారు. ఇక్కడ మ్యాచ్ నిర్వహిస్తే వైజాగ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. భారత్, విండీస్ వన్డే ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ను అడ్డుకోవద్దని గంటాను కోరారు. సమైక్య ముసుగులో గంటా రాజకీయ ప్రయోజనం కోసం పాకులాడుతున్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇద్దరు మంత్రుల రాజకీయాల నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అభిమానులు కంగారు పడుతున్నారు. భారత్, విండీస్ జట్ల మధ్య ఈ నెల 24న రెండో వన్డే జరగాల్సివుంది.