=సిలిండర్ ధర పెంచిన సర్కారు
=సబ్సిడీ సిలిండర్‌పై రూ.30, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.215 పెంపు
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: గ్యాస్ సిలిండర్ల ధర పెంచుతూ జనంపై సర్కారు పెనుభారం మోపింది. ప్రజలు ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకగా దీన్ని జనం నెత్తినవేసింది. పదిహేను రోజుల క్రితం ఒక్కో సిలిండర్‌పై 13 రూపాయల చొప్పున కేంద్రం పెంచింది. ఇది చాలదన్నట్లు బుధవారం మరోమారు కొరడా ఝుళిపించింది. ఒక్కో సిలిండర్‌పై 30 రూపాయల చొప్పున పెంచి వినియోగదారుల నెత్తిన మరింత భారం వేసింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలసి సిలిండర్ ధర 1145 రూపాయలకు చేరుకుంది. జిల్లాలో సుమారు ఏడు లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దీపం కనెక్షన్ కలిగిన వారు రెండు లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించే సిలిండర్ల సంఖ్య సుమారు మూడు వేల వరకు ఉంది.
నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.215 భారం
నాన్ సబ్సిడీ సిలిండర్ వినియోగదారులనూ కేంద్ర ప్రభుత్వం విడిచి పెట్టలేదు. ఈ కోటాలో వినియోగదారులు ఇప్పటి వరకు రూ.1112.50 వంతున చెల్లిస్తున్నారు. ఈ సిలిండర్ల ధరను 215 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వినియోగదారులు 1327.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సిలిండర్లు వినియోగించే 8,865 మందిపై భారం పడింది. అలాగే గృహ వినియోగదారులు 9 సిలిండర్ల కోటా దాటితే రూ.1327.50 చొప్పున కొనాల్సిందే. సిలిండర్ల ధర పెంపు నేపథ్యంలో వినియోగదారులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ధరల పెంపునకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధర పెంచుకుంటూ పోతే ఎలా
ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం అన్యాయం. ఇప్పటికే రాయితీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో సరిగా జమ కావడం లేదు. ఆధార్‌తో లింక్ పెట్టి రాయితీ సొమ్ము నెలలు తరబడి వేయడం లేదు. దీనికితోడు ప్రతి పదిహేను రోజులకోసారి సిలిండర్ల ధర పెంచుకుంటూ పోతే ఎలా.
-దీప్తి, గృహిణి, చిత్తూరు
సామాన్యుల పరిస్థితి ఏంటి
ప్రతి పదిహేను రోజులకోసారి ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బతుకుతారు. జనం పరిస్థితిని కేంద్రం ఇకనైనా పట్టించుకోవాలి. అలాగే ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ప్రభుత్వం రాయితీపై సిలిండర్ ఇవ్వాలి.
-కవిత, గృహిణి , చిత్తూరు