
10 నుంచి సబ్సిడీ ధరకే వంట గ్యాస్
నగదు బదిలీ తాత్కాలికంగా నిలిపివేత
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
ఈ ఏడాది సబ్సిడీ సిలిండర్లు పదకొండే.. వచ్చే ఏడాది నుంచి 12
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్‌కు ఆధార్ బంధం తెగిపోయింది. సోమవారం నుంచి పాత పద్ధతిలో సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు అందనున్నాయి. వంట గ్యాస్‌కు నగదు బదిలీపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు బదిలీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి అయిదు రోజుల ముందే వంట గ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేయాలని నిర్ణయించింది. తద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తోంది.
అయితే ప్రస్తుతం ఉన్న నగదు బదిలీ విధానంలోని సాఫ్ట్‌వేర్ స్థానంలో పాత విధానంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు వీలుగా సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు పది రోజులు సమయం పడుతుందని డీలర్లు చెప్పడంతో ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది. సాఫ్ట్‌వేర్ సిద్ధమవడంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆధార్ లేకపోయినా వినియోగదారులందరికీ ఈనెల పదో తేదీ (సోమవారం ) నుంచి పాత పద్ధతిలో సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ డీలర్లను ఆదేశించాయి. దీంతో మార్కెట్ ధర రూ.1,167.50 చెల్లించి సిలిండర్ తీసుకుని తర్వాత బ్యాంకు అకౌంట్‌లో సబ్సిడీ ఎప్పుడు జమ అవుతుందా అని ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై వినియోగదారులకు ఉండదు. అయితే, సబ్సిడీ ధరపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 441 వరకు ఉండే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు వినియోగదారులకు 11 సబ్సిడీ సిలిండర్లే వస్తాయని, వచ్చే ఏడాది నుంచి మాత్రం 12 వస్తాయని అధికారులు తెలిపారు.