గ్రామాల్లో గ్యాస్ సిలిండర్‌లను సరఫరా చేసే వాహనం
భీమవరం (ప్రకాశం చౌక్): గ్యాస్ వినియోగదారులకు రవాణా చార్జీలు పెనుభారంగా మారాయి. రోజురోజుకూ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పాటు రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేయడం వీరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రవాణా చార్జీల భారం మరీ ఎక్కువగా ఉంది. ఏజెన్సీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రూ.40 వరకూ అదనంగా..
గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు సిలిండర్‌లను సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీని బట్టి వారంలోపు సిలిండర్‌ను వినియోగదారుడికి అందిస్తున్నారు. సాధారణంగా సిలిండర్ డెలివరీకి ఐదు కిలోమీటర్లలోపు ఎటువంటి చార్జీలు వసూలు చేయకూడదు. ఐదు కిలోమీటర్లు దాటితే రూ.10 మించి వసూలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయి. అయితే సిలిండర్ డెలివరీ సిబ్బంది నిబంధనలు మీరి వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.20 వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సిలిండర్‌పై ఉన్న బిల్లుకు అదనంగా వసూలు చేస్తుండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
గ్రామాలకు వాహనాల్లో సరఫరా
ఏజెన్సీ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలకు వాహనాల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏజెన్సీకి ఐదు వరకు వాహనాలు ఉన్నాయి. వాహనానికి సుమారు 50 సిలిండర్లు చొప్పున పంపుతున్నారు. ఈలెక్కన వాహనానికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రవాణా చార్జీల రూపంలో రాబడుతున్నారు.
పల్లెల్లో దోపిడీ మరీ ఎక్కువ..
గ్యాస్ ఏజెన్సీల పరిధి పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన సిలిండర్ రవాణాకు బిల్లుపై అదనంగా రూ.10 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఇది ఎక్కడా అమలుకావడం లేదు. గ్రామీణుల నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకుని కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువ మొత్తంతో వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్యాస్ ఏజెన్సీలకే తెలిసే చార్జీలు వసూళ్లు
జిల్లాలో 75 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో సుమారు 12 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రవాణా చార్జీల వసూలు ఏజెన్సీ ప్రతినిధులకు తెలిసే జరుగుతున్నట్టు తెలుస్తుంది. రవాణా చార్జీల వసూలుపై ఎవరైనా ఏజెన్సీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు. దీంతోపాటు ఏజెన్సీ ప్రతినిధులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
అదనంగా వసూలు చేస్తే చర్యలు
జిల్లాలో గ్యాస్ డెలివరీకి సంబంధించి రవాణ చార్జీలు ఎంత తీసుకోవాలనే దానిపై ఆయా కంపెనీలకు సర్క్యూలర్ పంపించాం. ప్రస్తుతానికి 5 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీలు లేవు. 5 కిలోమీటర్లు దాటితే రూ.10 వరకు వసూలు చేయవచ్చు. ఎవరైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే ఆయా ఏజెన్సీలపై సిబ్బంది చర్యలు తీసుకుంటాం.– సయ్యాద్ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment