Gas Agencies
-
మరింత ఈజీ: వాట్సాప్‌లో గ్యాస్ ఇలా బుక్ చేసుకోండి
బంజారాహిల్స్/ హైదరాబాద్: గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవడంలో వినియోగదారులకు మరింత ఉపయోగపడే రీతిలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీలు సులభతరం చేశాయి. ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. గతేడాది గ్యాస్ కంపెనీలు తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వివిధ ఆన్లైన్ ప్రక్రియలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. గ్యాస్ ఏజెన్సీ వద్ద, డీలర్‌ను సంప్రదించడం లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉండేది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఎలా బుక్ చేసుకోవాలి... ఇండెన్ కస్టమర్లు 7718955555కు కాల్ చేసి ఎల్పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో అయితే 7588888824కు సందేశం పంపించవచ్చు. హెచ్‌పీ గ్యాస్ కస్టమర్లు 9222201122కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నంబర్ మరిన్ని సేవా వివరాలను కూడా అందజేస్తుంది. భారత్ కస్టమర్లు సిలిండర్లను బుక్ చేసుకోవాలంటే తమ రిజిస్టర్ మొబైల్ నుంచి 1800224344 నంబర్‌కు మెసేజ్ చేయాలి. దీని తర్వాత వినియోగదారుల బుకింగ్ అభ్యర్థనను గ్యాస్ ఏజెన్సీ అంగీకరిస్తుంది. బుకింగ్ సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే వాట్సాప్ పంపాలి. మరింత సులభం.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో గల 8 గ్యాస్ ఏజెన్సీల వినియోగదారులకు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభించింది. సుమారు లక్ష మందికి మేలు చేకూరనుంది. వాట్సాప్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఉపయోగకరం వాట్సాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఎంతగానో దోహదపడుతుంది. సామాన్య మధ్య తరగతి ప్రజలకు కూడా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండటం, వాట్సాప్ వాడుతుండటంతో ఈ ప్రక్రియ వారికి బాగా దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఉన్న పలు విధానాల ద్వారా కొంత ఇబ్బంది కలిగేది. ఇప్పుడు తేలికగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. – బి.శ్రీనివాస్, బీఎస్ ఎంటర్ప్రైజెస్ -
మారుమూల గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ: ఇకపై మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వంట గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థలు, అధీకృత ఉమ్మడి సేవా కేంద్రాల(సీఎస్సీ)మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు సీఎస్‌సీలతో అంగీకారానికి వచ్చాయి. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో సీఎస్సీ ఫ్రాంచైజీలుగా ఏర్పాటయ్యే గ్యాస్ ఏజెన్సీలు.. కొత్తగా బుక్ చేసే ప్రతి గ్యాస్ కనెక్షన్‌పై రూ.20, ప్రతి రీ ఫిల్లింగ్ సిలిండర్‌పై రూ.2, సీఎస్సీకి సిలిండర్ చేరవేస్తే రూ.10, వినియోగదారుకు సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే రూ.19.5 చొప్పున అందుకుంటాయి. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కనెక్షన్లు 25 కోట్లకు చేరుకోనుండగా అందులో ఉజ్వల కనెక్షన్లు 5.75 కోట్ల వరకు పెరగనున్నందున ఇందుకు సంబంధించి ఏర్పాట్లను విస్తృతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని మంత్రులు అన్నారు. తాజా ఒప్పందంతో లక్ష వరకు మినీ గ్యాస్ ఏజెన్సీల సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ముందుగా ఈ సదుపాయాన్ని ఒడిశాలో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామనీ, వచ్చే ఒకటీ రెండు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వివరించారు. దేశంలో 3.1 లక్షల సీఎస్‌సీలుండగా ప్రస్తుతానికి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లక్ష కేంద్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. సీఎస్సీ ఈ–గవర్నెన్స్ సీఈవో దినేశ్ త్యాగి మాట్లాడుతూ..తాజా ఒప్పందంతో గ్రామీణ ఏజెన్సీల ఆదాయంతోపాటు సీఎస్సీల పట్ల విశ్వసనీయత పెరుగుతుందన్నారు. -
బండ బాదుడు
భీమవరం (ప్రకాశం చౌక్): గ్యాస్ వినియోగదారులకు రవాణా చార్జీలు పెనుభారంగా మారాయి. రోజురోజుకూ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పాటు రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేయడం వీరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రవాణా చార్జీల భారం మరీ ఎక్కువగా ఉంది. ఏజెన్సీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.40 వరకూ అదనంగా.. గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీని బట్టి వారంలోపు సిలిండర్‌ను వినియోగదారుడికి అందిస్తున్నారు. సాధారణంగా సిలిండర్ డెలివరీకి ఐదు కిలోమీటర్లలోపు ఎటువంటి చార్జీలు వసూలు చేయకూడదు. ఐదు కిలోమీటర్లు దాటితే రూ.10 మించి వసూలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయి. అయితే సిలిండర్ డెలివరీ సిబ్బంది నిబంధనలు మీరి వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.20 వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సిలిండర్‌పై ఉన్న బిల్లుకు అదనంగా వసూలు చేస్తుండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాలకు వాహనాల్లో సరఫరా ఏజెన్సీ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలకు వాహనాల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏజెన్సీకి ఐదు వరకు వాహనాలు ఉన్నాయి. వాహనానికి సుమారు 50 సిలిండర్లు చొప్పున పంపుతున్నారు. ఈలెక్కన వాహనానికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రవాణా చార్జీల రూపంలో రాబడుతున్నారు. పల్లెల్లో దోపిడీ మరీ ఎక్కువ.. గ్యాస్ ఏజెన్సీల పరిధి పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన సిలిండర్ రవాణాకు బిల్లుపై అదనంగా రూ.10 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఇది ఎక్కడా అమలుకావడం లేదు. గ్రామీణుల నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకుని కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువ మొత్తంతో వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలకే తెలిసే చార్జీలు వసూళ్లు జిల్లాలో 75 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో సుమారు 12 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రవాణా చార్జీల వసూలు ఏజెన్సీ ప్రతినిధులకు తెలిసే జరుగుతున్నట్టు తెలుస్తుంది. రవాణా చార్జీల వసూలుపై ఎవరైనా ఏజెన్సీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు. దీంతోపాటు ఏజెన్సీ ప్రతినిధులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదనంగా వసూలు చేస్తే చర్యలు జిల్లాలో గ్యాస్ డెలివరీకి సంబంధించి రవాణ చార్జీలు ఎంత తీసుకోవాలనే దానిపై ఆయా కంపెనీలకు సర్క్యూలర్ పంపించాం. ప్రస్తుతానికి 5 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీలు లేవు. 5 కిలోమీటర్లు దాటితే రూ.10 వరకు వసూలు చేయవచ్చు. ఎవరైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే ఆయా ఏజెన్సీలపై సిబ్బంది చర్యలు తీసుకుంటాం.– సయ్యాద్ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు -
అక్రమాలకు ‘గ్యాసో’హం
వైరా : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ‘డొమెస్టిక్’ సిలిండర్లను యథేచ్ఛగా కొందరు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఓ దందాగా మార్చేసి దండుకుంటున్నారు. పేదల సిలిండర్ల మార్పిడి తంతును నిర్వహిస్తున్నారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో ఒక్కో సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తూ.. సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తూ అక్రమ దందా సాగిస్తున్నాయి. దమ్ముంటే కాసుకోండి.. పట్టుకోండి అన్నట్లు అధికారులకు సవాల్ విసురుతున్నట్లుగా మారుతోంది ఈ గ్యాస్ దందా పరిస్థితి. జిల్లాలో ‘డొమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా ‘కమర్షియల్’గా సాగుతోంది. ఈ వ్యాపారం ప్రధానంగా మండల కేంద్రాల్లో జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతోపాటు కొందరు ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారింది. అధికంగా సిలిండర్లు వినియోగించే ప్రధాన పట్టణాల్లో తనిఖీల ఊసే లేదు. అయితే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలులున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో పాటించట్లేదు. 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,460. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి.. దాని విలువ రూ.750 నుంచి రూ.800 వరకు ఉంటుంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. పైగా గ్యాస్ కూడా ఎక్కువ వస్తుంది. దీంతో అనేక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ.. దందాను జోరుగా నడిపిస్తున్నారు. తనిఖీలు కరువు.. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్ 2.80 లక్షలు, డబుల్ కనెక్షన్ 1.75 లక్షలు, దీపం కనెక్షన్లు 1.10 లక్షలు, సీఎస్ఆర్ కనెక్షన్లు 1.75 లక్షలు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేయడానికి ఇండియన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కంపెనీలు కలిపి గ్యాస్ ఏజెన్సీలు 350 ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3వేల వరకు మాత్రమే ఉన్నాయి. పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు వేలల్లో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల వినియోగం అధికం. హోటల్‌ను బట్టి కొన్నింటికి వారంలో ఒకటి నుంచి రెండు సిలిండర్లు పడతాయి. మరికొన్నింట్లో నెలకు ఐదు వరకు వినియోగిస్తున్నారు. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండడంతో కమర్షియల్ సిలిండర్లు కాకుండా కాకుండా డొమెస్టిస్ సిలిండర్లను దొంగచాటున వినియోగి స్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీడీలు కూడా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేయట్లేదని, సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీల బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారమిస్తే సీజ్ చేస్తాం.. నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో వినియోగించడం నేరం. పట్టణాల్లో నిబంధనలను మరిచి వ్యాపారాలకు వినియోగిస్తే మాకు సమాచారం అందించండి. మేం వెంటనే సీజ్ చేస్తాం. వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్లే వాడాలి. – కోటా రవికుమార్, తహసీల్దార్, వైరా -
పొమ్మనలేక పొగ
శ్రీకాకుళం , వీరఘట్టం: పొమ్మనలేక పొగపెట్టడమంటే ఇదేనేమో.. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తీరా మొదటి గ్యాస్ బండ ఖాళీగా కాగానే తర్వాత వంటకు వంట ఏజెన్సీ మహిళలే స్వయంగా కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా చేస్తే వారికి ఆర్థిక భారమై ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటారని ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఆనక ఎంచక్కా ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టి కమీషన్లు కాజేయవచ్చుననే ఎత్తుగడ చేస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు పిలిచింది. ఇన్నేళ్లుగా విద్యార్థులకు రుచికరమైన భోజనం వండి పెడుతున్న మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇటీవల ఆగమేఘాల మీద ప్రతీ పాఠశాల వంట ఏజెన్సీకీ గ్యాస్ కనెక్షన్ అందజేసింది. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడు తమ స్కూల్ మెయింటినెన్స్ నిధుల నుంచి రూ.2.808 వెచ్చించి గ్యాస్ కనెక్షన్ బుక్ చేశారు. అయితే మొదట గ్యాస్ బండ ప్రభుత్వం ఇచ్చింది. ఈ బండ ఖాళీగానే తదుపరి వంటకు గ్యాస్ బండ వంట ఏజెన్సీల మహిళలు కొనుక్కోవాలి. ఇలాగైతే వారికి గిట్టుబాటుగాక స్వచ్ఛందంగా తప్పుకుంటారని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతోంది.. జిల్లాలో 379 ఉన్నత, 430 ప్రాథమికోన్నత, 2,356 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఇంత వరకు 2,404 పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు కొనుగోలు చేశారు. మిగిలిన 761 పాఠశాలల్లో నిధుల లేమితే కొన్నిచోట్ల, హెచ్ఎంలు అందుబాటులో లేక మరికొన్ని చోట్ల గ్యాస్ కనెక్షన్లు కొనుగోలు చేయలేదు. దసరా సెలవుల తర్వాత మంగళవారం పాఠశాలలు తెరుచుకున్నందున ఈ మేరకు ఒక గ్యాస్ బండ, రెగ్యులేటర్, కనెక్షన్ బాండ్ అందజేశారు. పొయ్యిలు మాత్రం ఏజెన్సీలే కొనుక్కోవాలి. అంటే రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చు చేస్తే గాని నాణ్యమైన పొయ్యిలు దొరికే పరిస్థితి లేదు. ఏజెన్సీలను తప్పించే ఎత్తుగడ 100 మంది విద్యార్థులున్న పాఠశాలలో ప్రతినెలా పాఠశాల పనిదినాల్లో వంటలు వండేందుకు రూ.500 కట్టెలు సరిపోతున్నాయి. అదేగ్యాస్తో నెలకు నాలుగు బండలు అవసరమవుతాయని అంచనా. ఇలాగైతే ప్రస్తుతం గ్యాస్ ధర బట్టి చూస్తే నాలుగు బండలకు రూ. 2,640 ఖర్చు అవుతోంది. అంటే కట్టెలు కంటే గ్యాస్ పొయ్యిపై వంట చేస్తే ఐదు రెట్లు ఖర్చు అధికమవుతుంది. ఇంత ఖర్చు చేయాలంటే ఏజెన్సీలకు భారం కానుంది. రాయితీపై గ్యాస్ ఇవ్వాలి ప్రస్తుత పరిస్థితులను అధిగమించాలంటే గ్యాస్ పొయ్యిని ఉచితంగా అందజేసి, 50 శాతం రాయితీపై గ్యాస్ కనెక్షన్ సరఫరా చేయాలి. అలాగైతే∙మధ్యాహ్నం వంట సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. దాంతో వంట ఏజెన్సీ మహిళలతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. తర్వాత బండ గురించి తెలీదు గ్యాస్ పంపిణీపై విద్యాశాఖ ఉన్నతాధికారులను వివరణ కోరగా ప్రస్తుతం ఒక గ్యాస్ బండ ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయమని, తర్వాత వంట అవసరాలకు కావాల్సిన గ్యాస్ బండల గురించి ఆదేశాలు లేవంటున్నారు. బహుశా వంట ఏజెన్సీ వారే తర్వాత బండలను సొంత ఖర్చులతో కొనుక్కోవాలని చెప్పకనే చెబుతున్నారు. -
నిలువుదోపిడీ..
రవాణా పేరుతో ఒక్కో సిలిండర్‌పై రూ.20నుంచి రూ. 50వరకు వసూలు వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్న ఏజెన్సీలు పట్టించుకోని అధికారులు జిలాల్లో గ్యాస్ ఏజెన్సీలు ఒకపక్క నల్లబజారులో సిలిండర్లను విక్రయిస్తూనే మరోపక్క రవాణా పేరుతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 20 నుంచి రూ. 50 వసూలు చేస్తూ వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయి. చిన్న విషయంగానే ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నెలకు రూ. లక్షల్లో సంవత్సరానికి రూ. కోట్లలో ఈ దందా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 67 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో 5.5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సగటు నెల వినియోగం 2 లక్షల 75 వేల సిలిండర్లు. ఒక్కోసిలిండర్‌పై 20 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే సగటున నెలకు రూ.60 లక్షలు, సంవత్సరానికి రూ.7 కోట్ల మేర వీరు బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సరఫరాకు సొంత వాహనాలు కలిగి ఉండాలి. కాని అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారో ఏమోగాని సొంత వాహనం కలిగి ఉన్న వారినే డెలివరీ బాయ్‌గా పెట్టుకుంటున్నారు. వీరికి వేతనం, వాహనం ఖర్చులు గాని ఏజెన్సీ వారు ఇవ్వ డం లేదు. సదరు బాయ్ రోజుకు 50 నుంచి 100 సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసి వారి వద్ద నుంచి రూ.30నుంచి రూ.50 తమ వేతనం కింద వసూళ్లు చేసుకుంటున్నారు. రవాణా కోసం కంపెనీ ఇచ్చే డబ్బును ఏజెన్సీ నిర్వాహకులే నొక్కేస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ఈ వాహనాలను కొందరు ఏజెన్సీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తేనే పనిలోకి తీసుకుంటామని చెపుతుండడంతో నిరుద్యోగులు తమ వాహనాలను ఏజెన్సీ పేరుతో మార్చడం, కొందరు లీజుకు ఇచ్చినట్లు అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అదనంగా ఇవ్వాల్సిందే... గ్యాస్ ధరను రవాణ ఖర్చు, ఏజెన్సీ కమిషన్‌తో కలిపే కంపెనీలు నిర్ణయిస్తాయి. దానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఏజెన్సీ నుంచి వినియోగదారుడి ఇళ్లు 5 కిలోమీటర్లు కన్నా ఎక్కువ ఉంటే అసలు ధరకు 20 రూపాయలను అదనంగా చెల్లించవచ్చు. కొన్ని కంపెనీలు 15 కిలోమీటర్ల వరకు ఉచిత సరఫరా చేస్తున్నాయి. కాని దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నుంచి డెలివరీబాయ్స్ రూ.30 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమిటంటే మాకు కంపెనీలు వేతనాలు ఇవ్వవు. మీరు ఇచ్చే డబ్బులే మాకు వేతనం. మీరు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి అనేది వారి వాదన. దీంతో గ్యాస్ అత్యవసరం కావడం, గ్యాస్ ఇంటికి వచ్చిన సమయంలో మహిళలు ఉండడంతో వారితో వాదన పెట్టుకోకుండా అడిగినంత ఇచ్చి గ్యాస్ తీసుకుంటున్నారు. డెలివరీ బాయ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వవద్దని ప్రకటనలు ఇస్తూనే వారికి వేతనాలు ఇవ్వకుండా సిలిండర్ తీసుకున్న వారి నుంచే వసూళ్లు చేసేకోమని లోపాయికారిగా చెబుతున్నారు. కార్మికశాఖ ఏంచేస్తున్నట్లు..? జిల్లా వ్యాప్తంగా 67 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో పని చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికశాఖది. వేతనంతో పాటు పీఎఫ్‌ను కూడా వారికి ఇప్పించాలి. కాని అసలు ఏజెన్సీలలో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారు? వారికి ప్రతి నెలా ఎంత వేతనం ఇస్తున్నారు? పీఎఫ్ తదితరాలు జమ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని సదరు అధికారులు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని కార్మికులే అంటున్నారు. తమకు వేతనాలు ఇస్తే అధనంగా ఎందుకు వసూళ్లు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు రేటు మాత్రం బయటకు చెప్పరూ... గ్యాస్ ధరలను కంపెనీలు ప్రతి నెలా ఒకటవ తారీకున సవరిస్తాయి. నవంబర్ లో ఇంటి అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 608 ఉండగా డిసెంబర్ నెలలో 685–50 రూపాయలకు పెంచింది. పెంచిన ధరను వెంటనే వసూలు చేస్తున్న ఏజెన్సీలు, తగ్గినపుడు మాత్రం విషయం బయటకు తెలియకుండా అమ్ముతున్నారు. -
సబ్సిడీకి ఎసరు!
- గ్యాస్ సబ్సిడీ రూ.200 రద్దుకు ప్రభుత్వ పన్నాగం - వినియోగదారులకు నచ్చజెప్పి దరఖాస్తులు పూర్తిచేయించాలని హుకుం - గ్యాస్ ఏజెన్సీలకు టార్గెట్లు - త్వరలో స్పెషల్ డ్రైవ్‌లు - ఆసక్తి చూపని వినియోగదారులు విజయవాడ : చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో విలవిల్లాడుతున్న వినియోగదారుడిని మరింత కుంగదీసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతోంది. వంటగ్యాస్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము రద్దుచేసే ఎత్తుగడ వేసింది. గ్యాస్ సబ్సిడీ సొమ్మును స్వచ్ఛందంగా వదులుకోండంటూ ఇప్పటికే పిలుపునిచ్చిన ప్రభుత్వం నెమ్మదిగా పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకుంటున్నట్లు దరఖాస్తులు సేకరించాలని గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల అధికారులు ఏజెన్సీలకు దరఖాస్తులు పంపి సబ్సిడీ కనెక్షన్లను తగ్గించాలని లోపాయికారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో హెచ్పీసీ, ఐవోసీ, బీపీసీ కంపెనీలకు చెందిన 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో 11 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. వీరిలో సంపన్న, ఉద్యోగ, మధ్యతరగతి వర్గాలకు నచ్చజెప్పి సబ్సిడీ వదులుకునేలా చూడాలని గ్యాస్ కంపెనీలు టార్గెట్ విధించినట్టు సమాచారం. ఒక్కో గ్యాస్ ఏజెన్సీ నెలకు 200 నుంచి 500 మంది గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా దరఖాస్తులు సేకరించాలని మౌఖిక ఆదేశాలు గ్యాస్ డీలర్లకు అందాయి. టార్గెట్ విధించి సబ్సిడీ దరఖాస్తులు పూర్తి చేయించాలని ఆదేశించడంలో డీలర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల అనాసక్తి వినియోగదారులు మాత్రం గాస్ సబ్సిడీ వదులుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రధానమంత్రి పేరుతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ఏర్పాటుచేస్తున్న దరఖాస్తులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం సిలిండర్ ఒక్కింటికీ రూ.700 వసూలు చేస్తుండగా, అందులో రూ.200 సబ్సిడీని వినియోగదారుడి ఖాతాకు జమ చేస్తున్నారు. దీనిద్వారా ప్రభుత్వంపై సబ్సిడీ భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ భారం తడిసి మోపెడవటంతో కేంద్రప్రభుత్వం రానున్న కొద్దినెలల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసి సబ్సిడీని ఎత్తివేసే కార్యక్రమం అమలు చేయనుంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చట్టం చేయకుండా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయటానికి పన్నాగం పన్నుతోందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. -
ఉచిత గ్యాస్ ఉన్నట్టా.. లేనట్టా?
► మంజూరైనట్టు చూపుతున్న ఈ సేవా సెంటర్లు ► అనుమతి ఇవ్వలేదంటున్న గ్యాస్ ఏజెన్సీలు ► ఇబ్బందులు పడుతున్న పేదలు నర్సీపట్నం : కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు పేదలకు అందని మావిగానే మారాయి. ప్రభుత్వాలు కరుణించినా గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల నిర్వాకం వల్ల నేటికీ పేదలంతా పొగ పొయ్యిలతోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. ఒక పక్క ఈ సేవా సెంటర్లో అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ మంజూరువుతున్న చూపుతున్నా, ఏజెన్సీలు మాత్రం అనుమతి పేరుతో తిప్పి పంపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మోదీ కలల పథకం నేటికీ పేద వర్గాలకు అందలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష కనెక్షన్లు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ పొందని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని గత నెలలో అదేశాలు జారీచేసింది. దీంతో అర్హులైన లబ్ధిదారులంతా మీ సేవా సెంటర్లవైపు పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న పరిస్థితిని బట్టి మీ సేవా యాజమానులు 50 నుంచి వంద రూపాయల వరకు వసూలు చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా గ్యాస్ కనెక్షన్ ఉచితమని ప్రకటించడంతో అధిక సంఖ్యలో అబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు లక్షకు పైగా అబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని కనెక్షన్ కోసం అశగా ఎదురు చూడసాగారు. గడువు ముగియడంతో దరఖాస్తు చే సుకున్న వారంతా గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీల వైపు పురుగులు తీశారు. ఒక ఏజెన్సీలో వెయ్యి రూపాయలు, మరో సంస్థలో ఐదు వందలు చెల్లించాలంటూ చెప్పినా లబ్ధిదారులు అందుకు సిద్ధమయ్యారు. తీరా ఏజెన్సీలకు వెళ్లిన లబ్ధిదారులకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి కనెక్షన్ మంజూరు చేసేది లేదంటూ సిబ్బంది తేల్చి చెప్పడంతో లబ్ధిదారులంతా నిరాశగా వెనుదిరిగాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క కనెక్షన్ సైతం మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులంతా గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా పౌరసరఫరాల అధికారి భ్రమరాంబ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడం వల్లే మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని చెప్పారు. ఏజెన్సీలు తిప్పుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించగానే ఎంతో ఆశపడ్డాం. దీనిపై అందరూ చెప్పగానే వెంటనే దరఖాస్తు చేశాం. తీరా చూస్తే కనెక్షన్ రాలేదంటూ ఏజెన్సీలు తిప్పుతున్నాయి. -గణేష్, రోలుగుంట కనెక్షన్ ఇస్తారో.. లేదో.. కేంద్రం ఇచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నెల రోజుల క్రితం దరఖాస్తు చేశాం. ఈ సేవలో చూస్తే పౌరసరఫరాలశాఖ అధికారులు శాంక్షన్ చేశారని చెబుతున్నారు. గ్యాస్ ఏజెన్సీకి వెళితే ఇంకా రాలేదని చెబుతున్నారు. ఈ పరిస్థితులు చూస్తే కనెక్షన్ ఇస్తారో లేదో తెలియడం లేదు. ఎవరూ సరిగా చెప్పడం లేదు. -ఈర్ని లక్ష్మి, జోగంపేట -
ఆధార్ ఉంటేనే ‘నగదు బదిలీ’
* జనవరి నుంచి పథకం అమలు * డీలర్లకు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ అందించాలి * గ్యాస్ వినియోగదారులకు కలెక్టర్ సూచన ప్రగతినగర్ : గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ డీలర్లకు వెంటనే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లు అందించాలని కలెక్టర్ రొనాల్రోస్ సూచించారు. లేని పక్షంలో నగదు బదిలీ పథకం ద్వారా ప్రభుత్వం అందించనున్న సబ్సిడీ కోల్పోతారని స్పష్టం చేశారు. జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుంద ని కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకర్లు, పౌర సరఫరాల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీలు, విని యోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నం బర్ల సేకరణపై సమీక్ష జరిపారు. నగదు బదిలీ పథ కం అమలు నేపథ్యంలో వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ నంబర్ల సీడింగ్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సం ఘాల సహకారాన్ని తీసుకోవాలని గ్యాస్ డీలర్లకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 13 ఉండగా 1,86,970 కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు సీడింగ్ 56 శాతం, ఆధార్ సీడింగ్ 86 శాతం జరిగింది. హిందుస్థాన్ పెట్రోలింగ్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 11 ఉండగా 1,29,375 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ ఏజెన్సీలు 20 ఉండగా 1,20,389 కనెక్షన్లు ఉన్నాయి. 48 శాతం బ్యాంకు సీడింగ్ జరిగింది. మిగిలిన వినియోగదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్లు సేకరించి బ్యాంకులకు జాబితాలు అందచేయాలని గ్యాస్ డీలర్లతో కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకర్లు సైతం అనుసంధాన ప్రక్రియను వేంటనే పూర్తిచేయాలన్నారు. ఆధార్ లేని వినియోగదారులు వెం టనే ఆధార్ తీసుకుని బ్యాంకు ఖాతా నంబర్లతో పాటు ఏజెన్సీలకు అందచేయాలన్నారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామకృష్ణారావు, డిప్యూటీ ఎల్డీఎం రవీంధ్రనాథ్, డీఎస్ఓ కొండల్రావు, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ సెల్స్ మేనేజర్లు బ్రహ్మానందరావు, శివరాజ్‌సింగ్, మోహన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు బదిలీకి రంగం సిద్ధం
* ఈ నెల 15 నుంచి అమల్లోకి * రంగంలోకి దిగిన గ్యాస్ ఏజెన్సీలు * ఆధార్ లేని వారికి యూనిక్ ఐడీ నంబర్లతో నగదు బదిలీ రామచంద్రపురం : గ్యాస్ వినియోగదారులకు మళ్లీ నగదు బదిలీ అమలుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఈ నెల 15నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఆధార్‌తో అనుసంధానం చేయడంతో గతంలో నగదు బదిలీకి పలు ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం డీబీటీఎల్ పథకం ద్వారా నగదు బదిలీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీబీటీఎల్ పథకం ద్వారా అమలు ఆధార్‌తో సంబంధం లేకుండా డీబీటీఎల్ పథకం ద్వారా వినియోగదారులకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆధార్ సీడింగ్ లేని వారికి ఈసారి నగదు బదిలీకి 17 అంకెల యూనిక్ ఐడీని గ్యాస్ ఏజెన్సీలు అందిస్తున్నాయి. ఇప్పటికే వినియోగదారుల మొబైల్ ఫోన్ల్‌కు 17 అంకెల యూనిక్‌ఐడీ నంబర్‌ను ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తున్నారు. ఇదివరలో ఆధార్ సీడింగ్ అయినవారికి ఇది అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి, ఆధార్ సీడింగ్ జరగని వారికి ఆధార్ కార్డుతో పాటుగా రెండు రకాల ఫారాలను అందించాలి. ఫారం-1, 2లను నింపి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో, ఖాతా కలిగిన బ్యాంకులో అందించాలి. ఆధార్ కార్డు లేని వారు ఏజెన్సీలు అందించిన 17 అంకెల యూనిక్ ఐడీ నంబర్‌ను వేసి ఫారం-3, 4లను పూర్తి చేసి బ్యాంకుతో పాటుగా గ్యాస్ ఏజెన్సీలలో అందించాలి. ఈ ప్రక్రియ ఈనెల 15 నుంచి ఆయా గ్యాస్ ఏజెన్సీల ద్వారా నిర్వహించనున్నారు. అయితే గతంలో ఆధార్ సీడింగ్ ద్వారా నగదు బదిలీని అందుకున్నవారు ఎటువంటి ఫారాలు ఇవ్వాల్సిన పనిలేదు. సిలిండర్‌కు పూర్తి సొమ్ము చెల్లించాల్సిందే ఈ నెల 15 నుంచి నగదు బదిలీ అమలు కానుంది. జిల్లాలోని 54 గ్యాస్ ఏజేన్సీల ద్వారా దాదాపుగా తొమ్మిది లక్షల వరకు వంట గ్యాస్ వినియోగదారులున్నారు. వీరందరూ ప్రస్తుతం సబ్సిడీపై రూ.443 చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల వినియోగదారులు ముందుగానే సిలిండర్‌ను రూ.960 చెల్లించి కొనుగోలు చే యాలి. ఆ తర్వాత సబ్సిడీ మొత్తం రూ. 520 ఢిల్లీలోని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనికి జమ చేస్తారు. గతంలో నగదు బదిలీని అందుకున్న వారికి యథావిధిగా సబ్సిడీ సొమ్ములు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు లేనివారు సెల్‌ఫోన్‌కు వచ్చిన యూనిక్ ఐడీ నంబర్‌ను తీసుకువెళ్లినా బ్యాంకుల్లో సబ్సిడీ సొమ్ములను అందించనున్నారు. -
నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి
జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ ఆదేశం ఒంగోలు కలెక్టరేట్ : నిత్యవసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. స్థానిక తన చాంబ ర్లో బుధవారం సాయంత్రం నిర్వహించి న జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, పౌరసరఫరాలశాఖ ద్వారా రైతు బజార్లలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే కందుకూరు రైతు బజార్లో నెల్లూరు సన్నాలు బియ్యాన్ని కిలో 30 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపా రు. ఒంగోలులోని రైతు బజార్లలో కూడా ఆ రకం బియ్యాన్ని అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్మిల్ల ర్ల యజమానులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సాధారణ ధరకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు బజార్లలో కూడా కొన్నిరకాల నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. టమోటా కిలో 32, కందిపప్పు 62, మినుములు 44, ఉల్లిపాయలు కిలో 17 రూపాయల ధర ఉందన్నారు. ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను జేసీ ఆదేశించారు. ప్రజల జీవితాలతో చెలగాటం : మాగులూరి వ్యాపారస్తులు కల్తీ మినరల్ వాటర్ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మాగులూరి నాగేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తనిఖీలు నిర్వహించి లెసైన్స్ లేని మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయించాలని కోరారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాను ఒంగోలు దక్కించుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని మరో సభ్యుడు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రంగాకుమారి, సివిల్ సప్లయిస్ డీఎం కొండయ్య, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీలు రవీంద్ర, జెన్నమ్మ, తూనికలు, కొలతలశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ డీలర్ల సమ్మెబాట
రేపటి నుంచి నిరవధికంగా... చమురు కంపెనీల తీరుపై కన్నెర్ర కొత్త ఏజెన్సీల ఏర్పాటు యత్నాలపై నిరసన జిల్లాలో 74 ఏజెన్సీల డీలర్లు సమ్మెలోకి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏజెన్సీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 20 కొత్త గ్యాస్ ఏజెన్సీలు రానున్నాయి. వాటిలో విజయవాడ నగరంలో 5 కొత్త ఏజెన్సీలు ఏర్పాటు అవుతాయి. ఇవిగాక రాజీవ్ యోజన పథకం కింద కూడా గ్రామాల్లో మరికొన్ని సబ్ ఏజెన్సీలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త ఏజెన్సీలు వచ్చేస్తే ఇప్పుడున్న గ్యాస్ ఏజెన్సీలలోని కనెక్షన్లు కొన్నింటిని వాటికి బదిలీ చేస్తారు. దీంతో ఎంతో కాలం నుంచి వ్యాపారం చేస్తున్న గ్యాస్ డీలర్లు తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చేయని తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని వారు వాపోతున్నారు. వినియోగదారులను ఇక్కట్లకు గురి చేసే నిబంధనలు జారీ చేస్తున్న ప్రభుత్వం, స్పష్టమైన ఆదేశాలు లేకుండా దొంగనాటకం ఆడుతోందని విమర్శిస్తున్నారు. చమురు కంపెనీలు చేసే తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని డీలర్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా జరపతలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయటానికి గ్యాస్ డీలర్లు సమాయత్తమవుతున్నారు. సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీల డీలర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దాంతో లక్షలాది మంది వినియోగదారుల్లో కూడా గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్ లింకుతో అవస్థలు... ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులతో పాటు డీలర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అనుసంధానం విషయంలో నిబంధనలు సరిగా లేకపోవటంతో డీలర్లు, వినియోగదారులు నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంకులలో, గ్యాస్ ఏజెన్సీలలో ఆధార్ లింక్ అయినా సబ్సిడీ వినియోగదారుల ఖాతాలలో జమకావటం లేదు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ ఎఫ్‌సీఐ (నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఆధార్ లింక్ అయితేనే గ్యాస్ వినియోగదారుల ఖాతాలలో సబ్సిడీ డబ్బు జమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ఎఫ్సీఐలో ఆధార్ లింక్ కాకపోవటంతో అక్కడ నుంచి డబ్బు జమకావటం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. 48 గంటలలోపు గ్యాస్ సరఫరా కాకపోతే చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు లక్షలాది రూపాయలు జరిమానాలు విధిస్తున్నాయని, చమురు కంపెనీలు సక్రమంగా గ్యాస్సరఫరా చేయకుండా వాటినుంచి ఆలస్యంగా గ్యాస్ వచ్చినా ఏజెన్సీలనే బాధ్యులను చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు సరిగా స్టాక్ రాకపోవటం వల్ల సరఫరాలో ఆలస్యం అయినా ఏజెన్సీలను బాధ్యులుగా చేస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆల్ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు నివరధిక సమ్మెకు సిద్ధమవుతున్నాయి. -
దేశవ్యాప్తంగా గ్యాస్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: సిలిండర్ల సరఫరాలో జాప్యం చేసే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ కంపెనీలను వినియోగదారులు మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించే ఎల్పీజీ కనెక్షన్ పోర్టబిలిటీని కేంద్రం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద 2013 అక్టోబర్ నుంచే 13 రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చినా అందులో వినియోగదారులు కేవలం గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునే సౌలభ్యాన్ని మాత్రమే కల్పించారు. తాజాగా దేశవ్యాప్తంగా 480 జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ పథకంలో గ్యాస్ ఏజెన్సీలతోపాటు ఎల్పీజీ కంపెనీలను కూడా వినియోగదారులు మార్చుకునే వెసులుబాటు ఉంది. వినియోగదారుడికి ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ అధికారంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ కంపెనీ తప్పనిసరిగా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పెట్రోలియంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కనెక్షన్ పోర్టబులిటీ కోసం వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేశంలో 8.2 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు.