రవాణా పేరుతో ఒక్కో సిలిండర్‌పై రూ.20నుంచి రూ. 50వరకు వసూలు
వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్న ఏజెన్సీలు
పట్టించుకోని అధికారులు
జిలాల్లో గ్యాస్ ఏజెన్సీలు ఒకపక్క నల్లబజారులో సిలిండర్లను విక్రయిస్తూనే మరోపక్క రవాణా పేరుతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 20 నుంచి రూ. 50 వసూలు చేస్తూ వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయి. చిన్న విషయంగానే ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నెలకు రూ. లక్షల్లో సంవత్సరానికి రూ. కోట్లలో ఈ దందా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కోదాడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 67 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో 5.5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సగటు నెల వినియోగం 2 లక్షల 75 వేల సిలిండర్లు. ఒక్కోసిలిండర్‌పై 20 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే సగటున నెలకు రూ.60 లక్షలు, సంవత్సరానికి రూ.7 కోట్ల మేర వీరు బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సరఫరాకు సొంత వాహనాలు కలిగి ఉండాలి. కాని అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారో ఏమోగాని సొంత వాహనం కలిగి ఉన్న వారినే డెలివరీ బాయ్‌గా పెట్టుకుంటున్నారు. వీరికి వేతనం, వాహనం ఖర్చులు గాని ఏజెన్సీ వారు ఇవ్వ డం లేదు. సదరు బాయ్ రోజుకు 50 నుంచి 100 సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసి వారి వద్ద నుంచి రూ.30నుంచి రూ.50 తమ వేతనం కింద వసూళ్లు చేసుకుంటున్నారు. రవాణా కోసం కంపెనీ ఇచ్చే డబ్బును ఏజెన్సీ నిర్వాహకులే నొక్కేస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ఈ వాహనాలను కొందరు ఏజెన్సీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తేనే పనిలోకి తీసుకుంటామని చెపుతుండడంతో నిరుద్యోగులు తమ వాహనాలను ఏజెన్సీ పేరుతో మార్చడం, కొందరు లీజుకు ఇచ్చినట్లు అగ్రిమెంట్ చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ అదనంగా ఇవ్వాల్సిందే...
గ్యాస్ ధరను రవాణ ఖర్చు, ఏజెన్సీ కమిషన్‌తో కలిపే కంపెనీలు నిర్ణయిస్తాయి. దానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఏజెన్సీ నుంచి వినియోగదారుడి ఇళ్లు 5 కిలోమీటర్లు కన్నా ఎక్కువ ఉంటే అసలు ధరకు 20 రూపాయలను అదనంగా చెల్లించవచ్చు. కొన్ని కంపెనీలు 15 కిలోమీటర్ల వరకు ఉచిత సరఫరా చేస్తున్నాయి. కాని దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నుంచి డెలివరీబాయ్స్ రూ.30 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమిటంటే మాకు కంపెనీలు వేతనాలు ఇవ్వవు. మీరు ఇచ్చే డబ్బులే మాకు వేతనం. మీరు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి అనేది వారి వాదన. దీంతో గ్యాస్ అత్యవసరం కావడం, గ్యాస్ ఇంటికి వచ్చిన సమయంలో మహిళలు ఉండడంతో వారితో వాదన పెట్టుకోకుండా అడిగినంత ఇచ్చి గ్యాస్ తీసుకుంటున్నారు. డెలివరీ బాయ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వవద్దని ప్రకటనలు ఇస్తూనే వారికి వేతనాలు ఇవ్వకుండా సిలిండర్ తీసుకున్న వారి నుంచే వసూళ్లు చేసేకోమని లోపాయికారిగా చెబుతున్నారు.
కార్మికశాఖ ఏంచేస్తున్నట్లు..?
జిల్లా వ్యాప్తంగా 67 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో పని చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికశాఖది. వేతనంతో పాటు పీఎఫ్‌ను కూడా వారికి ఇప్పించాలి. కాని అసలు ఏజెన్సీలలో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారు? వారికి ప్రతి నెలా ఎంత వేతనం ఇస్తున్నారు? పీఎఫ్ తదితరాలు జమ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని సదరు అధికారులు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని కార్మికులే అంటున్నారు. తమకు వేతనాలు ఇస్తే అధనంగా ఎందుకు వసూళ్లు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు.
అసలు రేటు మాత్రం బయటకు చెప్పరూ...
గ్యాస్ ధరలను కంపెనీలు ప్రతి నెలా ఒకటవ తారీకున సవరిస్తాయి. నవంబర్ లో ఇంటి అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 608 ఉండగా డిసెంబర్ నెలలో 685–50 రూపాయలకు పెంచింది. పెంచిన ధరను వెంటనే వసూలు చేస్తున్న ఏజెన్సీలు, తగ్గినపుడు మాత్రం విషయం బయటకు తెలియకుండా అమ్ముతున్నారు.
నిలువుదోపిడీ..
Published Mon, Jan 2 2017 1:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement