
సాక్షి, నల్లగొండ : వంటగ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలను అనుసరించి ఇంధన కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచాయి. దీంతో సామాన్యుడిపై గ్యాస్ ధర భారం పడింది. కంపెనీలు పెంచిన ధరలకు అనుగుణంగా పేదలపై భారం పడకుండా సిలిండర్లకు ఇచ్చే రాయితీని కూడా కేంద్రం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దఝెత్తున ఊరట కలిగినా భారం మాత్రం కొద్ది మొత్తంలో తప్పడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.6.50 భారం పడనుంది. ప్రతి నెలా జిల్లాలో రూ.6లక్షలపైగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 1,56,200 రెగ్యులర్, 40వేల దీపం కనెక్షన్లు ఉన్నాయి. ఇండేన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 31 మండలాల పరిధిలో 33 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోంది. అయితే రోజూ 4,140 సిలిండర్ల వరకు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి.
భారీగా పెంచిన సిలిండర్ ధర...
ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.788 ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.206 రాయితీ కల్పిస్తూ లబ్ధిదారుని అకౌంట్‌లో ఆ మొత్తం జమచేస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ వినియోగదారుడికి రూ.582కి అందుతుంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు సిలిండర్ దరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.148.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.936.50కి చేరింది. అయితే ఇందులో ప్రభుత్వం సబ్సిడీని రూ.348కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
వినియోగదారుడికి కాస్త ఊరట
ఓ పక్క ఇంధన కంపెనీలు సిలిండర్ ధర పెంచగా ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాయితీని కూడా పెంచింది. దీంతో కంపెనీలు పెంచిన ధర మొత్తం వినియోగదారులపై పడడం లేదు. కేవలం రూ.6.50 అదనంగా పెరిగిన ధరతో చెల్లించాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి నెలా జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.6 లక్షల పైచిలుకు భారం పడనుంది. జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఈ స్వల్ప భారం తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment