money Collecting
-
ప్రజాప్రతినిధి ఇంట్లో పెళ్లికి నేతల జేబులు ఖాళీ.. వాట్సాప్ చాటింగ్ వైరల్
సాక్షి, కరీంనగర్: రాజువారింట్లో వివాహనికి రాజ్యమంతా కదిలి వెళ్తుంది. మరి వెళ్లే ప్రజలంతా ఖాళీ చేతులతో వెళ్తారా? ఎవరి స్థోమతకు తగినట్లుగా వారు కానుకలు తీసుకెళ్తారు. జిల్లాలో ఓ నియోజకవర్గంలో కీలక ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో మోగనున్న పెళ్లి భాజాలు.. నేతల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. ఇప్పుడు రాష్ట్రమంతటా మోరుమోగిపోతోంది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. అసలే పెద్ద ప్రజాప్రతినిధి. అందులోనూ ఆయన ఇంట్లో శుభకార్యం. ఆయన అనుచరులు ఉత్తినే ఉంటారా? అంతా కలిసి భారీ బహుమతి తీసుకెళ్లి చదివించాలని నిర్ణయించారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో చాటింపు వేశారు. సర్పంచులు ఇంత, ఎంపీటీసీలు ఇంత అంటూ రేటు ఫిక్స్ చేశారు. వారిలో ఆ నేతకు వీరాభిమాని అయిన ఓ గ్రామస్థాయి నేత ఈ వ్యవహారాన్ని మొత్తం అన్నీ తానై చూసుకుంటున్నారు. కొందరు నగదు రూపంలో చెల్లింపులు చేస్తుండగా.. మరికొందరు తమకు తోచిన కానుకలు సమర్పించుకుంటున్నారు. రామడుగు మండలంలోని ఒక గ్రామ మాజీ సర్పంచికి ఆ శుభకార్యానికి కావాల్సిన కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. కొడిమ్యాల మండలానికి చెందిన ఒక నాయకునికి చికెన్, చొప్పదండి కేంద్రానికి చెందిన నాయకునికి మటన్ పంపించాల్సి ఉంటుందని సదరు అనుచరుడు హంగామా చేస్తున్నట్లు సమాచారం. చదవండి: మర్రి శశిధర్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. స్పందించిన మాణిక్యం ఠాగూర్ ఈ వ్యవహారంపై ఓ గ్రామ సర్పంచిని ‘సాక్షి’ వివరణ కోరింది. స్పందించిన సదరు సర్పంచి.. ‘మేమంతా కానుకలను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు’ అని స్పష్టం చేశాడు. ఇదే నేత సరిగ్గా ఏడాది కింద.. పోలీసు పోస్టింగు విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం గమనార్హం. ఏడాదిలో మూడోది..! కరీంనగర్ జిల్లాలో నేతల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగిన సమయంలో ఇలాంటి కానుకల కోసం చందాలు సేకరించడం ఏడాదిలో ఇది మూడో ఘటన. ఆగస్టులో ఓ పార్టీ నేత ఇంట్లో వివాహం జరిగినప్పుడు పలు మహిళా సంఘాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చందాలు సేకరించారు. అప్పట్లో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఏడాదిలో కలెక్టరేట్లోని ఓ ఉన్నతాధికారి ఇంట్లో పెళ్లి కోసం కూడా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశారని ఉద్యోగులు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏడాదికాలంలో పెళ్లికానుకల చందాల వసూలులో ఇది మూడోది. ఈ షాదీ ముబారక్ కానుకల వ్యవహారం ఇటు అధికారుల్లో, నేతల్లో ఒక సంప్రదాయంగా మారుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా
తాడిపత్రి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు అలుపెరగని కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వేల రూపాయల విలువ చేసే కరోనా పరీక్షలను ప్రజలందరికీ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయిస్తోంది. అయితే కొంతమంది కేటుగాళ్లు కొత్త దందాకు తేరలేపి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిమిత్తం వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో రోజూ కరోనా వైరస్ పరీక్షల నిమిత్తం ప్రజల వద్ద నుంచి స్వాబ్ నమూనాలను అక్కడి వైద్యులు సేకరిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో పెత్తనం చెలాయిస్తున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారికి మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. మీకు వెంటనే పరీక్షలు చేయిస్తాం.. కరోనా పరీక్షల నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆసుపత్రి వచ్చే ప్రజలను ప్రైవేటు వ్యక్తులు కలిసి ‘ఈ రోజు పరీక్షలకు చాలా మంది ఉన్నారు.. ఈ రోజు స్వాబ్ నమూనాలను తీసుకోవడం కష్టమే’ అంటూ భయపెడతారు. మాకు తెలిసిన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారు.. రూ.2500 ఇస్తే వెంటనే పరీక్షలు చేయిస్తామంటూ రోగుల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాగే మంగళవారం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా పరీక్ష నిమిత్తం వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పరీక్ష చేయిస్తామంటూ ఆయన వద్ద నుంచి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లను తీసుకుని మీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాం.. ఇక మీకు పరీక్ష చేస్తారంటూ ఆయన వద్ద నుంచి రూ.2500 ఓ ప్రైవేటు వ్యక్తి తీసుకున్నారు. అయితే ఆ వృద్ధుడి నుంచి స్వాబ్ నమూనాను తీసుకోకపోవడంతో ఆయన సదురు ప్రైవేటు వ్యక్తిని ఫోన్లో సంప్రదించగా ఈ రోజు కుదరలేదు.. రేపు రండి కచ్చితంగా చేయిస్తామంటూ సమాధానం వచ్చింది. దీంతో చేసేదేమీ ఏమి లేక కరోనా పరీక్షలకు వచ్చిన వృద్ధుడు వెళ్లిపోయారు.(లాక్డౌన్ కష్టాల్లో రష్యన్ యువతి) అందరికీ ఉచితంగానే చేస్తున్నాం ప్రభుత్వం అందరికీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోంది. కరోనా పరీక్షలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాసులు రెడ్డి, కోవిడ్ వైద్యాధికారి, తాడిపత్రి -
ఎంట్రీ ఫీజు పేరుతోదోపిడి!
హార్సిలీహిల్స్‌ను పేదవాడి ఊటీగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే వారిలో అత్యధికులు సామాన్యులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరేందుకు వచ్చే సందర్శకులే. ఖర్చులేకుండా ప్రకృతి అందాలను తిలకిస్తుంటే అటవీశాఖ మాత్రం తన సముదాయంలో అడుగుపెట్టాలంటే ఎంట్రీ ఫీజును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. పేద పర్యాటకులను దోపిడీ చేస్తోంది. వసూలు చేస్తున్న ఫీజుకు తగ్గట్టుగా ఆహ్లాదం ఉంటుందా అంటే ఏమీలేదు. బి.కొత్తకోట:మండలంలోని హార్సిలీహిల్స్‌లో అట వీశాఖ ఏడు హెక్టార్ల విస్తీర్ణంలో పర్యావరణ సముదాయం నిర్వహిస్తోంది. ఇందులో మినీ జంతుప్రదర్శనశాల ఉండగా ముసళ్లు, జింకలు, కుందేళ్లు, పలురకాల పక్షులు, నెమళ్లు, కొన్ని విదేశీ పక్షులు పెంచేవారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు చిన్నపార్కు ఉంది. సందర్శకులను రుసుము లేకుండా అనుమతించేవారు. చీఫ్ కన్సర్వేటర్ శ్రీధర్ ఏడాది క్రితం సముదాయంలోకి ప్రవేశించాలంటే రూ.10 వసూలుచేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు అటవీశాఖ సిబ్బంది రశీదులు తయారుచేసి రూ.10 వసూలు చేయగా ఏడాది క్రితం టెండర్ ద్వారా రూ.6,07,500కు కాంట్రాక్టర్‌కు అప్పగించగా వారు వసూలు చేçసుకుంటున్నారు. పాత టెండర్ కాలపరిమితి ముగియడంతో కొత్త టెండర్లను ఆహ్వానించారు. ఆహ్లాదం ఎక్కడ ? సందర్శకుల నుంచి రూ.10 వసూలు చేస్తున్నా కనీస ఆహ్లాదం లేదు. సముదాయంలో మినీ జంతుప్రదర్శనశాల పేరుకు మాత్రమే ఉంది. ఇందులో ఇంతకు ముందున్న పక్షులు, కుందేళ్లు, పక్షులు లేవు. సగానికిపైగా తగ్గిపోవడం వెనుక కారణాలు అధికారులకే తెలియాలి. ఒక మొసలి మరణిస్తే గోప్యం పాటించింది ఎందుకనో∙అధికారులే చెప్పాలి. పార్కులో గతంలో ప్లేపేన్ ఉండగా.. ఇప్పుడు లేదు. సౌకర్యాలు తగ్గిపోయాయి. సందర్శకులు కూర్చునేందుకు బల్లలైనా ఏర్పాటు చేయలేదు. తాగేందుకు నీటి సౌకర్యం లేదు. ప్రకృతి అందమూ కనిపించదు. చెట్ల మధ్యలో సంచరించి..బోసిపోయిన మినీ జంతుప్రదర్శనశాలను చూసి బయటకు వెళ్లాల్సిందే. దీనిపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసూలు నిలిపివేయాలని, లేనిపక్షంలో రుసుము తగ్గట్టు ఆహ్లాదం, సౌకర్యాలు, వసతులు అందేలా చూడాలని కోరుతున్నారు. మిగిలిన చోట్ల ఉచితమే ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన హార్సిలీహిల్స్ అందాలన్నీ ఉచితంగానే వీక్షించవచ్చు. గాలిబండ, పాత వ్యూ పాయింట్, కొత్త వ్యూ పాయింట్ నుంచి ప్రకృతి అందాలను తిలకించాల్సిందే. వీటికి రుసుము లేదు. దీనికితోడు పర్యాటక శాఖ చిన్నారుల కోసం ఫీజు లేకుండా కొత్త కార్యక్రమాలను అమలుచేస్తోంది. కొండకు వచ్చే పిల్లలు రోజంతా ఆడుకునేలా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ ఫీజుతో దీన్ని పోల్చితే ఒక్కొ చిన్నారికి రూ.20 వసూలు చేయవచ్చు. అయినప్పటికీ పర్యాటకశాఖ అందరికీ ఉచితంగానే ప్రవేశం కల్పిస్తోంది. తద్వారా సందర్శకులను ఆకట్టుకొంటోంది. మా చేతుల్లో లేదు రూ.10 వసూలు నిలిపివేత లేదా తగ్గించే విషయం మా చేతుల్లో లేదు. ఉన్నతాధికారులు తీసుకోవాల్సిన చర్యలు. వసూలు కోసం కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. – ఈశ్వరయ్య,రేంజర్, మదనపల్లె -
బండ బాదుడు
భీమవరం (ప్రకాశం చౌక్): గ్యాస్ వినియోగదారులకు రవాణా చార్జీలు పెనుభారంగా మారాయి. రోజురోజుకూ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పాటు రవాణా చార్జీల పేరుతో గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేయడం వీరికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ రవాణా చార్జీల భారం మరీ ఎక్కువగా ఉంది. ఏజెన్సీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ.40 వరకూ అదనంగా.. గ్యాస్ ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీని బట్టి వారంలోపు సిలిండర్‌ను వినియోగదారుడికి అందిస్తున్నారు. సాధారణంగా సిలిండర్ డెలివరీకి ఐదు కిలోమీటర్లలోపు ఎటువంటి చార్జీలు వసూలు చేయకూడదు. ఐదు కిలోమీటర్లు దాటితే రూ.10 మించి వసూలు చేయరాదనే నిబంధనలు ఉన్నాయి. అయితే సిలిండర్ డెలివరీ సిబ్బంది నిబంధనలు మీరి వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రూ.20 వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. సిలిండర్‌పై ఉన్న బిల్లుకు అదనంగా వసూలు చేస్తుండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాలకు వాహనాల్లో సరఫరా ఏజెన్సీ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలకు వాహనాల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏజెన్సీకి ఐదు వరకు వాహనాలు ఉన్నాయి. వాహనానికి సుమారు 50 సిలిండర్లు చొప్పున పంపుతున్నారు. ఈలెక్కన వాహనానికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు రవాణా చార్జీల రూపంలో రాబడుతున్నారు. పల్లెల్లో దోపిడీ మరీ ఎక్కువ.. గ్యాస్ ఏజెన్సీల పరిధి పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన సిలిండర్ రవాణాకు బిల్లుపై అదనంగా రూ.10 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఇది ఎక్కడా అమలుకావడం లేదు. గ్రామీణుల నిరక్ష్యరాస్యతను ఆసరాగా చేసుకుని కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువ మొత్తంతో వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలకే తెలిసే చార్జీలు వసూళ్లు జిల్లాలో 75 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో సుమారు 12 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రవాణా చార్జీల వసూలు ఏజెన్సీ ప్రతినిధులకు తెలిసే జరుగుతున్నట్టు తెలుస్తుంది. రవాణా చార్జీల వసూలుపై ఎవరైనా ఏజెన్సీ ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు. దీంతోపాటు ఏజెన్సీ ప్రతినిధులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదనంగా వసూలు చేస్తే చర్యలు జిల్లాలో గ్యాస్ డెలివరీకి సంబంధించి రవాణ చార్జీలు ఎంత తీసుకోవాలనే దానిపై ఆయా కంపెనీలకు సర్క్యూలర్ పంపించాం. ప్రస్తుతానికి 5 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీలు లేవు. 5 కిలోమీటర్లు దాటితే రూ.10 వరకు వసూలు చేయవచ్చు. ఎవరైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే ఆయా ఏజెన్సీలపై సిబ్బంది చర్యలు తీసుకుంటాం.– సయ్యాద్ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఏలూరు -
విరాళాల సేకరణ పేరుతో..
రాజంపేట టౌన్: అమ్మ ఆదరణ సేవా సంస్థ పేరుతో విరాళాలు సేకరిస్తూ ఓ ఇంటిలోకి చొరబడ్డ ముగ్గురు యువకుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పజెప్పిన సంఘటన బుధవారం సాయంత్రం రాజంపేట పట్టణం సరస్వతీపురంవీధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని అమ్మ ఆదరణ సేవా సంస్థ ప్రతినిధులమంటూ ముగ్గురు యువకులు సరస్వతీపురం వీధిలో ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. అనాథ పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విరాళాలు సేకరిస్తున్నామని, ప్రతి ఒక్కరు రూ.500కు తక్కువ కాకుండా ఇవ్వాలని అడిగారు. తమకు విరాళాలు ఇచ్చిన వారి పేర్లను, తాము చేసే సేవా కార్యక్రమాల ఫొటోలను కూడా చూపించడంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధురాలి ఇంటిలోకి ముగ్గురు యువకులు నేరుగా వెళ్లారు. దీంతో ఆ వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో వారు పరుగు తీశారు. స్థానికులు వెంటపడగా ఇద్దరు పారిపోయారు. రాంబాబు అనే యువకుడు దొరికిపోయాడు. తాను కడప మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు ఒకసారి, తమది విజయవాడలోని కృష్ణలంక అంటూ మరోసారి ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అక్కడి ప్రజలకు అనుమానం వచ్చి దేహశుద్ధి చేశారు. పారిపోయిన మిగతా ఇద్దరికి రాంబాబు సెల్ నుంచి ఫోన్ చేయించగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పట్టణ ఎస్ఐ రాజగోపాల్‌కు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా విరాళాల పేరుతో ఇళ్ల వద్దకు వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ రాజగోపాల్ ప్రజలకు సూచించారు. కాగా, రాంబాబు అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు తామిచ్చిన విరాళాన్ని అతని వద్ద నుంచి తిరిగి లాక్కోవడం కొసమెరుపు. -
‘నమో’ ఫౌండేషన్ పేరిట దోపిడీ
ఓ మహిళ నుంచి రూ.12.5 లక్షలు వసూలు ►ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆ మహిళ కుటుంబం ►నమో ఫౌండేషన్‌తో మోదీకి ఎలాంటి సంబంధం లేదన్న పీఎంవో ►విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ►కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు ►దాదాపు 200 మంది నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తింపు! సాక్షి, హైదరాబాద్: నమో (నరేంద్ర మోదీ) ఫౌండేషన్ పేరుతో కొందరు వ్యక్తులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని సీఐడీ గుర్తించింది. మోదీపై ఉన్న అభిమానాన్ని అడ్డుపెట్టుకుని.. అనాథ పిల్లలకు చదువు, గోశాలల నిర్వహణ పేరిట సొమ్ము వసూలు చేస్తున్నారని తేల్చింది. ఈ అంశంపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు గురువారం నమో ఫౌండేషన్‌పై కేసులు నమోదు చేసి, సదరు నిందితులను వేటాడే పనిలో పడ్డారు. మహిళ ఫిర్యాదుతో.. సికింద్రాబాద్‌కు చెందిన సరోజజైన్ ప్రధాని మోదీకి వీరాభిమాని. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న నమో ఫౌండేషన్ నిర్వాహకులు గతేడాది ఆమె వద్దకు వచ్చారు. మోదీ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని.. దానికి విరాళాలు ఇవ్వాలని కోరారు. దీంతో సరోజజైన్ రూ.12.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత తాము నమో ఫౌండేషన్‌కు వస్తామని, ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తామని సరోజజైన్ నిర్వాహకులను కోరారు. కానీ నిర్వాహకులు పదే పదే దాటవేస్తూ వచ్చారు. చివరికి సరోజజైన్ గట్టిగా ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగారు. ఎక్కువగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె తన కుమారుడు ఆశీష్‌జైన్‌తో కలసి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. నమో ఫౌండేషన్ పేరుతో హైదరాబాద్‌లో సాగుతున్న కార్యకలాపాలపై సమాచారమిచ్చారు. దానిని పరిశీలించిన ప్రధాని కార్యాలయం అధికారులు అసలు ‘నమో’పేరుతో ఉన్న ఫౌండేషన్‌తో ప్రధాని మోదీకి, వారి సంబంధీకులకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అసలు ప్రధాని పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో నమో ఫౌండేషన్ వ్యవహారంపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. 200 మందికి పైగా విరాళాలు! హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పంకత్ మెహతా 2013లో చైతన్యపురి ప్రాంతంలో నమో ఫౌండేషన్ కార్యాలయం ప్రారంభించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ పట్ల అభిమాన మున్న ధనికులు, వీఐపీలను టార్గెట్‌గా చేసుకుని.. విరాళాలు సేకరిస్తున్నట్టుగా గుర్తించినట్టు వెల్లడించారు. గోశాలల నిర్వాహణ, మొబైల్ స్కూళ్ల పేరుతో ప్రతి ఆదివారం ఉచితంగా విద్య బోధించడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్‌కు ఒక్క సరోజ జైన్ మాత్రమేగాకుండా దాదాపు 200 మందికి పైగా భారీగానే విరాళాలు ఇచ్చారని సీఐడీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, నిర్వాహకులను అరెస్టు చేస్తామని తెలిపారు. సీఐడీకి ఫిర్యాదు చేయండి ప్రధాని మోదీ పేరు చెప్పి నమో ఫౌండేషన్ పేరిట విరాళాలు, బెది రింపు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై సీఐడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని ఐజీ సౌమ్యా మిశ్రా గురు వారం సూచించారు. అలాంటి ఫౌండే షన్ల నిర్వాహకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని.. ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు. -
డబ్బులు తిరిగి అడిగినందుకు...
షాబాద్ : చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన షాబాద్ మండలంలోని మన్మర్రి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. షాబాద్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని గ్రామానికి చెందిన చాకు బందయ్య(32)అతడి చిన్నాన్న కుమారుడైన శ్రీశైలంకు గత కొద్ది రోజుల క్రితం చేబదులుగా రూ. 50 వేలు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు మళ్లీ ఇవ్వాలని పలుమార్లు బందయ్య శ్రీశైలంను అడగగా దసరా పండగకు ఇస్తానని సమాధానం చెప్పారు. దసరా పండుగ రోజున నాడబ్బులు ఇవ్వమని అడగగా పండుగపూట ఏందీరా.. నీలోల్లి అంటూ.. శ్రీశైలం గొడవకు దిగాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో బందయ్య కిందపడడంతో శ్రీశైలం అతనిపై బండరాయితో తలపై బాదాడు. దీంతో బందయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల పండగ మామూలు..!
► గ్రామదేవతల పండుగల కోసం వృద్ధుల పింఛన్లలో కోత ► రేషన్ కార్డుకు రూ.500 చొప్పున వసూలు శ్రీకాకుళం: టెక్కలి మండలం కోటబొమ్మాళిలో ఈ నెల 29 నుంచి జరగబోయే గ్రామదేవత పండగల కోసం వృద్ధులకు ఇచ్చే పింఛన్లలో తెలుగు తమ్ముళ్లు రూ.500 వసూలు చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసం తెలుగు తమ్ముళ్లు ఈ వసూళ్లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. కోటబొమ్మాళికి సంబంధించి కీలక వ్యక్తితోపాటు మండలంలో మరో ఇద్దరు వ్యక్తులతో కలసి ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. రేషన్‌కార్డు దారుల నుంచి కూడా రూ.500 వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్న వెంటనే దృష్టి సారించాలని కోరారు. కలెక్టర్ కూడా పరిశీలన చేసి ఈ వసూళ్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, ఎం.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నంబర్ వన్ దోపిడీ
► గ్యాస్ కనెక్షన్లకు నంబర్ల పేరుతో కుచ్చుటోపీ ► ఒక్కో ఇంటి నుంచి రూ.25 వసూలు ► నంబర్ వేయించుకోకపోతే కనెక్షన్ కట్ అంటూ బ్లాక్మెయిల్ ► రూ.10 లక్షలకు పైగా దోచుకునేందుకు పన్నాగం ధర్మవరం: ‘మీ ఇంటికి హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. కాబట్టి మీ గ్యాస్ నంబర్ రేకుమీద స్టిక్కర్‌గా అతికించి మీ ఇంటికి వేస్తాం. ఇందుకు రూ.25 ఇవ్వాలి. ఇలా వేయించుకోకపోతే గ్యాస్ కనెక్షన్ కట్ చేయిస్తాం.’ అంటూ కొందరు యువకులు ధర్మవరం పట్టణంలో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచి డబ్బు లాగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 72,984 నివాసాలున్నాయి. వీటిలో దాదాపు 43వేల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. ఒక్కో ఇంటి నుంచి రూ.25 చొప్పున వసూలు చేసినా రూ.10 లక్షలకు పైగా అవుతుంది. ఈ వ్యవహారాన్ని కొందరు తెరచాటున నడిపిస్తున్నారు. ఇళ్ల వద్దకు వచ్చిన యువకులు మాత్రం ‘మాకు గ్యాస్ ఆఫీస్‌లోని వ్యక్తులు చెప్పారు’ అని అంటున్నారు. ఇప్పటికే పట్టణంలోని చాలా వార్డుల్లో గ్యాస్ నంబర్ స్టిక్కర్లు అతికించి డబ్బు వసూలు చేశారు. గ్యాస్ రాదేమోనన్న భయంతో ప్రజలు కూడా రూ.25 చెల్లిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఇళ్లకు మాత్రం నంబర్ ప్లేట్ కొట్టకుండా మెల్లగా జారుకుంటున్నారు. ప్రజలను ఏవిధంగానైనా మోసం చేసేందుకు కొందరు ఈ తతంగాన్ని నడుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెద్దఎత్తున వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అడ్డుకోకపోతే ప్రజలు మోసపోవడంతోపాటు గ్యాస్ కనెక్షన్లు సైతం తొలగించుకుని కొత్త కంపెనీలవైపు మొగ్గు చూపే ఆస్కారముంది. మా ఏజెన్సీకి సంబంధం లేదు హెచ్‌పీ గ్యాస్ పేరుతో ఇంటింటా స్టిక్కర్లు అతికిస్తున్న యువకులకు మా ఏజెన్సీకి ఎలాంటి సంబంధమూ లేదు. రేకులమీద గ్యాస్ నంబర్లు అతికి స్తున్నదెవరో మాకు తెలీదు. ప్రజలతో డబ్బు వసూలు చేస్తున్నార న్న విషయం మా దష్టికి రాలేదు. మేము కూడా ఎవరికీ డబ్బువసూలు చేయాలని చెప్పలేదు. - శ్రీలక్ష్మి హెచ్‌పీ గ్యాస్ ఎంటర్‌ప్రై జెస్, ధర్మవరం -
సీఐ బదిలీల్లో తమ్ముళ్ల చేతివాటం!
► చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు ► ఒక్కో బదిలీకి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డిమాండ్ కర్నూలు: జిల్లాలో సీఐల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. తమకు నచ్చిన అధికారిని స్టేషన్‌కు తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతల పైరవీలూ ప్రారంభమయ్యాయి. తాము చెప్పిన వారినే నియమించాలంటూ అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు సీనియర్ నేతలు పావులు కదపడం ప్రారంభించారు. ఒక్కో బదిలీకి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ డిమాండ్ పలుకుతున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా సుమారు 10 నుంచి 15 మంది సీఐల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బదిలీలు తప్పనట్లే.. జిల్లాలో ప్రధానంగా నాలుగైదు స్టేషన్ల సీఐలకు బదిలీలు తప్పేట్టు కనిపించడం లేదు. దీర్ఘకాలంగా ఉండటంతో పాటు తీవ్ర విమర్శలు రావడంతో వీరిని బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమ బదిలీలను నిలుపుకునేందుకు సదరు స్టేషన్ల సీఐలు కూ డా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా కర్నూలు డివిజన్లోని నాలుగు నుంచి ఆరు స్టేషన్లతో పాటు ఆదోని రెవెన్యూ డివిజన్లో రెండు, నంద్యాల డివిజన్లో రెండు స్టేషన్లకు సీఐలకు స్థానచలనం తప్పేట్లు లేదు. ప్రధానంగా కర్నూలు డివిజన్లోని రెండు స్టేషన్ల సీఐలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఇటు ఇసుక వ్యాపారంతో పాటు మట్కాలోనూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి బదిలీ తప్పదని సమాచారం. ముఖ్యనేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన సీఐని మార్చాల్సిందేనని సదరు ముఖ్యనేత కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనితో పాటు స్టేషన్ పరిధిలోని ఎస్ఐల నుంచి నెలవారీ మాముళ్లు ఇవ్వాల్సిందేనని వేధిస్తుండటమూ బదిలీకి మరో కారణంగా తెలుస్తోంది. కర్నూలుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ సీఐపై కూడా ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో పాటు స్వయంగా బినామీ పేర్లతో ట్రా క్టర్లు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన బదిలీ కూడా తప్పదని తెలుస్తోంది. స్థానాన్ని బట్టి డిమాండ్... బదిలీలను అవకాశంగా తీసుకుని ఫోకల్ పోస్టులను (మంచి స్థానాలు) కైవసం చేసుకునేందుకు పలువురు నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్న అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు అధికార పార్టీ నేతల నుంచి భారీగా డిమాండ్ వస్తోం ది. స్థానాన్ని బట్టి ఒక్కో పోస్టుకు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డి మాండ్ చేస్తున్నట్టు సమాచారం. అనుకూలమైన వ్యక్తికి పోస్టింగు ఇప్పించుకోవడంతో జేబులు నింపుకునేందుకు టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. -
వసూల్ రాజా!
► బ్రాందీషాపులతో పిఠాపురం టీడీపీ నేత దందా ► రూ.55 వేల చొప్పున చెల్లించాలని హుకుం ► వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ పోలీసులు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో బరితెగించిన అధికారపార్టీ ముఖ్యనేతకు అధికారులు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా లక్షలు దండుకుని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాదాయానికి తీవ్రంగా గండి పడుతోంది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలకు ఖర్చయ్యిందంటూ.. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీ చేసిన సదరు నేత తాజాగా మద్యం షాపులపై పడ్డారు. ఒక్కో షాపు నుంచి రూ.55 వేలు వసూలు చేసి అర్జంటుగా పంపించాలని, ఇవ్వకపోతే షాపుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తానని హెచ్చరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. చేసేదిలేక షాపుల యజమానులు అడిగిన మొత్తం సదరు నేతకు సమర్పించుకున్నట్లు సమాచారం. 20 షాపుల నుంచి వసూలు నెలరోజుల క్రితం వరకు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు మామూలుగా జరిగేవి. చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులు హఠాత్తుగా సమయపాలన పాటించాలని, ఎమ్మార్పీకే అమ్మాలని, నిబంధనలు పాటించకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ మామూలే అనుకున్న షాపుల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు జూలు విదిల్చారు. షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని, సమయానికి షాపులు మూసివేయాలని ఆదేశించారు. షాపుల నిర్వాహకులు గగ్గోలు పెట్టడంతో అధికారులు అసలు సంగతి చెప్పారు. ఒక నేత ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నామని, ఆయనను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. షాపుల నిర్వాహకులు సదరు నేత అనుచరులను సంప్రదించగా ‘మీరు ఇష్టమొచ్చినట్లు అమ్ముకోవాలంటే రూ.55 వేల చొప్పున ఇవ్వా’లని ఆ నేత మాటగా చెప్పారు. ఇప్పటికే విజయవాడ కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో దాడులు పెరిగి, ముడుపుల బాధ ఎక్కువై, ఎమ్మార్పీకి అమ్ముతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పుడు అంత మొత్తం ఇవ్వలేమని మొర పెట్టుకోగా.. ఇవ్వక పోతే ఎలా అమ్ముతారో చూస్తానంటూ ఆ నేత కళ్లెర్రజేసినట్టు చెపుతున్నారు. చేసేదిలేక ఆ మొత్తం సమర్పించుకుంటుండడంతో ప్రసన్నుడైన ఆ నేత ఏ వేళనైనా, ఏ రేటుకైనా అమ్ముకోవచ్చని అభయమిచ్చినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో 22 మద్యం షాపులు, ఒక బార్ ఉండగా ఇప్పటివరకు 20 షాపులు అడిగిన ముడుపు చెల్లించినట్టు సమాచారం. కాగా ఈ విషయంపై పిఠాపురం ఎక్సైజ్ సీఐ రామసురేష్ను వివరణ కోరగా అలా వసూలు చేసినట్టు తమకు ఫిర్యాదులు రాలేదన్నారు. తాము మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, సమయపాలన, ఎమ్మార్పీ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎవరికీ కొమ్ము కాయడం లేదన్నారు. -
భద్రత పై భక్తుల ఆందోళన