
వసూల్ రాజా!
► బ్రాందీషాపులతో పిఠాపురం టీడీపీ నేత దందా
► రూ.55 వేల చొప్పున చెల్లించాలని హుకుం
► వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ పోలీసులు
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో బరితెగించిన అధికారపార్టీ ముఖ్యనేతకు అధికారులు అండగా నిలుస్తున్నారు. ఫలితంగా లక్షలు దండుకుని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాదాయానికి తీవ్రంగా గండి పడుతోంది.
ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలకు ఖర్చయ్యిందంటూ.. వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.లక్షలు వసూలు చేసి ఇవ్వాలని హుకుం జారీ చేసిన సదరు నేత తాజాగా మద్యం షాపులపై పడ్డారు. ఒక్కో షాపు నుంచి రూ.55 వేలు వసూలు చేసి అర్జంటుగా పంపించాలని, ఇవ్వకపోతే షాపుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తానని హెచ్చరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. చేసేదిలేక షాపుల యజమానులు అడిగిన మొత్తం సదరు నేతకు సమర్పించుకున్నట్లు సమాచారం.
20 షాపుల నుంచి వసూలు
నెలరోజుల క్రితం వరకు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలు మామూలుగా జరిగేవి. చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులు హఠాత్తుగా సమయపాలన పాటించాలని, ఎమ్మార్పీకే అమ్మాలని, నిబంధనలు పాటించకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇవన్నీ మామూలే అనుకున్న షాపుల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో అధికారులు జూలు విదిల్చారు.
షాపుల వద్ద ఎమ్మార్పీ బోర్డులు పెట్టాలని, సమయానికి షాపులు మూసివేయాలని ఆదేశించారు. షాపుల నిర్వాహకులు గగ్గోలు పెట్టడంతో అధికారులు అసలు సంగతి చెప్పారు. ఒక నేత ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నామని, ఆయనను కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. షాపుల నిర్వాహకులు సదరు నేత అనుచరులను సంప్రదించగా ‘మీరు ఇష్టమొచ్చినట్లు అమ్ముకోవాలంటే రూ.55 వేల చొప్పున ఇవ్వా’లని ఆ నేత మాటగా చెప్పారు.
ఇప్పటికే విజయవాడ కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో దాడులు పెరిగి, ముడుపుల బాధ ఎక్కువై, ఎమ్మార్పీకి అమ్ముతూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పుడు అంత మొత్తం ఇవ్వలేమని మొర పెట్టుకోగా.. ఇవ్వక పోతే ఎలా అమ్ముతారో చూస్తానంటూ ఆ నేత కళ్లెర్రజేసినట్టు చెపుతున్నారు. చేసేదిలేక ఆ మొత్తం సమర్పించుకుంటుండడంతో ప్రసన్నుడైన ఆ నేత ఏ వేళనైనా, ఏ రేటుకైనా అమ్ముకోవచ్చని అభయమిచ్చినట్టు తెలుస్తోంది.
నియోజకవర్గంలో 22 మద్యం షాపులు, ఒక బార్ ఉండగా ఇప్పటివరకు 20 షాపులు అడిగిన ముడుపు చెల్లించినట్టు సమాచారం. కాగా ఈ విషయంపై పిఠాపురం ఎక్సైజ్ సీఐ రామసురేష్‌ను వివరణ కోరగా అలా వసూలు చేసినట్టు తమకు ఫిర్యాదులు రాలేదన్నారు. తాము మద్యం అమ్మకాలపై నిఘా ఉంచామని, సమయపాలన, ఎమ్మార్పీ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎవరికీ కొమ్ము కాయడం లేదన్నారు.