‘నమో’ ఫౌండేషన్‌ పేరిట దోపిడీ | CID officers Cases Register on Namo Foundation | Sakshi
Sakshi News home page

‘నమో’ ఫౌండేషన్‌ పేరిట దోపిడీ

Published Fri, Mar 3 2017 4:15 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

‘నమో’ ఫౌండేషన్‌ పేరిట దోపిడీ - Sakshi

‘నమో’ ఫౌండేషన్‌ పేరిట దోపిడీ

ఓ మహిళ నుంచి రూ.12.5 లక్షలు వసూలు
ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఆ మహిళ కుటుంబం
నమో ఫౌండేషన్‌తో మోదీకి ఎలాంటి సంబంధం లేదన్న పీఎంవో
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు
దాదాపు 200 మంది నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తింపు!  


సాక్షి, హైదరాబాద్‌: నమో (నరేంద్ర మోదీ) ఫౌండేషన్‌ పేరుతో కొందరు వ్యక్తులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారని సీఐడీ గుర్తించింది. మోదీపై ఉన్న అభిమానాన్ని అడ్డుపెట్టుకుని.. అనాథ పిల్లలకు చదువు, గోశాలల నిర్వహణ పేరిట సొమ్ము వసూలు చేస్తున్నారని తేల్చింది. ఈ అంశంపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలన్న ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు చేపట్టింది. సీఐడీ అధికారులు గురువారం నమో ఫౌండేషన్‌పై కేసులు నమోదు చేసి, సదరు నిందితులను వేటాడే పనిలో పడ్డారు.

మహిళ ఫిర్యాదుతో..
సికింద్రాబాద్‌కు చెందిన సరోజజైన్‌ ప్రధాని మోదీకి వీరాభిమాని. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న నమో ఫౌండేషన్‌ నిర్వాహకులు గతేడాది ఆమె వద్దకు వచ్చారు. మోదీ పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని.. దానికి విరాళాలు ఇవ్వాలని కోరారు. దీంతో సరోజజైన్‌ రూ.12.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత తాము నమో ఫౌండేషన్‌కు వస్తామని, ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తామని సరోజజైన్‌ నిర్వాహకులను కోరారు. కానీ నిర్వాహకులు పదే పదే దాటవేస్తూ వచ్చారు. చివరికి సరోజజైన్‌ గట్టిగా ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగారు. ఎక్కువగా మాట్లాడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె తన కుమారుడు ఆశీష్‌జైన్‌తో కలసి నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

నమో ఫౌండేషన్‌ పేరుతో హైదరాబాద్‌లో సాగుతున్న కార్యకలాపాలపై సమాచారమిచ్చారు. దానిని పరిశీలించిన ప్రధాని కార్యాలయం అధికారులు అసలు ‘నమో’పేరుతో ఉన్న ఫౌండేషన్‌తో ప్రధాని మోదీకి, వారి సంబంధీకులకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అసలు ప్రధాని పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో నమో ఫౌండేషన్‌ వ్యవహారంపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది.

200 మందికి పైగా విరాళాలు!
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పంకత్‌ మెహతా 2013లో చైతన్యపురి ప్రాంతంలో నమో ఫౌండేషన్‌ కార్యాలయం ప్రారంభించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ పట్ల అభిమాన మున్న ధనికులు, వీఐపీలను టార్గెట్‌గా చేసుకుని.. విరాళాలు సేకరిస్తున్నట్టుగా గుర్తించినట్టు వెల్లడించారు. గోశాలల నిర్వాహణ, మొబైల్‌ స్కూళ్ల పేరుతో ప్రతి ఆదివారం ఉచితంగా విద్య బోధించడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్‌కు ఒక్క సరోజ జైన్‌ మాత్రమేగాకుండా దాదాపు 200 మందికి పైగా భారీగానే విరాళాలు ఇచ్చారని సీఐడీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, నిర్వాహకులను అరెస్టు చేస్తామని తెలిపారు.

సీఐడీకి ఫిర్యాదు చేయండి
ప్రధాని మోదీ పేరు చెప్పి నమో ఫౌండేషన్‌ పేరిట విరాళాలు, బెది రింపు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై సీఐడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని ఐజీ సౌమ్యా మిశ్రా గురు వారం సూచించారు. అలాంటి ఫౌండే షన్ల నిర్వాహకులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని.. ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement