
సీఐ బదిలీల్లో తమ్ముళ్ల చేతివాటం!
► చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు
► ఒక్కో బదిలీకి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డిమాండ్
కర్నూలు: జిల్లాలో సీఐల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. తమకు నచ్చిన అధికారిని స్టేషన్‌కు తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతల పైరవీలూ ప్రారంభమయ్యాయి. తాము చెప్పిన వారినే నియమించాలంటూ అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు సీనియర్ నేతలు పావులు కదపడం ప్రారంభించారు. ఒక్కో బదిలీకి రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ డిమాండ్ పలుకుతున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా సుమారు 10 నుంచి 15 మంది సీఐల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బదిలీలు తప్పనట్లే..
జిల్లాలో ప్రధానంగా నాలుగైదు స్టేషన్ల సీఐలకు బదిలీలు తప్పేట్టు కనిపించడం లేదు. దీర్ఘకాలంగా ఉండటంతో పాటు తీవ్ర విమర్శలు రావడంతో వీరిని బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు తమ బదిలీలను నిలుపుకునేందుకు సదరు స్టేషన్ల సీఐలు కూ డా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా కర్నూలు డివిజన్‌లోని నాలుగు నుంచి ఆరు స్టేషన్లతో పాటు ఆదోని రెవెన్యూ డివిజన్‌లో రెండు, నంద్యాల డివిజన్‌లో రెండు స్టేషన్లకు సీఐలకు స్థానచలనం తప్పేట్లు లేదు. ప్రధానంగా కర్నూలు డివిజన్‌లోని రెండు స్టేషన్ల సీఐలపై అనేక విమర్శలు ఉన్నాయి.
ఇటు ఇసుక వ్యాపారంతో పాటు మట్కాలోనూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి బదిలీ తప్పదని సమాచారం. ముఖ్యనేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన సీఐని మార్చాల్సిందేనని సదరు ముఖ్యనేత కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనితో పాటు స్టేషన్ పరిధిలోని ఎస్‌ఐల నుంచి నెలవారీ మాముళ్లు ఇవ్వాల్సిందేనని వేధిస్తుండటమూ బదిలీకి మరో కారణంగా తెలుస్తోంది. కర్నూలుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ సీఐపై కూడా ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో పాటు స్వయంగా బినామీ పేర్లతో ట్రా క్టర్లు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన బదిలీ కూడా తప్పదని తెలుస్తోంది.
స్థానాన్ని బట్టి డిమాండ్...
బదిలీలను అవకాశంగా తీసుకుని ఫోకల్ పోస్టులను (మంచి స్థానాలు) కైవసం చేసుకునేందుకు పలువురు నాన్ ఫోకల్ పోస్టుల్లో ఉన్న అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు అధికార పార్టీ నేతల నుంచి భారీగా డిమాండ్ వస్తోం ది. స్థానాన్ని బట్టి ఒక్కో పోస్టుకు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డి మాండ్ చేస్తున్నట్టు సమాచారం. అనుకూలమైన వ్యక్తికి పోస్టింగు ఇప్పించుకోవడంతో జేబులు నింపుకునేందుకు టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు.