
గ్రంథాలయశాఖ భవనం వరండాలో గ్యాస్ కోసం ఎదురు చూస్తూ కునుకు తీస్తున్న వినియోగదారుడు
కోటవురట్ల(పాయకరావుపేట): మండలవాసులకు గ్యాస్ కష్టాలు తీరలేదు. గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. పండగైనా, సెలవైనా పడిగాపులు కాయాల్సిందే. మండలంలో సుమారు 8 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్క గ్యాస్ ఏజన్సీ కూడా స్థానికంగా లేదు. హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ నర్సీపట్నం, భారత్ గ్యాస్ అడ్డురోడ్డు నుండి సరఫరా చేస్తున్నారు. వారానికోమారు వచ్చే గ్యాస్ వ్యాన్ కోసం మండలంలోని మెయిన్‌రోడ్డు వెంబడే కాకుండా మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వినియోగదారులు గ్యాస్ కోసం వేచి ఉంటారు.
సమయపాలన పాటించకపోవడంతో ఎపుడు వస్తుందో తెలియని వ్యాన్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపలా కాస్తారు. గ్యాస్ బండలను క్యూలో పెట్టి ఎదురు చూస్తుంటారు. ఇది ఇరవై ఏళ్లుగా సాగుతున్న వ్యవహారమే. అప్పటికీ ఇప్పటికీ మార్పులేదు. వినియోగదారులు పెరిగారు తప్ప సరఫరా మాత్రం యథాతథం. గురువారం సెలవు రోజైనా సరే గ్యాస్ కోసం పలువురు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పడిగాపులు కాసారు. మరికొందరు గ్యాస్ బండను సెక్యూరిటీగా తమ తలదగ్గర పెట్టుకుని కునుకుతీశారు. ఇదీ మండలంలోని గ్యాస్ వినియోగదారులు వ్యధ.
Comments
Please login to add a commentAdd a comment