బయటకు వెళ్లకుండా మహిళల్ని నిర్బంధించిన అధికారులు
చిత్తూరు అర్బన్: మహిళా సంఘాల్లోని ప్రతి మహిళకూ పసుపు కుంకుమ పథకం నగదు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే తరువాయి.. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం చిత్తూరు మునిసిపల్ కార్పొ రేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా మహిళల్ని అంబేడ్కర్ భవన్‌కు పిలిపించారు. ప్రతి మహిళకు సెల్‌ఫోన్, రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పారు కాబట్టి.. మీటింగ్‌కు వచ్చిన మహిళలకు మాత్రమే వీటినిస్తామని చెప్పారు. తీరా అక్కడకు వెళ్లిన మహిళలకు మెప్మా అధికారులు చుక్కలు చూపించారు. వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం బహిరంగ సభను ఇక్కడ లైవ్‌లో చూపెడతాం, చివరి వరకు ఉన్నవారి పేర్లు రాసుకుని వీరికి మాత్రమే పసుపు కుంకుమ వర్తింపచేస్తామని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళల్ని బలవంతంగా కూర్చోపెట్టారు.
సాంకేతిక కారణాలతో సీఎం ప్రసంగం టెలికాస్ట్ కాలేదు. ఈ క్రమంలో పలువురు మహిళలు పాఠశాలలకు వెళ్లిన పిల్లలకు భోజనాలు పంపాలని, ఇంటి వద్ద వృద్ధులను వదిలేసి వచ్చామని, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాలని సమావేశం నుంచి అర్ధాతరంగా బయటకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన అధికారులు గేట్లు మూయించేశారు. అప్పటికీ కొందరు మహిళలు గేట్లు తీసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే జుట్టుపట్టుకుని లాగుతూ గేట్లలోపల తోసేస్తూ దాష్టీకం ప్రదర్శించారు. ఈ దృశ్యాలను బయటి నుంచి చూస్తున్న జనాలకు అర్థంకాక.. పరుగున వచ్చి లోపల ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి మహిళల్ని బయటకు లాగేశారు. తీరా విషయం తెలుసుకున్నాక సిబ్బంది అత్యుత్సాహం చూసి ముక్కున వేలేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment