‘తూర్పు’లో దళితులపై దాడి
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి జరిగింది. ఆవులను అపహరించి వధిస్తున్నారన్న అనుమానంతో కొందరు దాడికి దిగారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శివారు సూదాపాలెం శ్మశానంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. అమలాపురంలోని జానకిపేటకు చెందిన మోకాటి ఎలీషా, అతని సోదరుడు మోకాటి వెంకటేశ్వరరావు, లాజర్ చనిపోయిన పశువుల చర్మాలను వలిచి చర్మకార పనికి వినియోగించుకుంటుంటారు. అమలాపురం రైతు బూరగాలయ అరవింద్‌కు చెందిన ఆవు విద్యుదాఘాతానికి గురై సోమవారం మరణించింది.
అరవింద్ ఆ ఆవును తీసుకువెళ్లాల్సిందిగా ఎలీషాకు చెప్పాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఎలీషా, లాజర్ చనిపోయిన ఆవును మినీ వ్యాన్‌లో పెట్టుకుని సూదాపాలెం శ్మశానానికి వెళ్లారు. రాత్రి 10.30 సమయంలో కత్తులతో ఆవు చర్మాన్ని తొలగిస్తుండ గా కామనగరువుకు చెందిన కొందరు రైతులు అక్కడికి వచ్చారు. తమకు చెందిన మూడు ఆవులు కన్పించకుండా పోవడంతో వాటి కోసం గాలిస్తున్న వారికి.. ఆవు చర్మం వలుస్తున్న ఎలీషా, లాజర్ కన్పించారు. వెంటనే వారిద్దరితో పాటు అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ లక్ష్మణకుమార్‌పై రైతులు మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు.
వారు తమ ఆవుల్ని అపహరించి వధించారన్న అనుమానంతో చెట్టుకు కట్టేసి కొడుతుండగా ఆ గ్రామ పంచాయతీ సభ్యుడు వెంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయూనికి దాడి చేసిన వారంతా పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన దళితులను పోలీసులు అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎలీషా, లాజర్ ఆవులను దొంగిలించలేదని, చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలిందని అమలాపురం డీఎస్పీ అంకయ్య మంగళవారం నాడిక్కడ చెప్పారు.
దాడికి సంబంధించి కామనగరువుకు చెందిన పలువురిపై ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దళితులపై దాడికి నిరసనగా అమలాపురంలో దళిత సంఘాల నాయకులు రాస్తారోకోకు దిగారు. దాడి ఘటనపై వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. కాగా, దళితులపై దాడి చేసిన వారిని 48 గంటల్లో అరెస్టు చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా దళితులు రోడ్డెక్కి ఆవు, ఎద్దు మాంసాలతోనే వంటావార్పులకు దిగుతారని హెచ్చరించారు.