అభివృద్ధిపై చర్చ హుళక్కేనా?
- నేడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం
- స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకే ప్రాధాన్యం
- అధికారులతో పరిచయ కార్యక్రమంతో సరి
- ఎన్నికల కోడ్ అడ్డంకి
మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరుగనుంది. జెడ్పీకి నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు సమావేశం నిర్వహించడంతో పాటు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. దీంతో ఆదివారం జెడ్పీ సర్వసభ్య సమా వేశాన్ని నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఉదయం 10గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సమావేశం నిర్వహించి అనంతరం స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం అధికారులకు జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం ఉంటుందని జెడ్పీ సీఈవో డి.సుదర్శనం తెలిపారు. నందిగామ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఆదివారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంత మేర చర్చ జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పేరుతో కాకుండా అధికారులతో పరిచయ కార్యక్రమం, ఏయే శాఖలో ఏయే పనులు చేపట్టాలి, ఎంతెంత నిధులు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో పాటు శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు.
సమస్యలపై దృష్టి సారిస్తారా ...
జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరు కానున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులంతా ఒక చోట చేరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు నెల ముగిసినా శివారు ప్రాంతాలకు ఇంకా సాగునీరు చేరలేదు. ఈ ఏడాది డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి.
రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా సంఘాల రుణమాఫీ ప్రధాన సమస్యగా మారింది. 2011 జూలై 22వ తేదీ నాటికి గత పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగింది. మూడేళ్ల అనంతరం తొలిసారిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తేందుకు, పాలకపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష సభ్యులు సంసిద్ధులుగానే ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ఈ సమావేశం సాదాసీదాగా జరుగుతుందా లేక చర్చకు దారి తీస్తుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
స్టాండింగ్ కమిటీల ఏర్పాటు
జిల్లా పరిషత్‌లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య- వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల కమిటీలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన స్టాండింగ్ కమిటీలు దాదాపు ఖరారయినప్పటికీ, సభ్యుల పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.