gadde anuradha
-
ఆస్పత్రిలో జెడ్పీ చైర్పర్సన్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ప్రభుత్వాస్పత్రి డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం క్యాజువాలిటీకి వచ్చిన రోగికి వెంటిలేటర్ అవసరం కాగా, అందుబాటులో లేకపోవడంతో రెండు గంటలపాటు అలాగే వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ దృష్టి ఆ రోగిపై పడింది. అతనికి ఏమైందని ప్రశ్నించగా, శ్యాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ పెట్టాల్సి ఉన్నా అందుబాటులో లేవని చెపుతున్నట్లు బంధువులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె వైద్యులను నిలదీశారు. క్యాజువాలిటీలో రెండు వెంటిలేటర్లు ఉండగా, ఒకటి పనిచేయడం లేదని, మరొకటి వేరే రోగికి పెట్టినట్లు తెలిపారు. వెంటనే రోగిని వెంటిలేటర్‌పై ఉంచాలని ఆదేశించడంతో ట్రామా కేర్‌లో ఉన్న వెంటిలేటర్‌ను తీసుకు వచ్చి ఆ రోగికి పెట్టారు. అనంతరం సిటీ స్కాన్‌తోపాటు, అవుట్ పేషెంట్ విభాగాన్ని అనూరాధ పరిశీలించి, రోగులను సమస్యలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఎందుకు నిర్వహించడం లేదని ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ డి.వెంకటేష్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాక పోవడంతో నిర్వహించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్చంధ సంస్థల సేవలు అభినందనీయం ప్రభుత్వాస్పత్రిలో శ్రీ వాసవీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా చపాతిలు అందించడం అభినందనీయమన్నారు. ఆమె చపాతీ తయారీ ప్లాంటును సందర్శించి వారు అందిస్తున్న సేవలు ప్రసంశించారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో సైతం ఇలాంటి పథకం అమలు చేసేందుకు కృషి చేయాలని సేవా సమితి నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భీమేశ్వర్, ఆర్ఎంఓ డాక్టర్ గీతాంజలి, డాక్టర్ భవానీశంకర్, అభివృద్ధి కమిటీ సభ్యులు దివి ఉమామహేశ్వరరావు, ముమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారత కోసం శిక్షణ
జిల్లా పరిషత్ ైచైర్పర్సన్ అనూరాధ మచిలీపట్నం (చిలకలపూడి) : మహిళా సాధికారిత కోసం, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా మహిళలకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం ఆమెతో పాటు జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్, డెప్యూటీ సీఈవో పి. కృష్ణమోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అనూరాధ మాట్లాడుతూ రాబోయే వేసవిలో రెండు నెలల పాటు మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేందుకు మండల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సెర్ప్(ఎస్ఈఆర్పీ), ఆంధ్రాబ్యాంకు గ్రామీణ శిక్షణ సంస్థ, డీఆర్డీఏ తదితర సంస్థల ద్వారా ఈ తరగతులు జరుగుతాయన్నారు. శిక్షణ అనంతరం రుణాలు ఇప్పిస్తామన్నారు. దీనికితోడు వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు. కంప్యూటర్, డ్రస్ డిజైనింగ్, సెల్ఫోన్ల మరమ్మతులు, జూట్ బ్యాగ్‌ల తయారీ, బ్యూటీషియన్, కలంకారీ అద్దకాలు, మామిడికాయ నుంచి పౌడర్ తయారు చేసే విధానాలపై శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ శిక్షణ వివరాలు జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు ఇప్పటికే మెసేజ్‌ల ద్వారా తెలియజేశామని, ఎక్కువ మంది మహిళలు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని వారిని కోరినట్లు తెలిపారు. ఆసక్తిగల మహిళలు ఎంపీడీవోలకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని అనూరాధ తెలిపారు. ప్రధానమంత్రి జనరేషన్ ప్రోగ్రాం ఆధారంగా ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే అభ్యర్థులకు అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ సీఈవో వి. నాగార్జునసాగర్ మాట్లాడుతూ చదువుకున్న మహిళలకు ఈ శిక్షణ తోడైతే స్వయం ఉపాధి, ఆర్ధికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అనూరాధ కోరారు. -
టిడిపి సీమంత రాజకీయం..!
జన్మభూమి - మా ఊరు సభలో భాగంగా గర్భిణులకు చేస్తున్న సీమంతంలోనూ అధికార పార్టీ రాజకీయ ప్రచారం చేస్తోంది. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చీర, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ వాయనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ఫొటోలు ఉండటంతో జన్మభూమికి వచ్చిన పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. చివరికి సీమంతం కార్యక్రమాల్లో సైతం అధికార పార్టీ తమ ప్రచారం మానుకోలేదంటూ ఎద్దేవాచేస్తున్నారు. - కృత్తివెన్ను -
అభివృద్ధిపై చర్చ హుళక్కేనా?
నేడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం స్టాండింగ్ కమిటీల ఏర్పాటుకే ప్రాధాన్యం అధికారులతో పరిచయ కార్యక్రమంతో సరి ఎన్నికల కోడ్ అడ్డంకి మచిలీపట్నం : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరుగనుంది. జెడ్పీకి నూతన పాలకవర్గం ఏర్పడిన తరువాత తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. పాలకవర్గం ఏర్పడిన 60 రోజుల్లోపు సమావేశం నిర్వహించడంతో పాటు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. దీంతో ఆదివారం జెడ్పీ సర్వసభ్య సమా వేశాన్ని నిర్వహిం చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత సమావేశం నిర్వహించి అనంతరం స్టాండింగ్ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం అధికారులకు జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం ఉంటుందని జెడ్పీ సీఈవో డి.సుదర్శనం తెలిపారు. నందిగామ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో ఆదివారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఎంత మేర చర్చ జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ పేరుతో కాకుండా అధికారులతో పరిచయ కార్యక్రమం, ఏయే శాఖలో ఏయే పనులు చేపట్టాలి, ఎంతెంత నిధులు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌లతో పాటు శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు. సమస్యలపై దృష్టి సారిస్తారా ... జిల్లా పరిషత్ సమావేశానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా హాజరు కానున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులంతా ఒక చోట చేరి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి సారిస్తారా లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆగస్టు నెల ముగిసినా శివారు ప్రాంతాలకు ఇంకా సాగునీరు చేరలేదు. ఈ ఏడాది డ్రెయిన్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. రైతుల రుణమాఫీతో పాటు డ్వాక్రా సంఘాల రుణమాఫీ ప్రధాన సమస్యగా మారింది. 2011 జూలై 22వ తేదీ నాటికి గత పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగింది. మూడేళ్ల అనంతరం తొలిసారిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తేందుకు, పాలకపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష సభ్యులు సంసిద్ధులుగానే ఉన్నారు. అయితే ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారడంతో ఈ సమావేశం సాదాసీదాగా జరుగుతుందా లేక చర్చకు దారి తీస్తుందా అనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టాండింగ్ కమిటీల ఏర్పాటు జిల్లా పరిషత్‌లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య- వైద్యం, మహిళా సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనుల కమిటీలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన స్టాండింగ్ కమిటీలు దాదాపు ఖరారయినప్పటికీ, సభ్యుల పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు. -
టీడీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా గద్దె అనూరాధ?
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా గద్దె అనూరాధను రంగంలోకి దింపేందుకు కసరత్తు జరుగుతోంది. గద్దె రామ్మోహన్ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉండటంతో పాటు విజయవాడ ఎంపీ, గన్నవరం ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటంతో ఈసారి ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై గద్దె రామ్మోహన్‌తో చంద్రబాబు బుధవారం చర్చించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గద్దె అనూరాధ ఎమ్మెస్సీ (బయో కెమిస్ట్రీ) చదివారు. జెడ్పీ చైర్మన్ పోస్టుకు పలువురు పోటీపడుతున్నప్పటికీ అనూరాధ విద్యావంతురాలు కావడంతో పాటు రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. గద్దె అనూరాధ కాకుండా ఇంకా ఎవరైనా అభ్యర్థులు లభిస్తారా.. అనే అన్వేషణలో రాష్ట్ర పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అనూరాధకు సీటు ఇచ్చే విషయంలో అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తోందని చెబుతున్నారు. అనూరాధకే టిక్కెట్ లభిస్తే ఆమె తిరువూరు జెడ్పీటీసీ సభ్యురాలుగా పోటీలోకి దిగుతారని సమాచారం. గద్దె దంపతుల తర్జనభర్జన... గద్దె రామ్మోహన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన వ్యాపార వ్యవహారాలన్నీ గద్దె అనూరాధ చూసుకుంటున్నారు. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తే వ్యాపారాలు కుంటుపడతాయనే భావనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తనకు జెడ్పీ చైర్పర్సన్ టిక్కెట్ ఇస్తే భవిష్యత్తులో తన భర్త గద్దె రామ్మోహన్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరేమోనన్న అనుమానాలు వారికి ఉన్నట్లు సమాచారం. దీంతో జెడ్పీ బరిలోకి దిగడంపై ఈ దంపతులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. ఎమ్మెల్యే సీటు కోసం గద్దె పట్టు... తన భార్యకు జెడ్పీ చైర్పర్సన్ టిక్కెట్ ఇచ్చినప్పటికీ తనకు తప్పనిసరిగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని గద్దె రామ్మోహన్ చంద్రబాబును కోరినట్లు సమాచారం. గతంలో తనకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడ (తూర్పు) సీటును తనకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సమ్మతిస్తేనే తన భార్య తిరువూరు నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతుందని అంటున్నారు. గతంలో నల్లగట్ల స్వామిదాస్‌కు తిరువూరు ఎమ్మెల్యే సీటు, ఆయన భార్య నల్లగట్ల సుధారాణికి జెడ్పీ చైర్పర్సన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గద్దె ఉదహరిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇవ్వాలని డిమాండ్... గద్దె అనూరాధకు జెడ్పీటీసీ సీటు ఇస్తే గద్దె రామ్మోహన్‌ను ఎన్నికల బరిలోంచి తప్పించాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం కార్పొరేషన్ సీటు కేటాయించే విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు ఇప్పటికే రోడ్డెక్కారు. వీరంతా రాబోయే ఎన్నికల్లో గద్దెకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పు సీటును గద్దెకు కాకుండా మరొకరికి కేటాయించాలంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గద్దె అనూరాధకు జెడ్పీ చైర్పర్సన్ సీటు ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.