ప్రభుత్వాస్పత్రిలో రోగుల నుంచి వివరాలు సేకరిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ప్రభుత్వాస్పత్రి డొల్లతనం మరోసారి బయటపడింది. ప్రాణాపాయస్థితిలో చికిత్స కోసం క్యాజువాలిటీకి వచ్చిన రోగికి వెంటిలేటర్ అవసరం కాగా, అందుబాటులో లేకపోవడంతో రెండు గంటలపాటు అలాగే వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ దృష్టి ఆ రోగిపై పడింది. అతనికి ఏమైందని ప్రశ్నించగా, శ్యాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, వెంటిలేటర్ పెట్టాల్సి ఉన్నా అందుబాటులో లేవని చెపుతున్నట్లు బంధువులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె వైద్యులను నిలదీశారు. క్యాజువాలిటీలో రెండు వెంటిలేటర్‌లు ఉండగా, ఒకటి పనిచేయడం లేదని, మరొకటి వేరే రోగికి పెట్టినట్లు తెలిపారు.
వెంటనే రోగిని వెంటిలేటర్‌పై ఉంచాలని ఆదేశించడంతో ట్రామా కేర్‌లో ఉన్న వెంటిలేటర్‌ను తీసుకు వచ్చి ఆ రోగికి పెట్టారు. అనంతరం సిటీ స్కాన్‌తోపాటు, అవుట్ పేషెంట్ విభాగాన్ని అనూరాధ పరిశీలించి, రోగులను సమస్యలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు ఎందుకు నిర్వహించడం లేదని ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ డి.వెంకటేష్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాక పోవడంతో నిర్వహించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
స్వచ్చంధ సంస్థల సేవలు అభినందనీయం
ప్రభుత్వాస్పత్రిలో శ్రీ వాసవీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా చపాతిలు అందించడం అభినందనీయమన్నారు. ఆమె చపాతీ తయారీ ప్లాంటును సందర్శించి వారు అందిస్తున్న సేవలు ప్రసంశించారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో సైతం ఇలాంటి పథకం అమలు చేసేందుకు కృషి చేయాలని సేవా సమితి నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ప్రభుత్వాస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భీమేశ్వర్, ఆర్‌ఎంఓ డాక్టర్ గీతాంజలి, డాక్టర్ భవానీశంకర్, అభివృద్ధి కమిటీ సభ్యులు దివి ఉమామహేశ్వరరావు, ముమ్మినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment