తణుకు : సామాన్యుడి సంపాదనలో సగం వైద్యం ఖర్చులకే సరిపోతోంది. అందులో ఎక్కువ శాతం మందుల కొనుగోళ్లకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించే లక్ష్యంతో అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేయాలని 2009లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2011లో ఏలూరు, తణుకు ప్రభుత్వాసుపత్రుల ఆవరణల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ షాపులను ఏర్పాటు చేసి పేదలపై మందుల ధరల భారా న్ని తగ్గించాలని నిర్ణయించారు. నేటికీ ఈ ప్రతిపాదనలు అమల్లోకి రాలేదు.
మహిళా సంఘాలకు చేయూత
జనరిక్ మందుల దుకాణాలను మహిళా సమాఖ్యల ద్వారా ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ షాపుల ద్వారా మహిళలకు చేయూతనివ్వాలని భావించారు. సాధారణంగా బయట లభించే మందులతో పోల్చితే జనరిక్ మందులు 90 శాతం తక్కువ ధరకే లభిస్తాయి. అమ్మకాల్లో వచ్చిన 20 నుంచి 25 శాతం కమీషన్ మహిళా సమాఖ్యల ద్వారా మహిళా సంఘాలకు చేరుతుంది. ప్రస్తుతం ఏలూరు, తణుకుల్లో షాపులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జనరిక్ మందులను అందుబాటులో ఉంచితే పేదలకు భారం తగ్గుతుంది.
చొరవ ఏదీ ?
కేవలం బ్రాండెడ్ మందులను మాత్రమే ప్రభుత్వ వైద్యులు రోగులకు ప్రిస్కిప్షన్‌లో రాస్తున్నారు. దీంతో జనరిక్ మందులు సరిగ్గా పనిచేయవనే అపోహలో రోగులు ఉన్నారు. కొందరు వైద్యులు కూడా మందుల కంపెనీల పారితోషికాలు, బహుమానాలకు అలవాటు పడి.. సదరు కంపెనీల మందులనే రాస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు జనరిక్ మందులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు వాటిపై అపోహలను పోగొట్టే విధంగా అవగాహన కల్పించాల్సి ఉంది.
రోగులకు ప్రయోజనం
అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు లభిస్తాయి. ప్రతి మందుపై 45 నుంచి 70 శాతం వరకు రాయితీ ఇస్తారు. జ్వరానికి వాడే పారాసిట్మల్ 10 మాత్రలు మార్కెట్‌లో రూ.16 ఉంటే జనరిక్ దుకాణాల్లో రూ.7కే లభిస్తాయి. మల్టీ విటమిన్ మాత్రలు మార్కెట్‌లో రూ.40 ఉంటే ఇక్కడ మాత్రం రూ.29కు లభిస్తున్నాయి. జలుబుకు వాడే సిట్రజిన్ మాత్రలు మార్కెట్‌లో రూ.30 ఉంటే జనరిక్‌లో రూ. 2కు లభిస్తున్నాయి.
త్వరలో 23 ప్రాంతాల్లో..
రాబోయే రోజుల్లో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో జనరిక్ మందుల షాపులను విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే 80 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చాం. జిల్లాలో 23 ప్రాంతాల్లో షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
- ఎ.శ్యాంప్రసాద్, పీడీ, డీఆర్‌డీఏ.
జనరిక్ మందులకు నిర్లక్ష్యపు జ్వరం
Published Fri, May 22 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement