- కాంప్లెక్స్ ఎదుట ధర్నా
- నిలిచిన డిపో బస్ సర్వీసులు
- ఆందోళనకు పాడేరు ఎమ్మెల్యే మద్దతు డీఎం ప్రవీణపై చర్యలకు
- అధికారుల హామీ
పాడేరు: పాడేరు ఆర్టీసీ డిపో మేనేజర్ వి.ప్రవీణ తమను వేధిస్తున్నారని, శాఖాపరమంటూ అక్రమంగా చర్యలు చేపడుతున్నారని యూనియన్లకు అతీతంగా ఆర్టీసీ కార్మికులంతా గురువారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించారు. కాంప్లెక్స్ ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు ధర్నా చేపట్టడంతో ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం ఉదయం డిపోలోని 38 బస్సులూ కదల లేదు. డిపో మేనేజర్ ప్రవీణను బదిలీ చేసేంత వరకు విధుల్లోకి చేరేది లేదని భీష్మించారు. ప్రయాణికుల ఇక్కట్లు మధ్యాహ్నం వరకు బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. కార్మికుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంపూర్ణ మద్దతునిచ్చారు.
డీఎం బదిలీకి అధికారుల హామీ
ఇంతలో విశాఖ నుంచి వచ్చిన ఆర్టీసీ డీవీఎం జీవన్ ప్రసాద్, సెక్యూరిటీ ఇంజినీర్ ప్రసాదరావు, కార్మిక సంఘం నేత రమణతో కలిసి ఎమ్మెల్యే చర్చలు జరిపారు. డీఎం ప్రవీణను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏఎస్పీ ఎ.బాబూజీ కూడా అక్కడకు చేరుకున్నారు. డీఎం ప్రవీణ బదిలీకి చర్యలు తీసుకుంటామని, విధులకు గైర్హాజరైనందుకు కార్మికులపై ఎలాంటి చర్యలూ ఉండవని ఆర్టీసీ ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సంతృప్తి చెందారు. ఆమె సూచనతో కార్మికులంతా మధ్యాహ్నం 2 గంటలకు ఆందోళనను విరమించి విధులకు హాజరవడంతో డిపోలో బస్సులన్నీ కదిలాయి.