గెర్డెవ్‌కు పోలీస్ రక్షణ!
కార్మికులను నిర్బంధించిన విషయం వారికెరుకే!
మొన్న ట్రైనీ ఎస్పీ నుంచి నేటి రూరల్ సీఐ వరకు కర్మాగారం గెస్ట్‌హౌస్‌లోనే బస
కార్మికులు, సెక్యూరీటి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ తెలిసినా మౌనం
పెద్దల అండతోనే కార్మికులపై యాజమాన్యాం పెత్తనం
సీసీ పుటేజీల్లో రికార్డయిన దృశ్యాల తొలగింపు!
తాడిపత్రి : కార్మికులతో చాకిరీ చేయించుకుంటూ.. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న తాడిపత్రిలోని గెర్డెవ్ ఉక్కు పరిశ్రమ వైపే పోలీసులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలకు జరుగుతున్న వ్యవహారాలు బలాన్నిస్తున్నాయి. ఇది వరకు ఇక్కడ పనిచేసిన ఓ ఉన్నతాధికారి గెర్డెవ్ గెస్ట్‌హౌస్‌లోనే బస చేశారు. ప్రస్తుత రూరల్ సీఐ వెంకటరెడ్డి ఇపుడు అక్కడే ఉంటున్నారు. అందువల్లే 18 మంది ఒడిశా కార్మికులను నిర్బంధించి, వారికి రావాల్సిన జీతాలు ఇవ్వకుండా బెదిరించి పని చేయిస్తుండడం, చివరకు ఆ రాష్ర్టంలోని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసి వారిని స్వగ్రామాలకు చేర్పించిన విషయం, మద్యం విషయమై కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ పడడం తెలిసినా పోలీసులు మిన్నకుండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే ‘గెర్డెవ్’ యాజమాన్యం కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీసీ పుటేజీలు పరిశీలిస్తే బండారం బయట పడుతుంది
మొన్న ట్రైనీ ఎస్పీ నుంచి మొదలుకొని నేటి సీఐ వరకు గెస్ట్‌హౌస్‌లో ఉన్న దృశ్యాలు పరిశ్రమలోని ప్రధాన ద్వారంతోపాటు ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కర్మాగారంలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో కార్మికుల నిర్బంధం, అధికారుల పర్యటనలు మొత్తం రికార్డయినట్లు తెలుస్తోంది. అయితే సీసీ కెమెరాల పుటేజీలలో ఇప్పటికే ముఖ్యమైన భాగం తొలగించినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మొత్తం కార్మికుల నిర్బంధం, కార్మిక శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వగ్రామాలకు తరలింపు, గాయాలైన కార్మికులను వాహనాల్లో తరలిస్తున్న విషయం బయటకు పొక్కితే ప్రమాదమని ఆ దృశ్యాలను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గెర్డెవ్ యాజమాన్యంపై పోలీసులు మెతక వైఖరికి ప్రధాన కారణం ఇదే. తాము కూడా భాగస్వామ్యలు అవుతామని, ఉన్నాతాధికారులకు తప్పుడు నివేదికలు పంపే పనిలో పడ్డారు అధికారులు.
కార్మికులను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోండి
గెర్డెవ్ ఉక్కు కర్మాగారంలో ఒడిశా కార్మికులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీరామమూర్తి, సభ్యులు సుదర్శన్‌రావు తదితరులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో వెట్టి చేయించుకోవడమే కాకుండా వారిని నిర్బంధించిన విషయంపై ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరారు. కార్మిక చట్టాలు అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.