guesthouse
-
మహిళలు ఇక బస్టాండ్‌లో సేఫ్.. కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్ట్!
‘స్టే సేఫ్’... ఇది కేరళ ఆర్టిసీ తాజా ప్రాజెక్ట్. మహిళా ప్రయాణికుల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను మొదలెట్టింది. సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు... వీరు సేఫ్‌గా ఇక బస్టాండ్లలోనే గదులు తీసుకుని ఉండవచ్చు. వీరి కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్ ఏసి గదులు తయారవుతున్నాయి. అదీ ప్రయత్నించదగ్గ ధరలకు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశంసలు కూడా వస్తున్నాయి. గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలెట్టారు. అక్కడ మహిళలకు అవసరమైన వస్తువులు, చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు ఉండే స్టోర్ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు కేటాయించే, నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా ఇది కోవిడ్ సమయపు ఆలోచన కూడా అనొచ్చు. కోవిడ్ వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కొంచెం తగ్గింది. స్త్రీలకు తోడు వచ్చే వీలు లేనివారు, లేదా కోవిడ్ వల్ల బంధువుల ఇంటికి వెళ్లడం/రానివ్వడం కుదరని వారు ఎక్కడ ఉండాలి? వారి కోసం బస్టాండుల్లోనే గదుల ఆలోచన వచ్చింది. ఇది ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో సందేహం లేదు. హోటళ్ల కంటే ఇవే క్షేమకరం అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్ హోటళ్లు కిటకిటలాడొచ్చు. -
మాల్యా కోసం...జైలుగా మారనున్న గెస్ట్‌హౌస్
సాక్షి,ముంబయి: బ్యాంకులకు రూ వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో నిందితుడు, లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. అప్పగింత కేసులో భారత్‌లో జైళ్ల పరిస్థితిని సాకుగా చూపుతున్నలిక్కర్ దిగ్గజం మాల్యాకు చెక్ పెట్టేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం ద్వారా పలు ప్రతిపాదనలు పంపగా, తాజాగా ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ను జైలుగా మార్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. బ్రిటన్ నుంచి తనను తరలించకుండా ఉండేందుకు భారత్‌లో జైళ్ల పరిస్థితి దయనీయంగా ఉంటుందని మాల్యా తన న్యాయవాదులతో బ్రిటన్ న్యాయస్ధానం ముందు వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా దేశంలో ఏ ప్రాంతాన్ని అయినా జైలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు విశేషాధికారాలున్నాయని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. దేశంలో జైళ్లు బాగాలేవని మాల్యా అప్పగింతకు దాన్ని అవరోధంగా భావిస్తే...ఆయనకు అనుగుణంగా ఉండేలా గెస్ట్‌హౌస్‌లోనే మాల్యాను ఉంచుతామని, దాన్నే ప్రభుత్వం జైలుగా ప్రకటించవచ్చనే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. బ్రిటన్ కోర్టులో జరుగుతున్న మాల్యా అప్పగింత కేసులో పదునైన వాదనలు వినిపించేందుకు అవసరమైన వ్యూహాన్ని మంగళవారం జరిగే భేటీలో హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయనుంది. మాల్యా న్యాయవాదులు లేవనెత్తే అంశాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఎలాంటి వాదనను తెరపైకి తేవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. మాల్యా అప్పగింత కేసు విచారణ డిసెంబర్ 4న జరగనుంది. మాల్యా న్యాయవాదుల వాదనలను తిప్పికొట్టేందుకు సకల సౌకర్యాలున్న ముంబయి ఆర్థర్ రోడ్డు జైలును ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ జైలులోని బ్యారక్ 12లో మాల్యాను ఉంచుతామంటూ దానికి సంబంధించిన ఫోటోలనే హోంమంత్రిత్వ శాఖకు మహారాష్ర్ట ప్రభుత్వం పంపింది. యూరప్‌లోని జైళ్లతో సరిపోలేలా ఆర్ధర్ రోడ్డు జైలు బ్యారక్ నెంబర్ 12 ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఉద్యోగం పేరుతో యువతిపై...
హర్యానా: పశ్చిమ బెంగాల్ నుండి ఉద్యోగం కోసం వచ్చిన ఒంటరి యువతిపై (22) ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్లోని ఓ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుల్లోని ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. కార్యాలయానికి తీసుకు వెళుతున్నానని చెప్పి, ఆమెను గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లాడు. అనంతరం ఆ వ్యక్తితో సహా ఏడుగురు ... ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. భర్తతో విభేదాల కారణంగా వేరుగా ఉంటోంది. తన కొడుకును పోషించుకోవడానికి, ఉపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం గుర్గావ్కు వెళ్లినట్టు సమాచారం. -
ఎంపీ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన
కడప కార్పొరేషన్: స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు సమస్యలను పరిష్కరించాలని ఆయా అధికారులకు ఎంపీ ఫోన్ చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని తిరుపతి మహిళా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ.ప్రభాకర్‌రెడ్డి(పీలేరు) తీసుకున్న పది లక్షలు రూపాయల్లో ఇంకా రూ. 5.60లక్షలు ఇవ్వాల్సి ఉందని వెంకమ్మ ఫిర్యాదు చేశారు. డబ్బు అడిగితే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఫోన్‌చేసి సమస్యను పరిష్కరించాలని అవినాష్‌రెడ్డి కోరారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని రాజుపాళెం, బద్వేల్‌కు చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రాద్దుటూరుకు చెందిన ప్రభుత్వ కళాశాలలో తాను ఉద్యోగం చేస్తుండేవాడినని, తనకు మళ్లీ ఆ ఉద్యోగం ఇప్పించాలని వై.కిరణ్‌కుమార్ అనే యువకుడు విన్నవించాడు. పోరుమామిళ్ల టైలర్స్ కాలనీలో హౌసింగ్ బోర్డు వారు తనకు ఎల్ఐజీ హౌస్ కేటాయించారని, ఇంతవరకూ తనకు ఇళ్లు చూపలే దని రహమతుల్లా అనే వృద్ధుడు ఫిర్యాదు చేశారు. సీబీఆర్ ప్రాజెక్టు టెర్మినేట్ అవుతోందని జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తనను తొలగించారని, ఆ ప్రాజెక్టు కొనసాగుతున్నందున మళ్లీ ఉద్యోగం ఇప్పించాలని ముస్తఫ్ ఖాన్ కోరారు. కార్యక్రమంలో చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు ఎంపీ సురేష్, మాజీ మున్సిపల్ చెర్మైన్ మునెయ్య, విద్యార్థి నాయకుడు బి.అమర్నాథ్రెడ్డి, ఐస్‌క్రీం రవి, మహిమలూరి వెంకటేష్ పాల్గొన్నారు. -
గెర్డెవ్‌కు పోలీస్ రక్షణ!
కార్మికులను నిర్బంధించిన విషయం వారికెరుకే! మొన్న ట్రైనీ ఎస్పీ నుంచి నేటి రూరల్ సీఐ వరకు కర్మాగారం గెస్ట్‌హౌస్‌లోనే బస కార్మికులు, సెక్యూరీటి సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ తెలిసినా మౌనం పెద్దల అండతోనే కార్మికులపై యాజమాన్యాం పెత్తనం సీసీ పుటేజీల్లో రికార్డయిన దృశ్యాల తొలగింపు! తాడిపత్రి : కార్మికులతో చాకిరీ చేయించుకుంటూ.. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్న తాడిపత్రిలోని గెర్డెవ్ ఉక్కు పరిశ్రమ వైపే పోలీసులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలకు జరుగుతున్న వ్యవహారాలు బలాన్నిస్తున్నాయి. ఇది వరకు ఇక్కడ పనిచేసిన ఓ ఉన్నతాధికారి గెర్డెవ్ గెస్ట్‌హౌస్‌లోనే బస చేశారు. ప్రస్తుత రూరల్ సీఐ వెంకటరెడ్డి ఇపుడు అక్కడే ఉంటున్నారు. అందువల్లే 18 మంది ఒడిశా కార్మికులను నిర్బంధించి, వారికి రావాల్సిన జీతాలు ఇవ్వకుండా బెదిరించి పని చేయిస్తుండడం, చివరకు ఆ రాష్ర్టంలోని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసి వారిని స్వగ్రామాలకు చేర్పించిన విషయం, మద్యం విషయమై కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ పడడం తెలిసినా పోలీసులు మిన్నకుండిపోయారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే ‘గెర్డెవ్’ యాజమాన్యం కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీసీ పుటేజీలు పరిశీలిస్తే బండారం బయట పడుతుంది మొన్న ట్రైనీ ఎస్పీ నుంచి మొదలుకొని నేటి సీఐ వరకు గెస్ట్‌హౌస్‌లో ఉన్న దృశ్యాలు పరిశ్రమలోని ప్రధాన ద్వారంతోపాటు ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కర్మాగారంలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో కార్మికుల నిర్బంధం, అధికారుల పర్యటనలు మొత్తం రికార్డయినట్లు తెలుస్తోంది. అయితే సీసీ కెమెరాల పుటేజీలలో ఇప్పటికే ముఖ్యమైన భాగం తొలగించినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మొత్తం కార్మికుల నిర్బంధం, కార్మిక శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్వగ్రామాలకు తరలింపు, గాయాలైన కార్మికులను వాహనాల్లో తరలిస్తున్న విషయం బయటకు పొక్కితే ప్రమాదమని ఆ దృశ్యాలను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గెర్డెవ్ యాజమాన్యంపై పోలీసులు మెతక వైఖరికి ప్రధాన కారణం ఇదే. తాము కూడా భాగస్వామ్యలు అవుతామని, ఉన్నాతాధికారులకు తప్పుడు నివేదికలు పంపే పనిలో పడ్డారు అధికారులు. కార్మికులను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోండి గెర్డెవ్ ఉక్కు కర్మాగారంలో ఒడిశా కార్మికులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీరామమూర్తి, సభ్యులు సుదర్శన్‌రావు తదితరులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో వెట్టి చేయించుకోవడమే కాకుండా వారిని నిర్బంధించిన విషయంపై ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరారు. కార్మిక చట్టాలు అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : ఈ ఏడాది వరి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయని జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. నిర్మల్‌లోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 175 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందులో 105 కేంద్రాలు ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగగా, మిగిలినవి మార్కెటింగ్, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేపట్టినట్లు వివరించారు. ప్రతీ ఏడాది సాధారణంగా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని, కానీ ఈసారి అనూహ్యరీతిలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఊహించిన దానికంటే ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 3,23,977 ధాన్యం బస్తాలను కొనుగోలు చేశామన్నారు. వరి ధాన్యం కిలోకు రూ.36 చొప్పున ప్రభుత్వం ఐకేపీ సిబ్బందికి కమీషన్ రూపంలో చె ల్లిస్తుందని, మొత్తం ఐకేపీకి రూ.2 కోట్ల లాభం వస్తుందని అన్నారు. తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని, ధాన్యం తరలించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి ధాన్యాన్ని గోదాంలకు త రలిస్తామని అన్నారు. జేసీతోపాటు ఆర్డీవో అరుణశ్రీ, డీఎస్వో వసంత్‌రావు, ఐకేపీ మార్కెటింగ్ జిల్లా అధికారి చరణ్‌దాస్, తహశీల్దార్ సదానందం ఉన్నారు.