
ఈ శునక సంతానం ఇంతింత కాదయా...!
మలికిపురం(తూర్పు గోదావరి) : సంతానంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఓ శునకం. తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలోని యడ్ల రాజేష్ పెంచుకుంటున్న జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం తొలి కాన్పులో 8 పిల్లల్ని కనేసింది. రెండో దఫా 9, మూడోసారి 11 పిల్లలకు జన్మనిచ్చింది.
ప్రతీసారి కొత్త సంఖ్యతో రికార్డులు సృష్టించేస్తున్న ఈ శునకం సోమవారం నాలుగో దఫాలో 13 పిల్లలకు జన్మనిచ్చి ఆ ఇంటి యజమానులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. సాధారణంగా ఈ జాతి కుక్కలు ఒకసారికి నాలుగు నుంచి ఆరు పిల్లలను మాత్రమే కంటాయని, కానీ తాను పెంచుతున్న కుక్క ప్రతి ఈతకూ ఇలా పిల్లల సంఖ్యను పెంచుతూ పోవడం ఆశ్చర్యంగా ఉందని రాజేష్ అన్నారు.