గాంధీఆస్పత్రి: ఆకలితో అలమటిస్తూ..గత నాలుగు రోజులుగా యజమాని కోసం వేచిచూస్తుందో శునకం. ఆహారం పెట్టి బుజ్జగించినప్పటికీ ముద్ద ముట్టకుండా, యజమానిపై బెంగతో నీరసించిపొతోంది. ఎలా చేరిందో తెలియదుకానీ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరింది. వీధి కుక్కలు గట్టిగా అరుస్తూ మూకుమ్మడిగా దాడి చేయడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది జర్మన్ షెపర్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
శునకానికి చెందిన యజమాని కోసం ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. గాంధీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శివాజీ ఆధ్వర్యంలో పెడిగ్రీతోపాటు మాంసాహరం పెట్టినప్పటికీ తినకుండా యజమాని కోసం వేచిచూస్తోంది. బోయిగూడ వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఇంజక్షన్లు, మందులు ఇప్పించామని, పోలీసులకు సమాచారం అందించామని, యజమానిపై బెంగతో రోజురోజుకు నీరసించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనుషుల మధ్య పడుకోవడం, కార్లలో తిరగడం, యజమాని పెడితేనే ఆహారం తీసుకునే అలవాటు ఉన్న జర్మన్‌షెపర్డ్ ఒంటరిగా ఉండలేకపోతోందని, యజమాని ఆచూకీ తెలియకుంటే జంతుసంరక్షణ ప్రతినిధులకు అప్పగిస్తామని గాంధీ సెక్యూరిటీ అధికారి శివాజీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment