german shepherd dog
-
నాలుగు రోజులుగా యజమాని కోసం వేచిచూస్తుందో శునకం...
గాంధీఆస్పత్రి: ఆకలితో అలమటిస్తూ..గత నాలుగు రోజులుగా యజమాని కోసం వేచిచూస్తుందో శునకం. ఆహారం పెట్టి బుజ్జగించినప్పటికీ ముద్ద ముట్టకుండా, యజమానిపై బెంగతో నీరసించిపొతోంది. ఎలా చేరిందో తెలియదుకానీ జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకం నాలుగు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరింది. వీధి కుక్కలు గట్టిగా అరుస్తూ మూకుమ్మడిగా దాడి చేయడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది జర్మన్ షెపర్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శునకానికి చెందిన యజమాని కోసం ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది. గాంధీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శివాజీ ఆధ్వర్యంలో పెడిగ్రీతోపాటు మాంసాహరం పెట్టినప్పటికీ తినకుండా యజమాని కోసం వేచిచూస్తోంది. బోయిగూడ వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఇంజక్షన్లు, మందులు ఇప్పించామని, పోలీసులకు సమాచారం అందించామని, యజమానిపై బెంగతో రోజురోజుకు నీరసించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల మధ్య పడుకోవడం, కార్లలో తిరగడం, యజమాని పెడితేనే ఆహారం తీసుకునే అలవాటు ఉన్న జర్మన్‌షెపర్డ్ ఒంటరిగా ఉండలేకపోతోందని, యజమాని ఆచూకీ తెలియకుంటే జంతుసంరక్షణ ప్రతినిధులకు అప్పగిస్తామని గాంధీ సెక్యూరిటీ అధికారి శివాజీ వివరించారు. -
శ్వేతసౌధానికి కొత్త గెస్ట్
అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌కు కొత్త అతిథి వచ్చారు. అదేంటి అధ్యక్ష నివాసమన్నాక నిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా అంటారా! అలా కాదు ఈ గెస్ట్ వెరీ స్పెషల్. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో చూద్దామా! గెస్ట్ పేరు కమాండర్. అధ్యక్షుల వారి పెంపుడు శునకం. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు 79వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జేమ్స్ బైడెన్ బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 1న పుట్టిన ఈ శునకం ఇటీవల శ్వేతసౌధంలో అడుగిడింది. బైడెన్ వచ్చాక వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మూడో శునకం ఇది. ఇంతకుముందు బైడెన్ దంపతులు ఎంతో మురిపెంగా పెంచుకున్న చాంప్ (జర్మన్ షెపర్డ్) గత జూన్‌లో చనిపోయింది. దీంతో బైడెన్ దంపతులు చాలా బాధపడ్డారు. దీంతో ఆయన సోదరుడు కమాండర్‌ను ఇచ్చారు. ఇదిగాకుండా బైడెన్‌కు మేజర్ అనే మరో శునకం కూడా ఉండేది. దీనికి కోపం చాలా ఎక్కువట. అది వైట్‌హౌస్ సిబ్బందిని, అధికారులను బాగా ఇబ్బంది పెట్టేదట. గత మార్చిలో ఇద్దరిని కరిచేసింది కూడా. దీంతో మేజర్‌ను బైడెన్ తన సొంతూరు అయిన డెలావేర్‌లోని విల్మింగ్టన్కు పంపారని ప్రెస్ సెక్రెటరీ మైకేల్ లారోసా చెప్పారు. కొత్త వాళ్ల మధ్యకాకుండా తెలిసిన వాళ్ల మధ్య ఉంచితేనే అది బాగా ఉంటుందని డాగ్ ట్రైనర్స్ చెప్పడంతో మేజర్‌ను డెలావేర్‌లోనే ఉంచారు. ఇది ఇష్టమొచ్చినట్టు కరవకుండా వైట్‌హౌస్‌లో బుద్ధిగా మసలేందుకు ‘సుదీర్ఘ శిక్షణ’ సైతం ఇప్పించారు. అప్పటినుంచి దాని కోపం కొంచెం మేరకు తగ్గిందని లారోసా చెప్పారు. సెలవుదినాల్లో బైడెన్ విల్మింగ్టన్లో గడుపుతారు. కమాండర్ రాకను బైడెన్ ఎంతగానో ఆస్వాదించారు. ‘కమాండర్.. వైట్‌హౌస్‌కు స్వాగతం’ అని దాని ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. నిత్యం ఒత్తిడితో తలమునకలయ్యే అధ్యక్షుడు ఈ కమాండర్‌తో కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు. వైట్‌హౌస్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న పెంపుడు జంతువుల సంప్రదాయాన్ని గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేయగా.. చాంప్, మేజర్లను తెచ్చి బైడెన్ దాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కాగా అతి త్వరలో ఒక పిల్లి కూడా వైట్‌హౌస్‌లోకి రానుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చాంప్ మృతితో విషాదంలో బైడెన్ దంపతులు.. 13 ఏళ్ల జ్ఞాపకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబానికి ఎంతో ఇష్టమైన జర్మన్ షెఫర్డ్ శునకం చాంప్ (13) మరణించింది. వయోభారం కారణంగానే డాగ్ చనిపోయినట్లు బైడెన్ కుటుంబం వెల్లడించింది. చాంప్ మృతి చెందిన విషయాన్ని అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మా ప్రియమైన చాంప్, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మేము నిన్ను ఎల్లప్పుడూ కోల్పోతాము’ అని సంతాపాన్ని తెలియజేశారు. RIP to our sweet, good boy, Champ. We will miss you always. pic.twitter.com/63hXXp8W9P — Jill Biden (@FLOTUS) June 19, 2021 2008లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ ఓ జంతువుల వ్యాపారి నుంచి చాంప్‌ను చిన్న కూనగా కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి చాంప్ బైడెన్ కుటుంబంలో ఓ భాగమైంది. గత 13 ఏళ్లుగా ఆ శునకంతో ఉన్న జ్ఞాపకాలను బైడెన్ దంపతులు గుర్తు చేసుకున్నారు. డెలావర్ ఉన్న బైడెన్ స్వగృహంతోపాటు శ్వేత సౌధంలోనూ చాంప్కు ప్రత్యేక స్థానం ఉండేది. కాగా, చాంప్ మృతితో బైడెన్ ఇంట్లో ఉండే మరో శునకం మేజర్ ఒంటరిది అయ్యింది. బైడెన్ ప్రతిరోజు వాకింగ్‌కు వెళ్లే సమయంలో ఆ రెండు శునకాలను వెంట తీసుకెళ్లేవాడట. చదవండి: బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా? -
'టైగర్' డాగ్.. వేటగాళ్ల గుండెల్లో గుబులు
(పెద్దదోర్నాల): టైగర్.. కొద్దిరోజులుగా నల్లమల అటవీ శాఖలో మార్మోగుతున్న పేరు. స్మగ్లర్లు, వేటగాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న పేరు. తమను ఎవరూ పట్టుకోలేరని విర్రవీగుతున్న వారిని ఇట్టే పట్టేస్తూ జైల్లో ఊచలు లెక్కించేలా చేస్తున్న ఉత్తమ జాతి జాగిలమే ఈ టైగర్. నిజ నిర్ధారణకు అవసరమైన సాక్ష్యాలను అటవీ శాఖాధికారులకు అందిస్తూ నల్లమల అభయారణ్యంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ జాగిలం తన సత్తా చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో 9 వేల చదరపు కిలోమీటర్లలో నల్లమల అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ వన్య ప్రాణుల వేటతో పాటు, అడవులను కొల్లగొట్టే ఘటనలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటవీ వైశాల్యం పెద్దది కావటం, సిబ్బంది తక్కువగా ఉండటంతో స్మగ్లర్లు, వేటగాళ్లకు ఎదురులేకుండా పోతోంది. దీంతోపాటు అటవీ సిబ్బందిపై స్మగ్లర్లు దాడులకు తెగబడుతుండటంతో వీరిని నియంత్రించటం ఆ శాఖకు కష్టంగా మారింది. దీంతో అధికారులు పోలీసు శాఖ తరహాలోనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ‘టైగర్’కు ప్రత్యేక సౌకర్యాలు నిజ నిర్ధారణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈ టైగర్‌కు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 22 కేజీల బరువు, 24 అంగుళాల ఎత్తుండే ఈ జాగిలానికి అటవీ శాఖ కార్యాలయంలో ఓ క్వార్టర్‌ను కేటాయించారు. దీనికి ప్రతిరోజూ ప్రత్యేక డైట్ మెనూను అమలుచేస్తుంటారు. ఏటా వ్యాక్సిన్లు, డీవార్మింగ్ మాత్రలను వేయిస్తామని శిక్షకుడు సుధాకర్ తెలిపారు. శిక్షణలో భాగంగా డాగ్ విన్యాసం జర్మన్ షెపర్డ్‌తో స్మగ్లర్లలో గుబులు జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ మగ శునకానికి (టైగర్) గ్వాలియర్‌లో శిక్షణను ఇప్పించారు. ఈ శునకం అభయారణ్యంలో కలప స్మగ్లర్లు, వేటగాళ్ల కార్యకలాపాలను అడ్డుకోవటంతో పాటు, పులులు ఇతర వన్య ప్రాణుల కదలికలను పసిగడుతోందని అధికారులు ఈ టైగర్ సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది నేరగాళ్లను ఈ ‘టైగర్’ పట్టించింది. ఉదా.. ► నంద్యాల డివిజన్ పచ్చర్లలోని రైలు పట్టాల పక్కన 2018 నవంబర్ 17న ఓ చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అధికారులు ఈ ‘టైగర్’ సహాయంతో ఘటన కారణాలను ఛేదించారు. ► 2020 జనవరి 16న మం డల పరిధిలో సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వద్ద కుందేళ్లు ఉన్నట్లు ఈ టైగర్ పసిగట్టి నిందితుడ్ని పట్టుకోవటంలో కీలకంగా వ్యవహరించింది. ► అలాగే, ఇదే ఏడాది మార్చి 30న కర్నూల్ జిల్లా నాగటూటి రేంజిలో కొందరు వ్యక్తుల వద్ద కణితి మాంసాన్ని గుర్తించిన ‘టైగర్’ వారిని పట్టించింది. ఆ కేసులో దుండగులకు జైలుశిక్షలు పడ్డాయి. ► ఇదే సంవత్సరం జూలై 21న మండలంలోని సుందరయ్య కాల నీలో బతికున్న రెండు కుందేళ్లతో సంచరిస్తున్న వ్యక్తిని పసిగట్టింది. ► మొన్న ఆగస్టులో హసానాబాద వద్ద అడవిపంది మాంసాన్ని పంచుకుంటున్న వ్యక్తులను కటకటాల పాలయ్యేలా చేసింది. ‘టైగర్’ సేవలు అమోఘం అటవీ శాఖకు ‘టైగర్’ అందిస్తున్న సేవలు అమోఘం. గతంలో ఎన్నో కేసులను ఛేదించిన సందర్భాలున్నాయి. ఓ వన్యప్రాణిని కాల్చేసిన సంఘటనలో, నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించింది. – బబిత, డీఎఫ్ఓ, మార్కాపురం -
ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్నే లాక్కొచ్చింది
వాషింగ్టన్: శునకాన్ని కాపలా సింహంగానే చూడకుండా రకరకాల పనులు అప్పజెప్పుతున్నారు దానికి. పాల ప్యాకెట్ తీసుకురమ్మనో, పేపర్ పట్టుకురమ్మనో, ఫ్రిజ్‌లో నుంచి మంచినీళ్లు తెమ్మనో లేదా కాసేపు కలిసి ఆడుకోవడమో ఇలా చాలా రకాలుగానే ఉపయోగించుకుంటున్నారు శునకాలను. మనదేశంలో ఇది అరుదేమో కానీ విదేశాల్లో మాత్రం సర్వసాధారణం. ఇక శునకాలకు ఈమేరకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సంస్థలు కూడా ఉంటాయి. అలా అమెరికాలోని కెంటకీలో ‘డబుల్ హెచ్ కెనైన్’ అనే ట్రైనింగ్ అకాడమీ ఉంది. ఇది కుక్కలకు రకరకాల పనులను నేర్పించే శిక్షణ సంస్థ. ఇందులో రైకర్ అనే శునకం శిక్షణకు వచ్చింది. దానికి పనులు చేయాలన్న ఆరాటమే కానీ ఏ ఒక్కటీ సరిగ్గా చేయలేకపోయింది.(ప్రియురాళ్లకు బాయ్‌ఫ్రెండ్స్ సర్ప్రైజ్) పైగా ప్రయత్నించే క్రమంలో అది చేస్తున్న పనులు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఫ్రిజ్ డోర్ తెరవమంటే ఏకంగా ఫ్రిజ్నే లాక్కు రావడం, విసిరేసిన బంతి పట్టుకురమ్మంటే అది పరిగెత్తే క్రమంలో యజమానిని కింద పడేయడంలాంటివి చేస్తూ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి శిక్షణ ఇస్తున్న వీడియోను ట్రైనింగ్ సభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఒకరకంగా కుక్కకు ట్రైనింగ్ ఇవ్వడానికి వారి తల ప్రాణం తోక్కొచ్చిందనుకోండి. కానీ గమ్మత్తైన విషయమేంటంటే మరో వీడియోలో ఈ రైకర్ అలవోకగా అన్ని పనులు చేస్తూ వావ్ అనిపించుకుంది. తన సాయశక్తులా కష్టపడి ఎట్టకేలకు అన్ని విద్యల్లో ఆరితేరిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కుక్కలకు ట్రైనింగ్ ఏంటి? శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు. -
కుక్క తెలివికి పోలీసులు ఫిదా
కుక్క విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు కొంతమంది. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో ఒక కుక్క స్వయంగా తాను తప్పిపోయానంటూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు దారి తెలియడం లేదని, యజమానికి తనను అప్పగించమని పోలీసులను వేడుకుంది. తన సైగలతో పోలీసులకు ఇదంతా అర్థమయ్యేలా చెప్పింది. ఈ నెల 11న అర్థరాత్రి టెక్సాస్‌లోని ఒడెస్సా పోలీస్ స్టేషన్లోకి జర్మన్ షెపర్డ్(ఓ జాతి కుక్క) పరిగెత్తుకుంటూ వచ్చింది. తన సైగలతో తాను తప్పిపోయిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కుక్క ప్రవర్తనకు ఫిదా అయిన పోలీసులు.. రాత్రంతా దానిని తమ వద్దనే ఉంచుకున్నారు. దానితో సంతోషంగా ఆడుకున్నారు. కుక్క కూడా పోలీసులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా వారితో కలిసిపోయింది. కుక్క తెలివికి ఫిదా అయిన పోలీసులు.. దాని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ’గత రాత్రి యాదృచ్చికంగా మా స్టేషన్లోకి వచ్చిన ఈ తెలివిగల కుక్క.. రాత్రంతా మాతో సరదాగా గడిపింది. మాపై ఎంతో ప్రేమను చూపించింది. అది సురక్షితంగా యాజమాని దగ్గరకు చేరినందుకు సంతోషంగా ఉంది’ అని పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుక్క మెడలో ఎలాంటి గుర్తింపు ట్యాగ్ లేకపోవడంతో దాని యజమానిని గుర్తించడం పోలీసులకు కష్టమైంది. దాని ఫోటోలు వైరల్ కావడంతో యజమాని పోలీసులను సంప్రదించి కుక్కును తీసుకెళ్లారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్క బయటకు పారిపోయిందని, దారి తప్పిపోవడంతో.. అది మైళ్ల దూరంలో ఉన్న పోలీసులు స్టేషన్‌కు వెళ్లిందని యజమాని తెలిపారు. తప్పిపోయానంటూ రక్షణ కోసం తన పెంపుడు కుక్క పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏదేమైనా కుక్క తెలివికి హాట్సాఫ్ చెప్పాల్సిందే. -
అది లేకుండా బతకలేను!
ఇంటర్వ్యూ ‘ప్రేమకథా చిత్రమ్’ చూసిన వాళ్లెవరికీ నందిత గురించి, ఆమె ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి హడలెత్తించిన నందిత... నిజ జీవితంలో మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడుతుంది. క్రమశిక్షణతో మెలుగుతుంది. ఈ క్యూట్ యాక్ట్రెస్ గురించి మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలియాలంటే... తను చెప్పిన ఈ కబుర్లు చదవండి మరి! * తరచుగా కాకుండా అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తున్నారు. అవకాశాలు లేవా? చాలామంది ఈ ప్రశ్న అడిగారు నన్ను. నాకు అవకాశాలకు లోటేమీ లేదు. కాకపోతే సినిమాలతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాను. దాంతో రెండిటికీ సమయం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చి తక్కువ సినిమాలు చేశాను. అంతే తప్ప చాన్సులు లేక కాదు. * అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు? నేను పదో తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నప్పుడు దర్శకుడు తేజ ‘స్టార్ హంట్’ పెట్టారు. నేను సరదాగా నా ఫొటోలు పంపాను. తర్వాత ఆ విషయం మర్చిపోయి నా మానాన నేను కాలేజీలో చేరిపోయాను. కానీ ఆడిషన్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే ‘నీకూ నాకూ డ్యాష్ డ్యాష్’ సినిమాలో చాన్స్ వచ్చింది. * మొదటి సినిమాయే ఫెయిలైంది. బాధ కలిగిందా? అదేం లేదు. నిజానికి ఆ సినిమా పేరు జనాల్లోకి నెగటివ్‌గా వెళ్లింది. అది ఫలితాల మీద చెడు ప్రభావం చూపించిం దనుకుంటా. ఆ తర్వాత పేరు మార్చారు. అయినా నాకు తెలిసి ఆ పేరులో తప్పేమీ లేదు. ఏదైనా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఏదేమైనా నా మొదటి సినిమా ఫెయిల్యూర్ని రెండో సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ మర్చిపోయేలా చేసిందిలెండి. * కెరీర్ ప్రారంభంలో అంత మంచి పాత్ర రావడం అదృష్టం కదా? కచ్చితంగా. మామూలుగా, దెయ్యం పట్టిన అమ్మాయిలా రెండు రకాలుగా టాలెంట్‌ని ప్రదర్శించే చాన్స వచ్చింది. అమ్మానాన్నలతో కలిసి థియేటర్లో ఆ సినిమా చూశాను. ఆడియెన్స రెస్పాన్స చూసి ఎంత సంతోషమేసిందో. * అసలు మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది? నాకు ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టం. బర్ఫీ, ఫ్యాషన్ లాంటి సినిమాల్లో చాలా చాలెంజింగ్ రోల్స్ చేశారు తను. అలాగే అనుష్క కూడా ఉమన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారు. చాలా గొప్ప నటి ఆవిడ. నాకూ అలాంటివి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. * ఏ హీరోతో అయినా చేయాలని ఉందా? మహేశ్‌బాబు. ఆయన నా ఫేవరేట్ హీరో. ఆయనతో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు! * నటి అయ్యాక, అవ్వకముందు... జీవితంలో తేడా ఏంటి? సినిమాల్లోకి రాకముందు నందిత ఓ మామూలు అమ్మాయి. అప్పుడు తను కొందరికే తెలుసు. కానీ ఇప్పుడు చాలామందికి తెలుసు. అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే కాస్త ఎక్కువ బిజీ అయిపోయి ఫ్రెండ్స్ తోను, ఇంట్లో వాళ్లతోను ఎక్కువ టైమ్ గడపలేకపోతున్నాను. * ఎప్పుడైనా తీరిక దొరికితే ఏం చేస్తుంటారు? పుస్తకాలు విపరీతంగా చదువుతాను. అమెరికన్ రచయిత నికొలస్ పార్క్స రచనలంటే చాలా ఇష్టం. * మీలో మీకు నచ్చేది? క్రమశిక్షణ. నాన్న ఆర్మీ అధికారి. దాంతో చిన్నప్పట్నుంచీ ఇంట్లో డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఆ క్రమశిక్షణ నాకు ఎప్పుడూ మంచి పేరే తెచ్చింది. * మీలో మీకు నచ్చనిది? నా ఉంగరాల జుత్తు. దాన్ని మేనేజ్ చేయలేక, అందంగా దువ్వుకోలేక ముప్పుతిప్పలు పడుతుంటా. * మీలో మీరు మార్చుకోవాలనుకునేది? ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చిపోతాను నేను. పిజ్జా అయితే మరీను. అస్సలు కంట్రోల్ చేసుకోలేను. కాకపోతే నటిని కాబట్టి బరువు పెరగకుండా యోగా, వ్యాయామం చేసి మేనేజ్ చేస్తుంటా. * ఇది లేకుండా బతకలేను అనుకునేది? నా జర్మన్ షెపర్డ్ కుక్క. అది నా బెస్ట్ ఫ్రెండ్. అది లేకపోతే నాకేం తోచదు. * మీరు లేకుండా బతకలేనని ఎవరైనా చెప్పారా? (నవ్వుతూ) అదేం లేదులెండి. అయినా నేను కో-ఎడ్యుకేషన్‌లో చదవలేదు. చుట్టూ అందరూ అమ్మాయిలే. కాబట్టి అందుకు అవకాశమే లేదు. * పోనీ ఎలాంటి అబ్బాయి ఐలవ్యూ చెబితే బాగుంటుందనుకుంటారు? నవ్వుతూ ఉండేవాడు. నవ్వించేవాడు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండేవాళ్లే నాకు ఎక్కువ నచ్చుతారు. -
ఈ శునక సంతానం ఇంతింత కాదయా...!
మలికిపురం(తూర్పు గోదావరి) : సంతానంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఓ శునకం. తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలోని యడ్ల రాజేష్ పెంచుకుంటున్న జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం తొలి కాన్పులో 8 పిల్లల్ని కనేసింది. రెండో దఫా 9, మూడోసారి 11 పిల్లలకు జన్మనిచ్చింది. ప్రతీసారి కొత్త సంఖ్యతో రికార్డులు సృష్టించేస్తున్న ఈ శునకం సోమవారం నాలుగో దఫాలో 13 పిల్లలకు జన్మనిచ్చి ఆ ఇంటి యజమానులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. సాధారణంగా ఈ జాతి కుక్కలు ఒకసారికి నాలుగు నుంచి ఆరు పిల్లలను మాత్రమే కంటాయని, కానీ తాను పెంచుతున్న కుక్క ప్రతి ఈతకూ ఇలా పిల్లల సంఖ్యను పెంచుతూ పోవడం ఆశ్చర్యంగా ఉందని రాజేష్ అన్నారు.