అది లేకుండా బతకలేను!
ఇంటర్వ్యూ
‘ప్రేమకథా చిత్రమ్’ చూసిన వాళ్లెవరికీ నందిత గురించి, ఆమె ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి హడలెత్తించిన నందిత... నిజ జీవితంలో మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడుతుంది. క్రమశిక్షణతో మెలుగుతుంది. ఈ క్యూట్ యాక్ట్రెస్ గురించి మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలియాలంటే... తను చెప్పిన ఈ కబుర్లు చదవండి మరి!
* తరచుగా కాకుండా అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తున్నారు. అవకాశాలు లేవా?
చాలామంది ఈ ప్రశ్న అడిగారు నన్ను. నాకు అవకాశాలకు లోటేమీ లేదు. కాకపోతే సినిమాలతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాను. దాంతో రెండిటికీ సమయం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చి తక్కువ సినిమాలు చేశాను. అంతే తప్ప చాన్సులు లేక కాదు.
* అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నేను పదో తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నప్పుడు దర్శకుడు తేజ ‘స్టార్ హంట్’ పెట్టారు. నేను సరదాగా నా ఫొటోలు పంపాను. తర్వాత ఆ విషయం మర్చిపోయి నా మానాన నేను కాలేజీలో చేరిపోయాను. కానీ ఆడిషన్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే ‘నీకూ నాకూ డ్యాష్ డ్యాష్’ సినిమాలో చాన్స్ వచ్చింది.
* మొదటి సినిమాయే ఫెయిలైంది. బాధ కలిగిందా?
అదేం లేదు. నిజానికి ఆ సినిమా పేరు జనాల్లోకి నెగటివ్‌గా వెళ్లింది. అది ఫలితాల మీద చెడు ప్రభావం చూపించిం దనుకుంటా. ఆ తర్వాత పేరు మార్చారు. అయినా నాకు తెలిసి ఆ పేరులో తప్పేమీ లేదు. ఏదైనా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఏదేమైనా నా మొదటి సినిమా ఫెయిల్యూర్‌ని రెండో సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ మర్చిపోయేలా చేసిందిలెండి.
* కెరీర్ ప్రారంభంలో అంత మంచి పాత్ర రావడం అదృష్టం కదా?
కచ్చితంగా. మామూలుగా, దెయ్యం పట్టిన అమ్మాయిలా రెండు రకాలుగా టాలెంట్‌ని ప్రదర్శించే చాన్‌స వచ్చింది. అమ్మానాన్నలతో కలిసి థియేటర్‌లో ఆ సినిమా చూశాను. ఆడియెన్‌స రెస్పాన్‌స చూసి ఎంత సంతోషమేసిందో.
* అసలు మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది?
నాకు ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టం. బర్ఫీ, ఫ్యాషన్ లాంటి సినిమాల్లో చాలా చాలెంజింగ్ రోల్స్ చేశారు తను. అలాగే అనుష్క కూడా ఉమన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారు. చాలా గొప్ప నటి ఆవిడ. నాకూ అలాంటివి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది.
* ఏ హీరోతో అయినా చేయాలని ఉందా?
మహేశ్‌బాబు. ఆయన నా ఫేవరేట్ హీరో. ఆయనతో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు!
* నటి అయ్యాక, అవ్వకముందు... జీవితంలో తేడా ఏంటి?
సినిమాల్లోకి రాకముందు నందిత ఓ మామూలు అమ్మాయి. అప్పుడు తను కొందరికే తెలుసు. కానీ ఇప్పుడు చాలామందికి తెలుసు. అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే కాస్త ఎక్కువ బిజీ అయిపోయి ఫ్రెండ్స్ తోను, ఇంట్లో వాళ్లతోను ఎక్కువ టైమ్ గడపలేకపోతున్నాను.
* ఎప్పుడైనా తీరిక దొరికితే ఏం చేస్తుంటారు?
పుస్తకాలు విపరీతంగా చదువుతాను. అమెరికన్ రచయిత నికొలస్ పార్‌క్స రచనలంటే చాలా ఇష్టం.
* మీలో మీకు నచ్చేది?
క్రమశిక్షణ. నాన్న ఆర్మీ అధికారి. దాంతో చిన్నప్పట్నుంచీ ఇంట్లో డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఆ క్రమశిక్షణ నాకు ఎప్పుడూ మంచి పేరే తెచ్చింది.
* మీలో మీకు నచ్చనిది?
నా ఉంగరాల జుత్తు. దాన్ని మేనేజ్ చేయలేక, అందంగా దువ్వుకోలేక ముప్పుతిప్పలు పడుతుంటా.
* మీలో మీరు మార్చుకోవాలనుకునేది?
ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చిపోతాను నేను. పిజ్జా అయితే మరీను. అస్సలు కంట్రోల్ చేసుకోలేను. కాకపోతే నటిని కాబట్టి బరువు పెరగకుండా యోగా, వ్యాయామం చేసి మేనేజ్ చేస్తుంటా.
* ఇది లేకుండా బతకలేను అనుకునేది?
నా జర్మన్ షెపర్డ్ కుక్క. అది నా బెస్ట్ ఫ్రెండ్. అది లేకపోతే నాకేం తోచదు.
* మీరు లేకుండా బతకలేనని ఎవరైనా చెప్పారా?
(నవ్వుతూ) అదేం లేదులెండి. అయినా నేను కో-ఎడ్యుకేషన్‌లో చదవలేదు. చుట్టూ అందరూ అమ్మాయిలే. కాబట్టి అందుకు అవకాశమే లేదు.
* పోనీ ఎలాంటి అబ్బాయి ఐలవ్యూ చెబితే బాగుంటుందనుకుంటారు?
నవ్వుతూ ఉండేవాడు. నవ్వించేవాడు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండేవాళ్లే నాకు ఎక్కువ నచ్చుతారు.