అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌కు కొత్త అతిథి వచ్చారు. అదేంటి అధ్యక్ష నివాసమన్నాక నిత్యం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా అంటారా! అలా కాదు ఈ గెస్ట్ వెరీ స్పెషల్. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో చూద్దామా!
గెస్ట్ పేరు కమాండర్. అధ్యక్షుల వారి పెంపుడు శునకం. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌కు 79వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జేమ్స్ బైడెన్ బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 1న పుట్టిన ఈ శునకం ఇటీవల శ్వేతసౌధంలో అడుగిడింది. బైడెన్ వచ్చాక వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మూడో శునకం ఇది. ఇంతకుముందు బైడెన్ దంపతులు ఎంతో మురిపెంగా పెంచుకున్న చాంప్ (జర్మన్ షెపర్డ్) గత జూన్‌లో చనిపోయింది.
దీంతో బైడెన్ దంపతులు చాలా బాధపడ్డారు. దీంతో ఆయన సోదరుడు కమాండర్‌ను ఇచ్చారు. ఇదిగాకుండా బైడెన్‌కు మేజర్ అనే మరో శునకం కూడా ఉండేది. దీనికి కోపం చాలా ఎక్కువట. అది వైట్‌హౌస్ సిబ్బందిని, అధికారులను బాగా ఇబ్బంది పెట్టేదట. గత మార్చిలో ఇద్దరిని కరిచేసింది కూడా. దీంతో మేజర్‌ను బైడెన్ తన సొంతూరు అయిన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌కు పంపారని ప్రెస్ సెక్రెటరీ మైకేల్ లారోసా చెప్పారు.
కొత్త వాళ్ల మధ్యకాకుండా తెలిసిన వాళ్ల మధ్య ఉంచితేనే అది బాగా ఉంటుందని డాగ్ ట్రైనర్స్ చెప్పడంతో మేజర్‌ను డెలావేర్‌లోనే ఉంచారు. ఇది ఇష్టమొచ్చినట్టు కరవకుండా వైట్‌హౌస్‌లో బుద్ధిగా మసలేందుకు ‘సుదీర్ఘ శిక్షణ’ సైతం ఇప్పించారు. అప్పటినుంచి దాని కోపం కొంచెం మేరకు తగ్గిందని లారోసా చెప్పారు. సెలవుదినాల్లో బైడెన్ విల్మింగ్టన్‌లో గడుపుతారు. కమాండర్ రాకను బైడెన్ ఎంతగానో ఆస్వాదించారు.
‘కమాండర్.. వైట్‌హౌస్‌కు స్వాగతం’ అని దాని ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. నిత్యం ఒత్తిడితో తలమునకలయ్యే అధ్యక్షుడు ఈ కమాండర్‌తో కాసేపు సరదాగా ఆడుకుంటున్నారు. వైట్‌హౌస్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న పెంపుడు జంతువుల సంప్రదాయాన్ని గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేయగా.. చాంప్, మేజర్‌లను తెచ్చి బైడెన్ దాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కాగా అతి త్వరలో ఒక పిల్లి కూడా వైట్‌హౌస్‌లోకి రానుంది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment