గ్రామసభల ద్వారా ప్రజల మెప్పు పొందండి | Get approval by such people | Sakshi
Sakshi News home page

గ్రామసభల ద్వారా ప్రజల మెప్పు పొందండి

Published Mon, Jan 6 2014 5:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

Get approval by such people

కోట, న్యూస్‌లైన్ : గ్రామసభల నిర్వహణలో రాజకీయాలు తావులేకుండా ప్రజాసమస్యలను పరిష్కరించి వారి మెప్పు పొందాలని కలెక్టర్ శ్రీకాంత్ అధికారులకు సూచించారు. మండలంలోని చిట్టేడులో ఆదివారం నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. సర్పంచ్ రాము అధ్యక్షతన జరిగిన సభలో మొత్తం 29 అంశాలపై చర్చించారు. విద్య, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, ఉపాధిహామీ పనులు, అంతర్గత రోడ్లు, బ్యాంక్ రుణాలు, వ్యవసాయం, వైద్యసేవలు, పక్కా ఇళ్ల నిర్మాణం తదితర సమస్యలపై అధికారుల సమక్షంలో ప్రజలు చేతులెత్తి అంగీకారం తెలిపి తీర్మానాలు చేశారు.
 
 చిట్టేడు పంచాయతీ పరిధిలో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, దానిని భూమిలేని నిరుపేదలకు పంచాలని కలెక్టర్ సమక్షంలో తీర్మానించారు. చిట్టేడు సమీపంలోని ఉన్న జీవీఆర్ రొయ్యల కర్మాగారం నుంచి కాలుష్యం వస్తుండటంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. శ్మశానానికి దారి చూపాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఇక్కడ తీర్మానించిన ప్రతి అంశాన్ని మినిట్స్ బుక్‌లో నమోదు చేస్తామన్నారు. ఓటింగ్ ద్వారా మెజారిటీ ప్రజలు అమోదించిన తీర్మానాలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్‌డీఓ మధుసూదన్‌రావు, ఎంపీడీఓ వెంకటనారాయణ, తహశీల్దార్ చెన్నయ్య, అన్ని శాఖల మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.
 
 అక్కడ వెలవెల
 మండలంలో ఆదివారం చిట్టేడు, ఊనుగుంటపాలెం,తిమ్మనాయుడుపాలెం గ్రామాల్లో గ్రామసభలు జరిగాయి. చిట్టేడు గ్రామసభకు కలెక్టర్ హాజరవడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మిగతా చోట్ల గ్రామసభలు వెలవెలబోయాయి. తిమ్మనాయుడుపాలెం గ్రామసభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా  అధికారులు రాకపోవడంతో 4 గంటలకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన స్థానికులు వెనుదిరిగారు. కార్యదర్శి రేణుకమ్మ తీరుపై ప్రజలు విమర్శలు గుప్పించారు. చివరకు ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో మొక్కుబడిగా గ్రామసభను నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement