అన్ని పోలీస్‌స్టేషన్లలో బాబుపై ఫిర్యాదు చేయండి
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి పిలుపు
తిరుపతి మంగళం: అధికారం కోసం అబద్దాలు, మోసపూరిత వాగ్దానాలు చేసిన చంద్రబాబుపై జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు బుధవారం క్రిమినల్ కేసులు పెట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం రైతు రుణాల మాఫీ.. డ్వాక్రా పొదుపు సంఘాల మహిళల రుణాల రద్దు.. ఇంటికో ఉద్యోగం.. రూ.2వేలు నిరుద్యోగ భృతి, రైతులకు 9గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా.. మహాలక్ష్మి పథకం కింద పుట్టిన ప్రతి శిశువు పేరిట రూ.30వేలు డిపాజిట్.. ఇలా నోటికొచ్చిన హామీలు ఇచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చి నేటికి రెండేళ్లవుతున్నా ఆయన ఏ ఒక్క హామీనీ నేరవేర్చిన పాపానపోలేదని మండిపడ్డారు. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే దురాలోచనతో ప్రజలను నమ్మించి నట్టేట ముంచారన్నారు. జననాన్ని మోసం చేసి అధికారొలోకి వచ్చిన చంద్రబాబు క్రిమినల్ కన్నా పెద్ద మోసగాడని ధ్వజమెత్తారు. ఈ ఘరానా మోసగాడిపై మండల కేంద్రాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టాలని పార్టీ నాయకులకు సూచించారు.