ఆస్తి కోసం ఘాతుకం
నెల్లూరుసిటీ : ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చేందుకు ఓ కసాయి కూతురు హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం నగరంలోని నవాబుపేట ఎఫ్‌సీఐ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎఫ్‌సీఐ కాలనీలోని షాదీమంజిల్ సమీపంలో రావిళ్ల సుబ్బమ్మ (75) నివసిస్తుంది.
భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి జయమ్మ, బుజ్జమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. చిన్న కుమార్తె బుజ్జమ్మ ఆర్థికంగా స్థిరపడింది. పెద్ద కుమార్తె జయమ్మ భర్త 7 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు.
వీళ్లందరూ 6 పోర్షన్లు ఉన్న ఇంట్లో ఉంటున్నారు. జయమ్మ తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు తల్లి భాగం పోర్షన్ కూడా రాసివ్వాలని పలుమార్లు డిమాండ్ చేసేది. దీంతో తల్లి, కూతురు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా వీరి మధ్య గొడవ తారా స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయం చూసి తల్లి సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్లిన జయమ్మ రోకలి బండతో తల్లి తలపై కొట్టింది.
దీంతో సుబ్బమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఉదయం 6.30 గంటల సమయంలో స్థానికుడైన ఓ వ్యక్తి గుడికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు ముందుకు వేసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూశాడు. సుబ్బమ్మ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి చిన్న కూతురు బుజ్జమ్మకు సమాచారం అందించాడు.
దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో 108లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే మృతురాలి చెవి కమ్మలు సైతం మాయమయ్యాయి. నిందితురాలే చెవి బంగారు కమ్మలు దొంగిలించి ఉంటుందని తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్‌చార్జ్ సీఐగా వ్యవహరిస్తున్న మంగారావు కేసు దర్యాప్త చేస్తున్నారు. ఘాతుకానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.