kannatalli
-
మిమ్స్ ‘కన్నతల్లి’ పథకం భేష్
నెల్లిమర్ల: మిమ్స్ ఆసుపత్రిలో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం నిరుపేద మహిళలకు వరమని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సీవీరావు అన్నారు. నెల్లిమర్ల పట్టణంలోనున్న మిమ్స్ వైద్య కళాశాలతో పాటు ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో అమలుచేస్తున్న పథకాలు, వైద్యసేవలు గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద గర్భిణులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలనే ఉన్నత ఆశయంతో అమలుచేస్తున్న కన్నతల్లి పథకం తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పించడం యాజమాన్యం ఉదారతకు నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా కన్నతల్లి పథకంద్వారా చిన్నారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ అల్లూరి సత్యనారాయణరాజు, డీన్ టీఏవీ నారాయణరాజు, ప్రిన్సిపాల్ లక్ష్మీకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
అన్నం పెట్టలేదని.. తల్లిని చంపిన తనయుడు
ఎల్కతుర్తి : అగిడిన వెంటనే అన్నం పెట్టలేదనే కారణంగా ఓ కొడుకు కన్నతల్లిని రోకలిబండతో మోది ప్రాణం తీశాడు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన అల్లి సుగుణమ్మ(50)-సమ్మయ్యలకు నలుగురు కుమారులు. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం ఎల్కతుర్తిలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇతని పెద్ద కుమారుడు అల్లి భాస్కర్ కొంత మతిస్థిమితం లేని వానిలా ప్రవర్తిస్తుంటాడు. నిత్యం ఉదయం పొలానికి వెళ్లి పనులు ముగించుకుని రాత్రికి ఇంటికి వస్తుండేవాడు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లేందుకు తల్లి సుగుణమ్మను అన్నం పెట్టమన్నాడు. పనిలో ఉన్న ఆమె కొద్దిగా ఆగాలని కొడుకుకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన భాస్కర్ పక్కనే ఉన్న రోకలిబండ తీసుకుని తల్లిని మోదాడు. ఆమె కిందపడి తీవ్ర రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుండగా ఇరుగుపొరుగు వారు గమనించి వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే సుగుణమ్మ మృతిచెందింది. సంఘటన స్థలాన్ని హుజూరాబాద్ రూరల్ సీఐ భీంశర్మ, ఎస్సై ఎం.రవి పరిశీలించారు. భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తండ్రిపై గొడ్డలితో దాడి భాస్కర్ 2010లో తండ్రి సమ్మయ్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఆయన తృటిలో తప్పించుకోగా చెయ్యి వేలు తెగింది. పోలీసులు కేసు నమోదు చేయగా రెండేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. జైల్లో ఉన్న సమయంలో అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో వైద్యం చేయించారు. ప్రవర్తనలో కొంత మార్పు రాగానే బెయిల్‌పై విడుదల చేశారు. -
ఆస్తి కోసం ఘాతుకం
నెల్లూరుసిటీ : ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చేందుకు ఓ కసాయి కూతురు హత్యాయత్నం చేసింది. ఈ దారుణ ఘటనలో గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం నగరంలోని నవాబుపేట ఎఫ్‌సీఐ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎఫ్‌సీఐ కాలనీలోని షాదీమంజిల్ సమీపంలో రావిళ్ల సుబ్బమ్మ (75) నివసిస్తుంది. భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. వీరికి జయమ్మ, బుజ్జమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. చిన్న కుమార్తె బుజ్జమ్మ ఆర్థికంగా స్థిరపడింది. పెద్ద కుమార్తె జయమ్మ భర్త 7 ఏళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లందరూ 6 పోర్షన్లు ఉన్న ఇంట్లో ఉంటున్నారు. జయమ్మ తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు తల్లి భాగం పోర్షన్ కూడా రాసివ్వాలని పలుమార్లు డిమాండ్ చేసేది. దీంతో తల్లి, కూతురు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆదివారం కూడా వీరి మధ్య గొడవ తారా స్థాయిలో జరిగింది. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున ఎవరూ లేని సమయం చూసి తల్లి సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్లిన జయమ్మ రోకలి బండతో తల్లి తలపై కొట్టింది. దీంతో సుబ్బమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఉదయం 6.30 గంటల సమయంలో స్థానికుడైన ఓ వ్యక్తి గుడికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ సమయంలో ఇంటి తలుపులు ముందుకు వేసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూశాడు. సుబ్బమ్మ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి చిన్న కూతురు బుజ్జమ్మకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన స్థానికుల సహాయంతో 108లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే మృతురాలి చెవి కమ్మలు సైతం మాయమయ్యాయి. నిందితురాలే చెవి బంగారు కమ్మలు దొంగిలించి ఉంటుందని తెలుస్తుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్చార్జ్ సీఐగా వ్యవహరిస్తున్న మంగారావు కేసు దర్యాప్త చేస్తున్నారు. ఘాతుకానికి పాల్పడిన మహిళను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.