
'అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసు ఇస్తా'
ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసీసీ రమణ దాడి చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
విశాఖపట్నం: ఎస్టీ శాసన సభ్యురాలైన తనపై ఏసీపీ రమణ దాడి చేయడం అమానుషమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తనపై ఏసీపీ రమణ దాడి చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన ఘటనపై గవర్నర్, స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ సంఘటనపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హక్కుల నోటీసులు ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే కాకీ చొక్కాలు వదిలి పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేయాలంటూ విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పోలీసులకు సూచించారు. మహిళ కార్యకర్తలపై దాడి విషయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని గుడివాడ అమర్నాధ్ హెచ్చరించారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ సీపీ ధర్నాపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కలెక్టరేట్లోకి వెళ్లారు. అయితే అక్కడ ఉన్నతాధికారులు లేకపోవడంతో వినతి పత్రాన్ని ఆమె గోడకు అంటించారు. ఆ క్రమంలో ఏసీపీ రమణ దౌర్జన్యానికి దిగారు. ఇకపై ధర్నాలు ఎలా చేస్తారో చూస్తానంటూ ఎమ్మెల్యే, పార్టీ నేతలను ఏసీపీ రమణ హెచ్చరించారు. అనంతరం గోడకు అంటించిన వినతి పత్రాన్ని ఏసీపీ రమణ చింపేశారు. ఏసీపీ వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు.