అందమైన లోకం.. పుట్టుకే శోకం | Girl Child Deaths in Kurnool | Sakshi
Sakshi News home page

అందమైన లోకం.. పుట్టుకే శోకం

Published Mon, Feb 18 2019 1:26 PM | Last Updated on Mon, Feb 18 2019 1:26 PM

Girl Child Deaths in Kurnool - Sakshi

మృతి చెందిన బిడ్డతో తల్లిదండ్రులు మోదిన్‌బీ, మహబూబ్‌ బాషా

మాతా శిశు సంరక్షణ అంటూ ప్రభుత్వాలు గొప్పగా ప్రచారం చేస్తుంటే అమ్మ కడుపులో ఉన్న శిశువులు ఎంతో సంతోషించారు. తమ ఆరోగ్యం కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా.. అంటూ ఆశ్చర్యపోయారు. అందమైన లోకాన్ని చూసేందుకు తొమ్మిది నెలలు ఎప్పుడు పూర్తవుతాయా అని వేయి కళ్లతో నిరీక్షించారు.  అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఒకరు లోకాన్ని చూడకనే అమ్మ గర్భంలోనే కన్నుమూయగా.. మరో చోట పుట్టిన శిశువు అనారోగ్యంతో ఆసుపత్రికి చేరినా బతకలేక పోయింది. బిల్లు కడితేనే మృత శిశువును అందిస్తాన్న ఆసుపత్రి సిబ్బంది నిర్వాకాన్ని చూసి ఇదేం లోకం.. పుట్టుకే శోకం అంటూ ఆ శిశువు ఆత్మ ఘోషించింది. ఆదివారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనలు  అటు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఇటు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని తేటతెల్లం చేశాయి.

కర్నూలు, బొమ్మలసత్రం: వైద్యం.. వ్యాపారంగా మారిన నేపథ్యంలో కొందరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నారు. ఆదివారం నంద్యాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన ఖాజా హుస్సేన్‌ తన భార్య హుసేన్‌బీని ప్రసవం నిమిత్తం గత నెల 28న పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. మరుసటి రోజు ఉదయం ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో ఉమ్ము నీరు తాగిన శిశువు అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్న లిటిల్‌ స్టార్‌ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు పాప ఆరోగ్యం బాగా లేదని ఇక్కడే వారం రోజులు చికిత్స అందించాలని చెప్పారు. ఈనెల 6వ తేదీ వరకు చికిత్స అందించి దాదాపు రూ.1.55 లక్షలు బిల్లు కావడంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పు తీసుకొచ్చి వైద్యునికి చెల్లించారు.  అదే రోజు శిశువును ఐసీయూ గది నుంచి సాధారణ వార్డుకు మార్చారు. అయితే ఆయాసంతో బాధపడుతుండటంతో మళ్లీ పరీక్షలు చేశారు.

కిడ్నీకి ఇన్ఫెక్షన్‌ సోకిందని, రక్తంలో ప్లేట్‌లేట్స్‌ తక్కువగా ఉన్నాయని, వీటన్నింటికీ చికిత్స అందించాలంటే భారీగా ఖర్చువుతుందని చెప్పారు. తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోవటంతో తిరిగి చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలోనే మందులు, అడ్వాన్స్‌ అంటూ డబ్బులు భారీగా వసూలు చేశారు. అయితే శనివారం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బతకడం కష్టమని.. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. ఇప్పటికే   చాలా ఖర్చు పెట్టామని, ఎలాగైనా బతికించాలని  శిశువు తల్లిదండ్రులు వేడుకున్నా రు. 20 రోజులకే రూ. 3 లక్షల బిల్లు కాగా రూ. 2.70 లక్షలు చెల్లించారు. అయితే శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో శిశువు మృతి చెందిందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. అయితే మిగతా రూ.30 వేలు కట్టి మృత శిశువును తీసుకెళ్లాలని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదనకు గురయ్యారు.

ఆదివారం తెల్లవారుజాము నుంచి తమ బిడ్డ చివరి చూపు చూసేందుకు అనుమతించాలని కోరినా ఒప్పుకోలేదు. అప్పటికే లక్షలు ఖర్చు చేసినా వారికి పాప దక్కక పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించినా ఆసుపత్రి యాజమాన్యం చలించలేదు. సమాచారం తెలుసుకున్న ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్టీ, ఆర్‌వైయూ తదితర ప్రజా సంఘాలు నాయకులు రాజు నాయుడు, ధనుంజేయుడు, రఫి తదితరులు ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగ ప్రవేçశం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు తెలుసుకొని సంబంధిత ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ ఆనంద్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం చిన్నారి మృత దేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో ఆందోళన విరమించారు.   పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత పుట్టిన పాపను ఎలాగైనా బతికించుకోవాలనే తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసుపత్రి యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసేందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆదోని టౌన్‌: ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళకు కడుపుకోత మిగిలింది. ఆదోని మండలం పెద్ద పెండేకల్‌ గ్రామానికి చెందిన మహబూబ్‌ బాషా, ఎస్‌.మోయిద్దీన్‌బీ దంపతులకు ముగ్గురు కుమారులు. కుమార్తె కోసం నాలుగో కాన్పునకు మోయిద్దీన్‌బీని శనివారం సాయంత్రం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవీలతకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న ఆమె ఆస్పత్రికి వచ్చి గర్భిణినిని పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని తేల్చి చెప్పారు. మృత శిశువును బయటకు తీసేందుకు మోహిద్దీన్‌బీని వార్డులో అడ్మిట్‌ చేశారు. అర్ధరాత్రి సమయం కావస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు నొప్పితో ఆమె తీవ్రంగా బాధపడుతున్నా అటు వైపు సిబ్బంది కూడా రాలేదు. నొప్పిని భరించలేక వార్డు నుంచి ఆసుపత్రి గేట్‌ వద్దకు రాగానే కింద పడిపోయింది. ఆ సమయంలోనే కడుపులో ఉన్న మృత ఆడ శిశువు బయటపడింది. కాన్పు తర్వాత అస్వస్థతకు గురైన ఆమెకు చికిత్స అందించారు. సకాలంలో వైద్యం చేసి ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదని బాధితురాలు రోదించింది. కుమార్తె కావాలన్న ఆమె కల కరిగిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement