ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి చెత్తకుప్ప సంచిలో ఉన్న పాప పాపను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తులు
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: ఆడపిల్ల అనే వివక్షో.. లేక అనారోగ్యం కారణమో తెలియదు కానీ.. మూడు రోజుల పసికందును చెత్తకుప్పలో పడేశారు. చలికి గజగజ వణుకుతూ ఏడుస్తున్న ఆ పసికందును చెత్త ఏరుకునే వ్యక్తి గుర్తించగా స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించిన ఘటన గురువారం ఉదయం పాలకొల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో చెత్త కాగితాలు ఏరుకునే వ్యక్తి కాగితాలు ఏరుకోవడానికి తన రిక్షాలో బయలుదేరాడు. పట్టణంలోని ఉండి అప్పారావు ఆసుపత్రి వద్ద కాగితాలు ఏరుకుంటుండగా పాప ఏడుపు వినిపించింది.
అక్కడ ఉన్న చెత్త కుండీ వద్దకు వెళ్లి చూడగా పాప ఉండడం గమనించాడు. చలికి గజగజ వణుకుతున్న ఆ పాపను తన రిక్షాలో పెట్టుకుని స్థానిక యడ్లబజారు సెంటర్‌కు తీసుకువచ్చాడు. ఎవరికైనా తెలిస్తే తనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో పాపను అలానే తన రిక్షాలో పెట్టుకుని ఉండగా రిక్షా కార్మికుని యజమాని ఇదేమిటని ప్రశ్నించాడు. ఆ యజమానికి రిక్షా కార్మికుడు వివరాలు తెలిపాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో విషయం తెలుసుకున్న స్థానికులు పాపను చూడడానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. వారిలో నక్కాదాసు, కె.రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు పాపను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి అప్పగించారు.
వైద్యులు వెంటనే పాపకు చికిత్స చేసి స్నానం చేయించి పాలు పట్టించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ బి.కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది పాపను కాకినాడకు తరలించారు. పోలీసులు పాప ఘటనపై విచారిస్తున్నారు.
మెరుగైన చికిత్స కోసం..
పాప జన్మించి సుమారు మూడు రోజులు కావస్తుంది. పాపకు చెవి లేదు, ఒక కన్ను పూర్తిగా తెరవడంలేదు. ఇంకా అవయవలోపాలు ఉండే అవకాశం ఉంది. ఈ లోపాలకి జన్యులోపాలే కారణం. పాపకు ఇక్కడ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించాం.– సంతోష్‌కుమార్, ఎండీ, (చిన్నపిల్లల వైద్యుడు), పాలకొల్లు ప్రభుత్వాసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment