‘‘నాన్న సచ్చిపోయినాడు. అమ్మకు పిచ్చిలేసింది. పోలీసోళ్లు ఆసుపత్రిలో చేర్పించినారు. నాల్గో తరగతి సదువుతుంటి. నల్గురు సెల్లెల్లను సూస్కోనీక బడి మానేసిన. కవిత(6), రేణుక(4), వెంకటేశ్వరమ్మ(2)కు అమ్మా నాయిన గొత్తుకొచ్చి ఏడుస్తరు. సిన్న సెల్లెలు సుజాతరాణికి ఏడు నెలలు. పాలు, బిస్కట్లు నేనే తినిపించాల. రేత్రికి సిన్నాయిన ఇంట్ల పండుకుంటం.’’
- ఇదీ కోడుమూరు
నియోజకవర్గంలోని ప్యాలకుర్తికి చెందిన
తొమ్మిదేళ్ల లక్ష్మి దీనగాథ
గ్రామానికి చెందిన చిట్టెమ్మకు మతిభ్రమించింది. తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో నెల రోజుల క్రితం భర్త సంజన్నను కొడవలితో కడతేర్చింది. పోలీసులు అరెస్టు చేసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. పెద్ద కూతురైన తొమ్మిదేళ్ల లక్ష్మి మిగిలిన వారందరికీ పెద్దదిక్కుగా మారింది.
ఆడిపాడే వయస్సులో చెల్లెళ్లను అన్నీ తానై చూసుకుంటోంది. గుక్కపట్టి ఏడ్చే ఏడు నెలల చిన్నారిని ఓదార్చేందుకు ఈ బాలిక పడే అవస్థలు చూస్తే ఎలాంటి హృదయమైనా ద్రవించక మానదు. తనకూ చదువుకోవాలనే ఆశ ఉన్నా.. చెల్లెళ్ల ఆలనాపాలన చూసుకోవడం, వారిని బడికి పంపేందుకు చంపేసుకుంది. అన్నెంపున్నెం ఎరుగని వయస్సులో తోబుట్టువుల భారం భుజానికెత్తుకున్న ఈ చిట్టితల్లి గాథ కొందరినైనా కదిలిస్తే.. ఆ తెగిన గాలిపటాలకు ఓ ఆ‘ధారం’ దొరికినట్లే.
- న్యూస్‌లైన్, కోడుమూరు
చిట్టితల్లి
Published Wed, Feb 5 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement