ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలి మౌనదీక్ష
Published Mon, Dec 30 2013 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
ఉనకరమిల్లి (నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్: ప్రేమించానని చెప్పి రహస్య వివాహం చేసుకున్న అనంతరం ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు మౌనదీక్ష చేపట్టిన ఉదంతమిది. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన లంక దీపిక నిడదవోలు మండలం ఉనకరమిల్లిలోని ప్రియుడి ఇంటి వద్ద బైఠాయించి మౌనదీక్ష చేస్తోంది. ఆమె విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నానికి చెందిన దీపిక తండ్రి లంక రమణ చనిపోగా తల్లి లక్ష్మి వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఉనకరమిల్లికి చెందిన తమ్మిర్చి రాంబాబు నర్సీపట్నంలో ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న అన్నకు చేదోడువాదోడుగా ఉండేందుకు వచ్చి వెళుతుండేవాడు.
దీపిక నివసించే ప్రాంతంలోనే రాంబాబు అన్నయ్య గృహం ఉండడంతో ఐదేళ్ల కిందట ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలం అనంతరం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమని రాంబాబును కోరగా ఇంటిలో నచ్చజెప్పి చేసుకుంటానని చెబుతూ వచ్చాడని బాధితురాలు చెప్పింది. నర్సింగ్ చదివిన తనకు కొన్నాళ్ల క్రితం ఆరోగ్యమిత్రగా ఉద్యోగం వచ్చిందని, నవంబర్ 13న సింహాచలంలో రాంబాబు రహస్యంగా తనను వివాహం చేసుకుని నర్సీపట్నంలో వేరే కాపురం పెట్టాడని దీపిక తెలిపింది. రాంబాబుతో వివాహమైన కొద్దిరోజులకు అతడికి అప్పటికే పెళ్లై ఒక బాబు కూడా ఉన్నట్టు తెలిసిందని, దీంతో మోసపోయానని గ్రహించి నిలదీశానని చెప్పింది.
తమ వివాహ ఫొటోలు తీసుకుని రాంబాబు సొంత ఊరికి వచ్చేశాడని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానని, తన తల్లి సకాలంలో ఆసుపత్రిలో చేర్చడంతో బతికినట్టు బాధితురాలు తెలిపింది. తన తల్లి ఉనకరమిల్లి రాగా రాంబాబు కుటుంబ సభ్యులు దుర్భాషలాడి పంపించేశారని దీపిక చెప్పింది. శనివారం మధ్యాహ్నం ఉనకరమిల్లిలోని రాంబాబు ఇంటికి వచ్చానని, అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి ఉందని, రాంబాబు, అతడి కుటుంబ సభ్యులు వచ్చి తనకు న్యాయం చేసే వరకూ ఇక్కడే ఉంటానంటూ ఇంటి వద్ద బైఠాయించి మౌనదీక్ష చేపట్టింది. అయితే ఈ విషయం ఆదివారం ఉదయం వరకు స్థానికులకు తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు సమిశ్రగూడెం పోలీసులు రాంబాబు ఇంటికి వచ్చి దీపకను స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement