ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన
- పెళ్లి చేసుకుంటానని చెప్పి పరారీ
- కేసు నమోదు చేసిన పోలీసులు
కురుపాం : నాలుగేళ్లగా ప్రేమించుకున్నారు. రెండేళ్లపాటు సహజీవనం కూడా చేశారు. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు పత్తా లేకుండా పరారయ్యాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందే నిరసన చేపట్టింది. పోలీసుల కథనం ప్రకారం పి.లేవిడి గ్రామానికి చెందిన పెద్దింటి లిజి (22), గుమ్మ గ్రామానికి చెందిన నిమ్మక చంద్రకాంత్ (23) నాలుగేళ్లగా ప్రేమిం చుకున్నారు. పార్వతీపురంలో వీళ్లిద్దరూ రెండేళ్ల పాటు సహ జీవనం కూడా చేశారు. డీఎస్సీ పరీక్షల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన చంద్రకాంత్ మే నెలలో డీఎస్సీ పరీక్షకు వెళ్తున్నట్టు చెప్పి పరారైయ్యాడు. లిజి పలుమార్లు ఆయన జాడ కోసం తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో నిమ్మక చంద్రకాంత్ స్వగ్రామం గుమ్మకు వెళ్లింది. ఆచూకీ తెలిపాలని అతని తల్లిదండ్రులు ప్రసాద్, శాంతిలను వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇంటిముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న ఎల్విన్ పేట సీఐ జి.వేణుగోపాల్ రెండు గ్రామాల పెద్దలను, నిరసన చేపట్టిన యువతిని పిలిపించి ఎల్విన్‌పేట ఎస్‌ఐ డి.సుధాకర్, నీలకంఠాపురం ఎస్‌ఐ ఫక్రుద్ధీన్‌లతో కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి ప్రియుడే కావాలని పెద్దింటి లిజి ఫిర్యాదు మేరకు నీలకంఠాపురం ఎస్‌ఐ షేక్ ఫక్రుద్రీన్ కేసు నమోదు చేశారు.