ప్రియుడితో పెళ్లి చేయాలని ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
► ఉదయం కుందుర్పి పోలీసుస్టేషన్ వద్ద
► కిరోసిన్ డబ్బాతో నిరసన
► సీఐ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని
► ఆత్మహత్యాయత్నం
కళ్యాణదుర్గం: ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేయాలంటూ ప్రియురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కళ్యాణదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. కుందుర్పి మండలం బెస్తరపల్లికి చెందిన సుమలత అదే గ్రామానికి చెందిన బంధువు దేవరాజ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల క్రితం ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో ప్రియుడు దేవరాజు ఆమెకు దూరమయ్యాడు. పెళ్లి జరగకుండా దేవరాజ్ కుటుంబసభ్యులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బాధిత యువతి సుమలత ఫిబ్రవరి 2న కుందుర్పి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తూ, తనతో ఎలాంటి సంబంధాలు లేవని తప్పించుకునే యత్నం చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దేవరాజ్ తండ్రి వెంకటరమణప్ప, తల్లి పుట్టమ్మ, పుట్టమ్మ చెల్లెలు అనితమ్మ పెళ్లి జరగకుండా చేస్తున్నారని గురువారం బాధితురాలు తన తల్లి గంగరత్నమ్మతో కలిసి మరోసారి కుందుర్పి పోలీసులను ఆశ్రయించారు. కిరోసిన్ డబ్బా వెంట పెట్టుకుని దేవరాజ్‌తో పెళ్లి జరగకుంటే చనిపోతానంటూ హెచ్చరించింది. ఎస్‌హెచ్‌ఓ ఓబుళపతి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ 417, 420, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో సంతృప్తి చెందని సుమలత, తల్లి గంగరత్నమ్మతో కలిసి కళ్యాణదుర్గం సర్కిల్ ఇన్స్‌పెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రియుడితో పెళ్లి చేయాలని, లేదంటే చనిపోతానని ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
అక్కడున్న వారు కిరోసిన్ డబ్బా లాక్కుని వారించారు. డీఎస్పీ అనిల్, సీఐ మన్సూరుద్దీన్, టౌన్ ఎస్‌ఐ శంకర్‌రెడ్డిలు సుమలత తీరుపై మండిపడ్డారు. పోలీసులను బ్లాక్‌మెయిల్ చేసేలా ప్రయత్నించడం మంచిది కాదని వారించారు. న్యాయం కోసం ప్రయత్నించాలి తప్ప ఇలాంటి సంఘటనలకు పాల్పడటం మంచిది కాదని మందలించారు.
అనంతరం సుమలత, దేవరాజుల ప్రేమ వ్యవహారంపై విడివిడిగా విచారించారు. సుమలతకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని తాము అన్యాయం చేసిన వారిపై కేసు నమోదు చేయడం బాధ్యతగా తీసుకుంటామని, ఇరువురీ అంగీకారం లేనిది పెళ్లి చేసే అధికారం పోలీసులకు లేదని డీఎస్పీ తెలిపారు. అక్కడే ఉన్న కుందుర్పి జెడ్పీటీసీ మల్లికార్జునతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డీఎస్పీ సూచించారు.