
అనుమానం పెనుభూతం
ప్రియురాలిపై కొడవలితో దాడి
పరారీలో నిందితుడు
కలకడ: అనుమానం పెనుభూతమైంది. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ మహిళపై ప్రియుడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్‌ఆర్ జిల్లా సంబేపల్లె మండలం నగిరి గ్రామానికి చెందిన బత్తల రెడ్డెమ్మ(40) తన ప్రియుడు రెడ్డిశేఖర్(రంగ)తో కలిసి కలకడ మండలం కె.బాటవారిపల్లెలో మూడు నెలలుగా నివాసం ఉంటోంది. మరొకరితో రెడ్డెమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం వచ్చిన రెడ్డిశేఖర్ పథకం ప్రకారం హతమార్చడానికి నిర్ణయించుకున్నాడు. మంగళవారం ఉదయం వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమె మెడపై నరకడానికి ప్రయత్నం చేశాడు.
అతనితో పోరాడిన ఆమె తప్పించుకున్నప్పటికీ ఎడమ భుజంపై తీవ్ర గాయమైంది. తిరిగి తలపై నరకడంతో అపస్మారక స్థితిలో పడిపోయింది. మరణించిందని భావించి రెడ్డి శేఖర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ రెడ్డెమ్మను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కలకడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.