నిధులు ఇవ్వండి | Give funds | Sakshi
Sakshi News home page

నిధులు ఇవ్వండి

Published Sun, Aug 2 2015 1:41 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM

Give funds

- పైపులైన్‌కు రూ.23కోట్లు
- రోడ్ల విస్తరణకు రూ.8కోట్లు
- కలెక్టర్‌కు లేఖ రాసిన కమిషనర్
- దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ నేపథ్యంలో విజ్ఞప్తి
విజయవాడ సెంట్రల్ :
దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ పనులకు సర్కార్ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో పైపులైన్, రోడ్ల విస్తరణ పనులపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించారు. వారం రోజుల కిందట క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ నివేదికలు రూపొందించాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పైపులైన్ నిర్మాణానికి రూ.23 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.8 కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఫ్లైఓవర్ బడ్జెట్ నుంచి ఈ నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ కలెక్టర్ బాబు.ఏకు కమిషనర్ లేఖ రాశారు.     
 
రూ.23 కోట్లతో ప్రతిపాదనలు

కుమ్మరిపాలెం వద్ద ప్రారంభమై పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1.8 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. విద్యాధరపురం కేఎల్‌రావు హెడ్‌వాటర్ వర్క్స్‌లోని 16, 11, 8, 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్‌డే) ఫిల్టరైజేషన్ ప్లాంట్ల ద్వారా నగరంలోని విద్యాధరపురం, భవానీపురం, మధురానగర్, సింగ్‌నగర్, మొగల్రాజజపురం, బందరురోడ్డు తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా జరుగుతోంది. ఫ్లైఓవర్ నిర్మాణం నేపథ్యంలో వాటర్ పైపులైన్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. షిఫ్టింగ్‌కు రూ.18 కోట్లు, సైడ్ అప్రోచ్ రోడ్లకు అనుసంధానం చేసేందుకు రూ.5కోట్లతో ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.
 
నెలలో పనులు ప్రారంభం

హెడ్‌వాటర్ వర్క్స్‌లోని ప్రహరీ, ఆ పక్కనే ఉన్న షెడ్డు, అశోక్ స్తూపం, పొట్టిశ్రీరాములు విగ్రహం, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం, స్వాతంత్య్ర సమరయోధుల స్మారక భవనంలో కొంతభాగం ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డుకావడంతో వాటిని తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫ్లైఓవర్‌కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ అధికారులు మార్కింగ్ ఇచ్చిన తరువాత పైపులైన్ షిఫ్టింగ్ పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పైపులైన్ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల్లో ఈ పనుల్ని పూర్తిచేసేలా చేస్తున్నారు.
 
హమ్మయ్య
ఫ్లైఓవర్ పుణ్యమా అని వన్‌టౌన్ వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ముప్పై ఏళ్ల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్లు కావడంతో లీకేజీలు వచ్చి నీరు కలుషితమవుతోంది. ఈ పనులతో ఆ సమస్య తీరనుంది.
 
రూ.8కోట్లతో రోడ్ల విస్తరణ
ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ట్రాఫిక్ మళ్లింపు అనివార్యమైంది. 2016 ఆగస్టు నాటికి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏడాదిపాటు నగరంలో ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన పరిస్థితి. దీంతో రోడ్ల విస్తరణ షురూ అయ్యింది. గొల్లపూడి వై జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు, నైనవరం ఫ్లైఓవర్, ఇన్నర్‌రింగ్ రోడ్డు నుంచి సింగ్‌నగర్ ఫ్లైఓవర్ మీదుగా ఏలూరు రోడ్డుకు ట్రాఫిక్ మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా బైపాస్, సాయిబాబా గుడి, భగత్‌సింగ్, సాంబమూర్తి రోడ్లను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ.8 కోట్లు ఖర్చువుతుందని అంచనా. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ఈ పనులు ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement