
ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు
- ప్రభుత్వంపై జగన్ ధ్వజం
- బాబొస్తేనే జాబొస్తుందంటూ ఊదరగొట్టారు
- జాబులు రాలేదు.. జీతాలూ రావడం లేదు
- చంద్రబాబు పుణ్యమా అని ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు
- నిరుద్యోగ భృతి కోసం 1.75 కోట్ల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి
- డీఎస్సీ, ఏపీపీఎస్సీ అభ్యర్థులు చదువుకుంటూనే ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికలకు ముందు ఏ టీవీ ఆన్ చేసినా, ఏ పత్రిక చూసినా జాబు రావాలంటే బాబు రావాలి, బాబొస్తేనే జాబొస్తుంది అంటూ ఊదరగొట్టారు. పోస్టర్లు, పాం ప్లెట్ల ద్వారా ఇంటింటి ప్రచారం చేశారు. బాబొచ్చి 9 నెలలు పూర్తయింది. ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా..’ అంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతుండగా.. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికార పక్ష సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. దీంతో జగన్ కలుగజేసుకుని.. ‘ఉద్యోగాలిస్తామని చెప్పి ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు.
ఉద్యోగాలు రాకపోతే ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఈవేళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారా? ఇదిగో చూడండి మీ గెజిట్ (ఈనాడు)లోనే వచ్చింది, 10 నెలలుగా జీతాలు లేక ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెం దారు. ఇది చంద్రబాబు పుణ్యమే..’ అని ధ్వజ మెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది కాం ట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని జగన్ మండిపడ్డారు.
డీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం నిరుద్యోగ యువకులు చదువుతూనే ఉన్నారు.. చదువుతూనే ఉన్నారు. కానీ నోటిఫికేషన్లు రా వు. ఉద్యోగాలు రావు, కనీసం సర్వీస్ కమిషన్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేకపోయా రు.’ అని ధ్వజమెత్తారు. 1.75 కోట్ల కుటుంబా లు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నాయని, కానీ చంద్రబాబు సంతకం పెట్టి వదిలేశారని ఎద్దేవాచేశారు.
ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు: అచ్చెన్నాయుడు
జగన్ వ్యాఖ్యలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖల మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదన్నారు. గతంలో లాగా సొంత మనుషులకు ఉద్యోగాలు కట్టబెట్టకుండా అందరికీ వృత్తి నైపుణ్యాల పేరుతో శిక్షణ ఇచ్చి (స్కిల్ డెవలప్‌మెంట్) ఉద్యోగాలు ఇస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని అన్నారు. బాబు వచ్చారు కాబట్టి జాబు తప్పకుండా వస్తుందని చెప్పుకొచ్చారు.
పదివేల పోస్టులకు నోటిఫికేషన్...
ప్రతిపక్ష నేత జగన్, వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. బాబొస్తే జాబొస్తుందని చెప్పామని, అందుకే వచ్చే మేలో 10,312 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతి విషయాన్నీ అబద్ధంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
మా సభ్యులు ఎలా మాట్లాడాలో మీరెలా నిర్ణయిస్తారు?
శాసనసభలో ఏం మాట్లాడాలనే విషయంలో ప్రతిపక్ష సభ్యులకు హక్కు ఉంటుందని, ఏం మాట్లాడాలనేది శాసనసభాపతి నిర్దేశించలేరని జగన్ చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో వివరణ కోసం టీడీపీ సభ్యుడు శ్రవణ్‌కుమార్‌కు స్పీకర్ మైకు ఇచ్చారు. అదే సందర్భంలో కోడెల.. మీరు సభలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని బుగ్గనను ఉద్దేశించి అన్నారు. గత శాసనసభలో తెలుగువారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడారని, అలా మాట్లాడకూడదని చెప్పారు. బుగ్గన స్పందిస్తూ తాను అలా మాట్లాడలేదని, ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదని వివరించారు. ఈ దశలో జగన్ జోక్యం చేసుకుని స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసేటప్పుడు ప్రతిపక్ష సభ్యులకు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుంది. మా సభ్యులు ఎలా మాట్లాడాలో కూడా మీరే నిర్ణయిస్తారా? మీరు స్పీకరా? టీడీపీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారా?’ అంటూ ప్రశ్నించారు. స్పీకర్‌గా వ్యవహరించాలని, టీడీపీ సభ్యులుగా కాదని సూచించారు. తమ నేత వ్యాఖ్యలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ తిరిగి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి మైకు ఇచ్చారు.